త్రీడీ పాలన!

త్రీడీ పాలన! - Sakshi


డిఫైన్, డిజైన్, డెలివర్.. ఇదే తారక మంత్రం

 

 సాక్షి ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ సర్కారు సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది! నిరంతరం పఠిస్తున్న అభివృద్ధి మంత్రాన్ని ఆచరణలో పెట్టేందుకు ‘త్రీడీ’ విధానాన్ని రూపొందించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆయన మాటలను చేతల్లోకి మార్చేందుకు ఈ పద్ధతిపైనే ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రతి కీలక సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వస్తోంది. ఇంతకీ త్రీడీ అంటే మరేదో కాదు.. ఒక విధాన నిర్ణయాన్ని స్పష్టంగా నిర్వచించుకుని పక్కాగా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకునే ప్రక్రియ. అదే డిఫైన్, డిజైన్, డెలివర్. ఈ మూడింటినీ కలిపే త్రీడీ విధానం అంటారు.

 

 పస్తుతం తొలి రెండు దశలపైనే రాష్ర్ట ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇవి పక్కాగా పూర్తి చేశాక అంతిమంగా డెలివర్ దశపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ప్రభుత్వ ముఖ్యుడొకరు వివరించారు. దీనిపై అధికార యంత్రాంగం ఇప్పటికే చురుగ్గా కసరత్తు చేస్తోంది. డిఫైన్ దశలో వివిధ పథకాలు, కార్యక్రమాలపై ప్రభుత్వ ఆలోచనల్లో స్పష్టత తీసుకుంటారు. ఎన్నికల సమయంలో తెలంగాణ సమాజానికి టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాల కోణంలో సర్కారు నిర్ణయాన్ని తెలుసుకుంటారు. ప్రతి అంశంలోనూ అనుసరించాల్సిన విధానాన్ని నిర్వచిస్తారు. తుదకు నిర్ధారిస్తారు. దళితులకు మూడెకరాల భూమి, పక్కా స్థానికులకే ఫీజు రీయింబర్స్‌మెంట్, మైనారిటీలకు, గిరిజనులకు రిజర్వేషన్లు, రెండు పడక గదులతో పక్కా ఇళ్లు వంటివి ఈ కోణంలోనివే! ఇక రెండో దశలో ప్రస్తుత పథకాలు, కార్యక్రమాల్లోని లోటుపాట్లను, తదుపరి ప్రాధాన్యాలను గుర్తించడం. తదనుగుణంగా ప్రణాళికలు, మార్గదర్శకాలను రచించడం వంటి చర్యలు చేపడతారు. రేషన్ కార్డుల స్వచ్ఛంద అప్పగింతకు వీలు, అక్రమ కట్టడాలపై కఠిన వైఖరి, రేషన్ కార్డుల్లో అనర్హుల ఏరివేత, పక్కా ఇళ్ల పథకంపై సీఐడీ విచారణ, ఫీజుల పథకానికి పకడ్బందీ మార్గదర్శకాలు వంటివి ఈ కోణంలో తీసుకున్న నిర్ణయాలే. ఈ దశలో భాగంగానే ‘మన ఊరు - మన ప్రణాళిక’ను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టి ప్రజల వాస్తవ అవసరాలను ఒక్కచోట క్రోడీకరిస్తున్నారు.

 

 రాష్ర్టంలోని అన్ని కుటుంబాల వాస్తవ స్థితిగతులపై రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించాలనే నిర్ణయం ఈ కోవలోనిదే. శుక్రవారం దీనిపై సీఎం కేసీఆర్ స్వయంగా ఉన్నత స్థాయి భేటీ నిర్వహించనున్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్‌డీవోలు, తహశీల్దార్లు సహా దాదాపు 600 మంది దాకా అధికారగణం పాల్గొనే ఈ భేటీలో సర్వే చేయాల్సిన తీరుతెన్నులను వివరిస్తారు. ఇందుకు సమగ్ర ప్రణాళికను ఆవిష్కరిస్తారు. దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు పాల్గొనే ఈ సర్వే వివరాలతో ఆధార్ వివరాలనూ అనుసంధానించి ఓ సమగ్ర డేటాబేస్‌ను రూపొం దిస్తారు. అన్ని రకాల ప్రభుత్వ పథకాలకూ ఈ సమాచారాన్నే ఆధారంగా చేసుకుంటారు. ‘డిఫైన్, డిజైన్ దశల్లోనే పథకాల రూపకల్పనలో నిధుల పరిమితులు, ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటాం. డెలివర్ దశలో ప్రాధాన్యాలను బట్టి బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదలలో జాగ్రత్తలూ తీసుకుంటాం. పథకాల అమలు దశకొచ్చేసరికి పక్కా కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉంటేనే.. ఆశించిన లక్ష్యాలను సాఫీగా చేరుకోగలుగుతాం. ఇదే ప్రభుత్వ ఆలోచన’ అని ఓ ఉన్నతాధికారి వివరించారు.

 

 డిఫైన్ (నిర్వచించడం)

 పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై తన వైఖరి ఏమిటనేది స్పష్టంగా నిర్వచించుకోవడం, అధికార యంత్రాంగంలోనిదిగువస్థాయి వరకూ వివరించడం

 ఉదాహరణ:

 

 ఫాస్ట్ పథకానికి 1956 సంవత్సరాన్ని ‘స్థానికత’కు ప్రాతిపదికగా తీసుకోవడం!

 

 డెలివర్ (అమలు)

 

 పథకాల పటిష్ట అమలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యాల మేరకు కేటాయింపులు, నిధుల విడుదల, అమలుపై క్రాస్‌చెక్

 

 ఉదాహరణ: తక్కువ నిధులతో వెంటనే పూర్తయ్యే నీటి ప్రాజెక్టులకే  నిధుల విడుదల!

 

 డిజైన్ (ప్రణాళికా రచన)

 పథకాలు, కార్యక్రమాల్లో లోటుపాట్ల గుర్తింపు, ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ప్రణాళికల రచన, సరైన లబ్ధిదారుల గుర్తింపు, అనర్హుల ఏరివేత, పక్కా మార్గదర్శకాల రూపకల్పన.

 

 ఉదాహరణ:

 అన్ని పథకాలకూ ఆధార్‌ను లింక్ చేయడం, మైక్రోచిప్‌తో కూడిన రేషన్‌కార్డుల జారీ!




 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top