సాగర్‌ ఆయకట్టుకు రబీ గండం!

సాగర్‌ ఆయకట్టుకు రబీ గండం! - Sakshi


6 లక్షల ఎకరాలకు నీటి కరువు

ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో లభ్యత జలాలు 53 టీఎంసీలు

గరిష్టంగా ఏపీకి దక్కే వాటా 35 టీఎంసీలు

తెలంగాణకు దక్కే వాటా 1820 టీఎంసీలు


ఆవిరి నష్టాలను తీసేస్తే ఇంకా తగ్గే అవకాశం

ఇందులోనూ 10 టీఎంసీలు తాగు అవసరాలకే

మిగతా 8 టీఎంసీలతో రబీ సాగు చేసేదెట్లా?

మొదలైన పంటల సాగు.. ఆందోళనలో రైతులు




సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కింద రబీ సాగుకు జల గండం పొంచి ఉంది. సాగర్‌ కింద ఆయకట్టు లక్ష్యాలు ఘనంగా ఉండటం.. నీటి లభ్యత తక్కువగా ఉండటం ఆయకట్టు రైతాంగాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే పంటల సాగు మొదలైన నేపథ్యంలో... రానున్న రోజుల్లో ఏమేరకు నీటి విడుదల ఉంటుందన్న దానిపై స్పష్టత లేకపోవడం, కృష్ణా బోర్డు తీరును బట్టి గరిష్టంగా 8 నుంచి 10 టీఎంసీలు మాత్రమే దక్కవచ్చన్న అంచనాలతో ఆందోళన నెలకొంది. ఇదే జరిగితే గతేడాది మాదిరే ఈసారి కూడా 6 లక్షల ఎకరాల రబీ సాగుకు నీటి కటకట తప్పని పరిస్థితి కనిపిస్తోంది.



రెండో ఏడాదీ ఇక్కట్లే..

సాగర్‌ జలాలపై ఆధారపడి నల్లగొండ జిల్లా పరిధిలో కాలువల కింద 2.8 లక్షల ఎకరాలు, ఎత్తిపోతల కింద 47 వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో మరో 2.82 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో (2014–15 రబీలో) మాత్రమే ఈ ఆయకట్టుకు ఆశించిన స్థాయిలో నీరందింది. ఆ ఏడాది కృష్ణాలో మొత్తంగా 585 టీఎంసీల మేర లభ్యత జలాల్లో తెలంగాణకు 38 శాతం వాటా లెక్కన 216 టీఎంసీలు దక్కాయి. ఇందులో సాగర్‌ కింద ఖరీఫ్‌లో 104 టీఎంసీలతో 5.22 లక్షల ఎకరాలకు, రబీలో 35 టీఎంసీలతో 3.5 లక్షల ఎకరాలకు నీరందించారు. ఎస్‌ఎల్‌బీసీ కింద 2.22 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యానికి గాను.. 13.5 టీఎంసీలతో 1.7 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. కానీ తర్వాత వరుసగా కరువు పరిస్థితులు ఏర్పడటంతో ఒక్క ఎకరానికీ నీరందలేదు. ఈ ఏడాదీ అదే పరిస్థితి కనిపిస్తోంది.



ఇష్టం వచ్చినట్లుగా వాడేయడం వల్లే!

ఈసారి కృష్ణాబేసిన్‌లో ఆశించిన మేర నీరు వచ్చినా.. సాగర్‌ మాత్రం పూర్తి స్థాయిలో నిండలేదు. శ్రీశైలం ప్రాజెక్టు చేరిన జలాలను ఆంధ్రప్రదేశ్‌ ఇష్టారీతిన లాగేయడం, తెలంగాణ సైతం మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులకు నీటి విడుదల చేయడమే దీనికి కారణం. సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు, నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 515.4 అడుగుల మేర 141.02 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో కనీస నీటి మట్టం (డెడ్‌ స్టోరేజ్‌) అయిన 510 అడుగులకు ఎగువన వినియోగించుకోగలిగిన నీటి నిల్వ గరిష్టంగా 10 టీఎంసీలు మాత్రమే. దీంతో రబీ కోసం పూర్తిగా శ్రీశైలంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.



శ్రీశైలం పూర్తి స్థాయి మట్టం 885 అడుగులు, నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకుగాను... ప్రస్తుతం 856 అడుగుల వరకు 95.59 టీఎంసీల నిల్వ ఉంది. ఇందులో కనీస మట్టమైన 834 అడుగులకుపైన లభ్యమయ్యేది 40 నుంచి 45 టీఎంసీలు మాత్రమే. అంటే సాగర్, శ్రీశైలం రెండు ప్రాజెక్టుల్లో కలిపి మొత్తం లభ్యత జలాలు 53.4 టీఎంసీలు మాత్రమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీటినే ఇరు రాష్ట్రాలూ పంచుకోవాల్సి ఉంది.



గండి కొట్టిన ఏపీ, కృష్ణా బోర్డు

వాస్తవానికి ఈ ఏడాది రబీలో నాగార్జున సాగర్‌ కింద 5.6 లక్షల ఎకరాలకు నీరివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా 50 టీఎంసీలు కేటాయించాలని గత నవంబర్‌లోనే కోరింది. కానీ దీనికి ఏపీ అభ్యంతరం చెప్పడం, బోర్డు సైతం ఏపీకి వత్తాసు పలకడంతో... రాష్ట్ర ప్రభుత్వం ఆయకట్టు లక్ష్యాన్ని 3.5 లక్షల (జోన్‌–1లో 2.3 లక్షలు, జోన్‌–2లో 1.2 లక్షల) ఎకరాలకు కుదించింది. అయినా ప్రస్తుత లభ్యత నీటితో ఈ ఆయకట్టుకు కూడా నీరిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తంగా కృష్ణా ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న 53.4 టీఎంసీల్లో... ఏపీకే 30 నుంచి 35 టీఎంసీల వరకు దక్కే అవకాశం ఉండగా, తెలంగాణకు 18 నుంచి 20 టీఎంసీలు అందవచ్చని అంచనా.



ఈ నీటిలోనూ వచ్చే ఐదు నెలల పాటు హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాల కోసం నెలకు 2 టీఎంసీల చొప్పున 10 టీఎంసీలు అవసరం. మిగతా 8 టీఎంసీలతో రబీ కింద నిర్ణయించిన 3.5 లక్షల ఎకరాల సాగు సాధ్యమయ్యే అవకాశాల్లేవు. వీటిన్నింటికీ తోడు వేసవిలో 6 నుంచి 7 టీఎంసీల మేర ఆవిరి నష్టాలు ఉంటాయి. అదే జరిగితే ఆయకట్టుకు చుక్క నీరూ అందే అవకాశం ఉండదని నీటి పారుదల వర్గాలు పేర్కొంటున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top