'డల్లాస్' నగరంగా హైదరాబాద్..!


- 'పీపుల్స్ పోలీస్' నినాదంతో ముందుకు

- పోలీస్‌స్టేషన్లకు మరమ్మతులు.. కొత్త భవనాలు

- పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం ఉద్యోగాలు

- రాష్ట్రంలో మిగులు కరెంట్ కోసం ప్రయత్నాలు

- ఎస్పీఎం తెరిపించి న్యాయం చేస్తాం

- మంచిర్యాలలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి

- కమిషనరేట్‌కు శంకుస్థాపన.. మోడల్ పీఎస్‌ల ప్రారంభోత్సవం




సాక్షి, మంచిర్యాల (ఆదిలాబాద్ జిల్లా): భవిష్యత్తులో పోలీస్‌శాఖలో చేపట్టే నియామకాల్లో 33 శాతం పోస్టులు మహిళలకే కేటాయించనున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. చరిత్రలో లేని విధంగా.. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ల నిర్వహణకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తోందన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఒక్కో పోలీస్ స్టేషన్ నిర్వహణకు రూ.75 వేలు.. జిల్లా, పట్టణ కేంద్రాల్లో రూ.50 వేలు, మండలాల్లోని పోలీస్ స్టేషన్లకు రూ.25 వేల చొప్పున కేటాయిస్తున్నట్లు మంత్రి వివరించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, చెన్నూరు, కాగజ్‌నగర్ నియోజకవర్గాల్లో డీజీపీ అనురాగ్‌శర్మతో కలిసి మంత్రి పర్యటించారు. మంచిర్యాల పరిధిలోని నస్పూర్‌లో 9.10 ఎకరాల భూమిలో నిర్మించనున్న పోలీస్ కమిషనరేట్‌కు భూమి పూజ చేసి.. శిలాఫలకం ఆవిష్కరించారు. జైపూర్, బెజ్జర్‌లలో మోడ్రన్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర పాలకుల హయాంలో రాష్ట్ర పోలీసులు సమాజ సేవ కార్యక్రమాలకు దూరంగా.. అంటరాని వాళ్లుగా ఉండేవారని చెప్పిన హోంమంత్రి స్వరాష్ట్రంలో స్వచ్ఛ భారత్.. మిషన్ కాకతీయ.. హరితహారం వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యులవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనాలంటే.. ముందుగా పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించిన సీఎం కే సీఆర్ పోలీస్‌శాఖకు రూ.300 కోట్లు విడుదల చేశారన్నారు. రాష్ట్రంలో శిథిలావస్థ దశలో ఉన్న పోలీస్ స్టేషన్లకు మరమ్మతులు.. కొత్త భవనాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

డిసెంబర్ నాటికి 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

హోంగార్డులతోపాటు ఆటో, ట్యాక్సీ, ప్రైవేట్ లారీ డ్రైవర్లు, పాత్రికేయులకు ఏడాదికి రూ.5 లక్షల బీమా పథకం ఇప్పటికే ప్రకటించామన్నారు. హైదరాబాద్‌ను అమెరికాలో ఉన్న డల్లాస్ నగరం మాదిరిగా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పరిశ్రమలు నెలకొల్పేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో ఈ ఏడాది డిసెంబర్ వరకు 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. నల్లగొండ దామెర్లలోనూ విద్యుతుత్పత్తి కేంద్రం ఏర్పాటవుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రజలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రైతులకు వ్యవసాయ పనులకు పగలే తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామన్నారు. కాగజ్‌నగర్‌లో మూతబడ్డ ఎస్పీఎంను తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఎస్పీఎం లేనిదే కాగజ్‌నగర్ లేదన్న హోం మంత్రి మిల్లు నిర్వహణకు ముందుకొచ్చే కంపెనీలకు ఉచిత విద్యుత్‌తో పాటు అవసరమైన ముడిసరుకులు సబ్సిడీ రూపంలో అందజేస్తామన్నారు.

సనత్‌నగర్‌లో 'డబుల్ బెడ్ రూమ్' సిద్ధం..

'డబుల్ బెడ్ రూమ్' పథకానికి సంబంధించిన నిర్మాణం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో పూర్తయ్యిందన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో అర్హులకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఒకే రోజు 1.25 లక్షల మంది నిరుపేదలకు 125 గజాల భూమి పట్టాలు పంపిణీ చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్రంలో 30 వేల చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామన్నారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు లైను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. అగ్నిమాపక కేంద్రాలు లేవని చెప్పిన హోంమంత్రి ఏడాదిలోగా ఫైర్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top