409 మంది రైతుల ఆత్మహత్య

409 మంది రైతుల ఆత్మహత్య - Sakshi


వ్యవసాయశాఖ మంత్రి పోచారం వెల్లడి

 


 సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది జూన్ 24 వరకు రాష్ట్రంలో 409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అందులో 141 బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామన్నారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి మిగిలిన కుటుంబాలకు కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ భూతద్దంలో చూపిస్తున్నాయని విమర్శించారు. పోచారం బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతు ఆత్మహత్యలు జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు.



రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ నాయకులు రైతులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ విధానాల వల్లనే అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. రైతు యూనిట్‌గా పంటల బీమా సౌకర్యం ఉన్నట్లయితే ఆత్మహత్యలు జరిగేవి కావని, ఆ ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు.  రైతు రుణమాఫీ సొమ్మును బ్యాంకులకు విడతల వారీగా ఇస్తున్నామని... ఇక రైతుకు బాకీతో సంబంధం లేదని, అది ప్రభుత్వ బాకీ అని స్పష్టం చేశారు.



సకాలంలో రుణాలు చెల్లించి రెన్యువల్ చేసుకొన్న రైతుల వడ్డీ చెల్లించడానికి ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసిందని పోచారం చెప్పారు. అలాంటి రైతులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఎవరైనా బ్యాంకర్లు రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తే తిరిగి చెల్లిస్తామన్నారు. కొన్నిచోట్ల ఆంధ్రకు చెందిన బ్యాంకు అధికారులు ఇంకా బుద్ధి మార్చుకోలేదని విమర్శించారు.



లక్షలోపు రుణాలకు వడ్డీ లేదని... మూడు లక్షల లోపు రుణాలకు పావలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు 15 లక్షల మంది రైతులకు రూ. 6,631 కోట్ల రుణాలు ఇచ్చామని, ఈ నెలాఖరుకు 35 లక్షల మంది రైతులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. వర్షపాతం వివరాలను విపత్తు నిర్వహణ శాఖకు పంపామని, శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా రెవెన్యూశాఖ కరువు మండలాల ప్రకటన చేస్తుందని చెప్పారు. ఈ ఖరీఫ్‌లో అన్ని రకాల పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అయితే వరి సాగు మాత్రం తగ్గిందని మంత్రి పోచారం పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top