5 ముక్కలు!

5 ముక్కలు! - Sakshi


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యం చేకూరింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం జిల్లాల సంఖ్యను పెంచుతామని కేసీఆర్ సర్కారు ఇదివరకే ప్రకటించింది. గతేడాది కాలంగా ఈ అంశంపై ఎలాంటి కదలిక లేకపోవడంతో ప్రస్తుతానికి కొత్త జిల్లాల ప్రతిపాదనను పక్కనపెట్టినట్లు ప్రచారం జరిగింది.



అయితే, ఈ ప్రచారానికి తెరదించుతూ తాజాగా జిల్లాల డీలిమిటేషన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపి కొత్త జిల్లాల ఏర్పాటు తథ్యమనే సంకేతాలిచ్చింది. అందులో భాగంగా మన జిల్లాను కూడా విభజించనున్నారు. ప్రస్తుతమున్న జిల్లా రూపురేఖలు మార్చి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలను పరిపాలనా సౌలభ్య ప్రాతిపదికగా విభజించనున్నారు. ఈ మేరకు ప్రాథమికంగా కుస్తీపడుతున్న సర్కారు 2016 నాటికి జిల్లా విభజనకు కార్యరూపం ఇచ్చే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది.



 వికారాబాద్ ప్రాంతం.. ప్రత్యేక జిల్లా

 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పట్లో 11.09 లక్షల జనాభా ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది 52.76 లక్షలకు చేరింది. నగరీకరణతో జన విస్ఫోటం తలపిస్తున్న జిల్లా జనాభా ఏయేటికాయేడు పెరుగుతూ వస్తోంది. దీంతో నియోజకవర్గాల పునర్విభజనలో ఆరు అసెంబ్లీ స్థానాలస్థానే 14 శాసనసభ సెగ్మెంట్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పరిపాలనా సౌలభ్యం మేరకు జిల్లాను విభజించాలనే అంశం చర్చకు వచ్చింది.



ముఖ్యంగా జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో.. వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ పుట్టుకొచ్చింది. దీన్ని ఎన్నికల హామీగా మార్చుకున్న పార్టీలు అధికారంలోకి వస్తే వికారాబాద్ పరిసరాలను కలుపుతూ ప్రత్యేక జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చాయి. ఈక్రమంలోనే ఇటీవల కాంగ్రెస్ కూడా ఈ అంశంపై ప్రభుత్వ జాప్యాన్ని తప్పుబడుతూ మహాధర్నా చేపట్టింది.



 యాదాద్రి పేరిట కొత్త జిల్లా

 సగటున 15 లక్షల జనాభా, ఐదు నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లాలను పునర్వ్యస్థీకరించాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో బ్లూప్రింట్ తయారు చేసింది. దీనికి అనుగుణంగా జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదు జిల్లాల్లో మిళితం కానున్నాయి. ప్రస్తుతం వికారాబాద్, పరిగి, చేవెళ్ల, తాండూరు, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను కలుపుతూ వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అలాగే ఇబ్రహీంపట్నం, మలక్‌పేట, మహేశ్వరం, ఎల్‌బీనగర్, నల్లగొండ జిల్లాలోని భువనగిరి నియోజకవర్గాలను కలుపుతూ యాదాద్రి/ హైదరాబాద్ (తూర్పు) పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో సర్కారు ఆలోచిస్తున్నట్లు సమాచారం.



అయితే, పాలనాపరంగా హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఎల్‌బీనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మలక్‌పేట సెగ్మెంట్లను నల్గొండ జిల్లాలోని యాదాద్రిలో కలిపినా, జిల్లా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది. అయితే, మలక్‌పేట లేదా ఇబ్రహీంపట్నం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటిస్తే బాగుంటుందని రాజకీయ నిపుణులు, ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఈ నియోజక వర్గాలను వేరే చోట కలిపితే మాత్రం పరిపాలన సౌలభ్యం మాట అటుంచితే నాలుగు నియోజకవర్గాల ప్రజలకు పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఈ నేపథ్యంలో సహేతుక కారణాలు, శాస్త్రీయత లేకుండా నూతన జిల్లాల ఏర్పాటు తలపెడితే కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్టేననే ప్రచారం జరుగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top