కరువు మండలాలు 33


 కరువు మండలాలివే..

 మర్పల్లి, మోమిన్‌పేట, నవాబ్‌పేట, శంకర్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్, హయత్‌నగర్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్, ధారూ రు, బంట్వారం, పెద్దేముల్, తాండూరు, బషీరాబాద్, యాలాల, దోమ, గండేడ్, కుల్కచర్ల, పరిగి, పూడూరు, షాబాద్, శంషాబాద్, మహేశ్వరం, మంచాల, ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు.


 

 కేంద్రానికి

 నివేదించిన ప్రభుత్వం

 రైతు రుణాల మంజూరు.. చెల్లింపులో

 వెసులుబాటు కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని కలెక్టర్లకు ఉత్తర్వులు

 నీటి ఎద్దడి నివారణకు

 ప్రత్యేక కార్యాచరణ

 రూపొందించాలని ఆదేశం

 పంటలవారీగా నష్టం వివరాలు (అంచనా)

 పంట    విస్తీర్ణం (ఎకరాల్లో)

 

 

 మొక్కజొన్న             56,282.5

 పత్తి                         38,177.5

 కంది                       1,695

 పెసర                       8,060

 జొన్న                      2,650

 వరి                          3,220


 

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఎట్టకేలకు కరువుపై సర్కారులో కదలిక వచ్చింది. తాజాగా కరువు మండలాల జాబితాను కేంద్రానికి నివేదించింది. జిల్లావ్యాప్తంగా 33 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తూ నివేదికను పంపింది. ఈ మేరకు కరువు మండలాల్లోని రైతాంగానికి రుణాల మంజూరు, చెల్లింపులో వెసులుబాటు కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కరువు ప్రభావిత మండలాల్లో నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

 

 వర్షాభావం... అపార నష్టం..

 అనావృష్టితో జిల్లా ప్రజానీకం వరుసగా అతలాకుతలమవుతోంది. గత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జిల్లాలో సాగుచేసిన పంటలు దాదాపుగా ఎండిపోయాయి. ఖరీఫ్‌లో జిల్లాలో 1,78,238 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. అయితే వర్షాభావ పరిస్థితులతో ఇందులో 1,10,085 ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

 

 ఈ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే రైతులకు పెట్టుబడి రాయితీ దక్కే అవకాశముంది. అదేవిధంగా భూగర్భజలాలు సైతం భారీగా పడిపోయాయి. దీంతో జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. మరోవైపు తూర్పు ప్రాంతంలోని పలు మండలాలకు సరఫరా చేసే కృష్ణా నీటి కోటాలో జలమండలి కోత విధించింది. దీంతో తాగునీటి సమస్య మరింత తీవ్రమైంది. కరువు ప్రకటనలతో ఈ సమస్యలకు తాత్కాలిక ఉపశమనం కలగనుంది.

 

 రైతుకు అండగా ప్రభుత్వం : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

 రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుంది. వారికి చేయూతనిచ్చేందుకు జిల్లాలోని అన్ని గ్రామీణ మండలాలన్నింటినీ కరువు ప్రాంతాలుగా పేర్కొంటూ కేంద్రానికి నివేదిక పంపింది. జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చించా. అంతేకాకుండా జిల్లా పరిషత్‌లో సభ్యులు చేసిన ఏకగ్రీవ తీర్మాన అంశాన్ని కూడా వివరించా. దీంతో సీఎం సానుకూలంగా స్పందిస్తూ ఈ మేరకు అధికారులను ఆదేశించారు. కరువు మండలాల ప్రకటనలతో జిల్లా రైతాంగానికి ఆర్థిక చేయూత కలుగుతుంది. ప్రజల దాహార్తికి కూడా పరిష్కారం దొరుకుతుంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top