27మంది చిన్నారుల అదృశ్యం!

27మంది చిన్నారుల అదృశ్యం! - Sakshi


నల్లగొండ జిల్లా మోత్కూర్‌లో ఘటన  

లీగల్‌సెల్ సర్వీస్ అథారిటీకి ఫిర్యాదు  

విచారణకు ఆదేశం


 

మోత్కూరు: నల్లగొండ జిల్లా మోత్కూరులో స్మైల్ వెల్ఫేర్‌ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అబ్బాస్ చిల్డ్రన్‌హోం నుంచి 27 మంది చిన్నారులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. చిల్డ్రన్‌హోం నుంచి పిల్లలు అదృశ్యమయ్యారని లీగల్‌సెల్ సర్వీస్ అథారిటీకి ఫిర్యాదు అందింది. దీంతో ఈ ఘటనపై విచారణ జరపాలని పోలీస్‌శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్పీ ప్రభాకర్‌రావు వెంటనే జిల్లా విద్యాధికారి ఎస్.విశ్వనాథరావును అప్రమత్తం చేశారు.



రామన్నపేట సీఐ ఎ.బాలగంగిరెడ్డి, తహసీల్దార్ బి.ధర్మయ్య, ఎంఈఓ జె.సత్తయ్య విచారణ జరుపుతున్నారు. అబ్బాస్ చిల్డ్రన్‌హోంను నల్లగొండ జిల్లా మునగాలకు చెందిన డి.కవిత, కరీంనగర్‌కు చెందిన బాలరాజులు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ నిర్వహణకు ఫ్రాన్స్ దేశం నుంచి  నిధులు వస్తున్నాయని తెలిసింది. హోంలో వివిధ ప్రాంతాలకు చెందిన 27మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు.



కొన్నిరోజులుగా నిధులు దుర్వినియోగమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 18వ తేదీ రాత్రి నుంచి చిల్డ్రన్‌హోం మూసినట్లు తెలుస్తోంది. అయితే పిల్లలను ఇతరచోటుకు తరలించారా..లేక సంరక్షకుల వద్దకు చేర్చారా అన్న విషయం తేలాల్సి ఉంది. కాగా, నిర్వాహకులలో ఒకరైన కవిత, ఐదుగురు చిన్నారులు, ఆమె తల్లిదండ్రులు నకిరేకల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top