దసరా కానుకగా కరువు భత్యం

దసరా కానుకగా కరువు భత్యం - Sakshi


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా 5.992 శాతం కరువు భత్యం(డీఏ) మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చినట్లు మంగళవారం ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. దసరా పండుగలోపే డీఏ మంజూరు చేస్తానని సీఎం చెప్పారని పేర్కొన్నాయి. ఈ లెక్కన సెప్టెంబర్ నెల వేతనంలో జూలై నుంచి రావాల్సిన డీఏను కలిపి ఇచ్చే అవకాశముంది. ఇటీవల కేంద్రం డీఏను ప్రకటించిన నేపథ్యంలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని వెంటనే డీఏ ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. జూలై నుంచి రావాల్సిన డీఏ 5.992 కలుపుకుంటే.. ఉద్యోగుల కరువుభత్యం 77.896 శాతానికి చేరుకోనుంది.



దీంతోపాటు పదో పీఆర్‌సీ విషయంపై ఉద్యోగ సంఘాలతో చర్చించి, సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. మంగళవారమిక్కడ సచివాలయంలో సీఎంను పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి, టీఎన్‌జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవీప్రసాద్,     రవీందర్‌రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ముందుగా డీఏ ఇచ్చేందుకు, ఆ తరువాత పీఆర్‌సీ అమలుకు కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయా సంఘాల నేతలు తెలిపారు. పెన్షనర్లకు తెలంగాణ ఇంక్రిమెంటు ఇచ్చేందుకు కూడా సీఎం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెప్పారు. అయితే వారికి ఎలా ఇవ్వాలి? ఆర్థికపరమైన అంశాలపై పరిశీలన జరపాలని ఆర్థిక శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిపై తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావును ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వివరించారు. అదే సమయంలో హెల్త్‌కార్డుల జారీకి అనుమతిస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని కూడా అధికారులను ఆదేశించారని సంఘాల నేతలు చెప్పారు. 1983 నుంచి 1989 వరకు నెలకు రూ.398 వేతనంతో పనిచేసిన ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరుకు దసరాలోగా చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. పదవీ విరమణ పొందిన టీచర్లు 300 రోజుల పని దినాలను అమ్ముకునేందుకు అడ్డంకిగా మారిన మెమో రద్దుకు కూడా అంగీకరించారని పీఆర్‌టీయూ నేతలు వెల్లడించారు. డీఏ ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలపడం పట్ల ఎస్టీయూ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘాలు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top