47 వేల కార్డుల సరెండర్

47 వేల కార్డుల సరెండర్ - Sakshi


సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: పౌరసరఫరాల శాఖ వ్యూహం ఫలించింది. బోగస్ కార్డుల బాగోతం బయటపడింది. అక్రమార్కుల ఏరి వేతకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అనుసరించిన వినూత్న విధానానికి రేషన్ డీలర్లు తలవంచారు. స్వీయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించని 47,059 కార్డులను అనర్హులుగా తేల్చి ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ కార్డులు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని రంగారెడ్డి జిల్లా సర్కిళ్లలోనివే కావడం గమనార్హం. ప్రజాపంపిణీ వ్యవస్థకు గుదిబండగా మారిన బోగస్ కార్డులను ఏరివేయడానికి ఏటా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం క నిపించలేదు.



ఈ నేపథ్యంలోనే అనర్హుల గుర్తింపునకు సరికొత్త ఎత్తుగడ వేసింది. సెల్ఫ్ డిక్లరేషన్ పేరిట లబ్ధిదారుకు ఒక ఫారంను అందజేసింది. కార్డుదారుల చిరునామా, పేర్లలో అక్షరదోషాల సవరణలను వీటిలో పూరించి ఇవ్వమని నిర్దేశించింది. ఈ ప్రక్రియ నిర్వహణ బాధ్యతను రేషన్ డీలర్లకు అప్పగించింది. డిక్లరేషన్ ఫారాలు నిర్ణీత వ్యవధిలో వెనక్కి రాకపోతే.. ఆ కార్డులను తొలగి స్తామనే సంకేతాలను పంపింది. తర్వాత నకిలీ కార్డులు బయటపడితే డీలర్‌షిప్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు వెనక్కిరాని 47,059 కార్డులను అనర్హులుగా తేల్చింది. ఈ కార్డులను బుధవారం రేషన్ డీల ర్లు స్వయంగా అధికారులకు అందజేయడం విశేషం. కేవలం డిక్లరేషన్ ఫారాలు సమర్పించని కార్డులేకాకుండా.. లబ్ధిదారుల జీవనశైలి బాగుందని అంచనా వేసి పక్కనపెట్టిన కార్డులు కూడా దీంట్లో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ కాట ఆమ్రపాలి ‘సాక్షి’కి తెలిపారు.

 

వెయ్యి టన్నుల ఆదా

బోగస్ కార్డుల తొలగింపుతో పౌరసరఫరాల శాఖకు భారీగా ఆదా కానుంది. కనిష్టంగా వెయ్యి టన్నుల బియ్యం కోటా మిగిలిపోనుంది. కార్డుకు సగటున 3.5 మంది సభ్యుల చొప్పున (ఒక్కో వ్యక్తికి 6 కేజీలు) లెక్కగట్టిన యంత్రాంగం.. కనిష్టంగా వెయ్యి టన్నుల బియ్యం మిగిలిపోనుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి జీహెచ్‌ఎంసీలోని సర్కిళ్లకే పరిమితం చేసిన ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా అమలు చేస్తే మరో 10 వేల నకిలీ కార్డులు తేలుతాయని అధికారవర్గాలు అంటున్నాయి. దీంతో సుమారు 12 వందల టన్నుల సబ్సిడీ బియ్యం అనర్హులు బోక్కేయకుండా నిరోధించవచ్చని చెబుతున్నాయి.



నల్లబజారుకు పెద్దఎత్తున సబ్సిడీ బియ్యం తరులుతుండడం.. ఈ వ్యవహారంలో ఇంటిదొంగల పాత్ర కూడా ఉందని తేలడంతో ఇద్దరు అధికారులపై జిల్లా యంత్రాంగం వేటు వేసింది. అంతేకాకుండా స్టాక్‌పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు తరలే రేషన్‌పై నిఘాను విస్తృతం చేసింది. అదేసమయంలో బినామీల అవతారమెత్తిన డీలర్లను గుర్తించడమేకాకుండా.. వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసింది. దీంతోపాటు బోగస్ కార్డులను సరెండర్ చేయకపోతే కోటా విడుదల చేసేది లేదని స్పష్టం చేయడంతో దారికొచ్చిన డీలర్లు అట్టిపెట్టుకున్న కార్డులను ప్రభుత్వానికి అందజేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top