7 రోజులు...30 కుటుంబాలు

7 రోజులు...30 కుటుంబాలు - Sakshi


సాక్షి ప్రతినిధి, నల్లగొండ :జిల్లాలో తొలి విడత పరామర్శయాత్ర పూర్తయింది. రాజన్న బిడ్డకు అడగడుగునా జనం ఆదరాభిమానాలు చూపారు. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు గాను ఆయన కుమార్తె షర్మిల వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పరామర్శయాత్రలో భాగంగా జిల్లాలో ఏడురోజుల పాటు పర్యటించారు. ఏడోరోజు మంగళవారం సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండ లం మంగళితండా, ఆత్మకూర్.ఎస్. మండలం దుబ్బతండా, చివ్వెంలమండలం కుడకుడ గ్రామాల్లో షర్మిల పర్యటిం చారు. మృతుల కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి స్థితిగతులను తెలుసుకున్నారు. జిల్లాలో షర్మిల పర్యటనకు మంచి స్పందన కనిపిం చింది. జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో జరిగిన ఈ యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ కుటుంబంపై తమకున్న ప్రేమను చాటుకున్నారు.

 

 ఏడో రోజు యాత్ర సాగిందిలా....

 సూర్యాపేట పట్టణంలోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనంనుంచి మంగళవారం ఉదయం పరామర్శకు బయలుదేరిన షర్మిల తొలుత చివ్వెంల మండలం వాల్యతండా ఆవాసం మంగళితండాలోని నూనావత్ లక్ష్మి ఇంటికి చేరుకుని ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితులను లక్ష్మి భర్త హేమ్లాను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు మంగళితండాకు వెళ్తున్న మార్గంలో గల వాల్యతండాలో గిరిజనులు షర్మిలకు స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు చేస్తూ గ్రామంలోనికి ఆహ్వానించారు. అక్కడినుంచి ఆత్మకూర్.ఎస్ మండలం దుబ్బతండాకు వెళ్లి అక్కడ అజ్మీరా గంసి కుటుంబాన్ని పరామర్శించారు షర్మిల. షర్మిలను చూసిన గంసి కుమారుడు మంగు బోరున విలపించడంతో షర్మిల ఆతన్ని ఓదార్చారు.

 

 వర్షాలు సకాలంలో కురవక.. పంటలు పండక.. జీవనం ఇబ్బందిగా మారిందని, రాజశేఖరరెడ్డి కాలంలో వ్యవసాయానికి సాగునీరందించేందుకు కాలువలు తవ్వించాడని.. నేటి వరకు సాగునీటి విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఎలా బతకాలో అర్థం కావడం లేదంటూ.. రోదించాడు. వారి కుటుంబ పరిస్థితులను విన్న షర్మిల మంచి రోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని వారికి ధైర్యం చెప్పి, కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. అనంతరం చివ్వెంల మండలం కుడకుడకు వెళ్లి అక్కడ శేర్ల రాములు కుటుంబాన్ని పరామర్శించారు. షర్మిల వారి ఇంట్లో అడుగుపెట్టగానే రాములు భార్య గుర్వమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. గుర్వమ్మను షర్మిల అక్కున చేర్చుకొని ఓదార్చి వారి కుటుంబ పరిస్థితులను అడిగితెలుసుకున్నారు.

 

 వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చివరి రోజు సాగిన పరామర్శయాత్రలో ప్రతి గ్రామంలో, తండాల్లో ప్రజలు ఆయా రహదారుల వెంట బారులు తీరి ఉండి షర్మిలకు స్వాగతం పలికారు. ఆమెతో కరచాలనం చేసేందుకు మహిళలు పోటీ పడ్డారు. షర్మిల ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ నమస్తే అన్న..నమస్తే అక్కా.. నమస్తే చెల్లి.. నమస్తే పెద్దయ్య అంటూ ముందుకు సాగారు.ఆమె వెంట వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుశ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు గున్నం నాగిరెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, భీష్వ రవీందర్, అమృతాసాగర్, జి.రాంభూపాల్‌రెడ్డి, సత్యం శ్రీరంగం, ఆకుల మూర్తి, ముస్తాబ్ అహ్మద్, ప్రపుల్లారెడ్డి, జార్జిహెర్బర్ట్, షర్మిలా సంపత్, కె.వెంకటరెడ్డి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, బంగిలక్ష్మణ్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, నల్లగొండ జిల్లా నేతలు పిట్ట రాంరెడ్డి, మల్లు రవీందర్‌రెడ్డి, దొంతిరెడ్డి సైదిరెడ్డి, దండా శ్రీనివాసరెడ్డి, పచ్చిపాల వేణుయాదవ్, ఇతర జిల్లాల నాయకులు ఎం. కల్యాణ్, జశ్వంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, అనిల్‌కుమార్, మహిపాల్‌రెడ్డి, కె.నరేందర్‌రెడ్డి, డి.రేవతి, శ్రీదేవి తదితరులున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top