ఇక్రిశాట్‌లో చిరుత!

ఇక్రిశాట్‌లో చిరుత! - Sakshi


- పట్టుకునేందుకు మూడు నెలలుగా ప్రయత్నం

- రంగంలో దిగిన అటవీశాఖ

- చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్న వైనం

- భయాందోళనలో సమీప ప్రాంతాల జనం


 రామచంద్రాపురం:  ఇక్రిశాట్‌లో సంచరిస్తున్న చిరుత అధికారులకు చెమటలు పట్టిస్తోంది. తొలుత ఇక్రిశాట్‌లో చిరుత సంచరిస్తుందన్న పుకార్లు షికార్లు చేయడంతో అధికారులు ఆ మాటలన్నీ కొట్టిపారేశారు. అయితే ఇక్రిశాట్‌లోని సీసీ కెమెరాల్లో కూడా చిరుత సంచరిస్తున్న దృశ్యాలు నమోదు కావడంతో వెంటనే అధికారులు మేల్కొన్నారు. ఎలాగైనా చిరుతను పట్టుకోవాలని నెలరోజుల పాటు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటి కీ ఫలితం లేక స్థానిక అటవీశాఖ అధికారులను సంప్రదించారు. వలలు తెచ్చి బోనులు పెట్టినా చిరుత చిక్కకపోవడంతో అటు అధికారులు, అటు ఇక్రిశాట్ సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 

ఎక్కడినుంచి వచ్చిందో గానీ...

అంతర్జాతీయ మెట్ట పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆ ప్రాంతమంతా గుబురుగా చెట్లు, పలు రకాల పంటలతో పచ్చగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, ఓ చిరుత పులి గత కొన్ని నెలలుగా ఇక్రిశాట్‌లో ఎవరికి కనిపించకుండా సంచరిస్తోంది. తొలుత ఈ చిరుతను ఇక్రిశాట్ పంట క్షేత్రాల్లో పనిచేసే కార్మికులు గమనించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పినా, చాలా కాలం ఎవరు పట్టించుకోలేదు. సీసీ కెమెరాల్లో అది కనిపించడంతో ఇక్రిశాట్ అధికారుల్లో చలనం మొదలైంది. అయితే ఇక్రిశాట్‌లోని వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, అక్కడి క్వార్టర్స్‌లో నివసిస్తుండడంతో స్థానిక అధికారులు వారికి ఈ విషయం చెప్పకుండానే చిరుత కోసం వేట సాగించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో చిరుత సంచారంపై జిల్లా వైల్డ్‌లైఫ్ ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారాన్ని గమనించి దాన్ని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. అయితే రెండు నెలలుగా అటవీశాఖ అధికారులు ఇక్రిశాట్ మొత్తం వెదికినా చిరుతను మాత్రం పట్టుకోలేకపోయారు.

 

చిక్కినట్టే చిక్కి...

అయితే ఇటీవల చిరుతను గుర్తించిన ఫారెస్టు అధికారులు మత్తు పదార్థంతో ఉన్న బుల్లెట్‌ను గన్‌ద్వారా దాని శరీరంలోకి పంపగలిగారు. అది సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే దాన్ని పట్టుకునేందుకు వె ళ్లేలోపే, అది అక్కడి నుంచి పరుగు తీసింది. మత్తు మోతాదు తక్కువగా ఇవ్వడం వల్లే చిరుత తప్పించుకో గలిగిందని ఫారెస్టు అధికారులు తేల్చారు. అయితే  ఈ ఘటన ఆనోటా ఈనోటా బయటకు పొక్కడంతో ఇక్రిశాట్‌లో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఏ క్షణంలో చిరుత వచ్చి దాడి చేస్తుందోనని ఇక్రిశాట్ సమీప ప్రాంతాల వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top