ప్రమోషన్ ప్లీజ్..

ప్రమోషన్ ప్లీజ్..


అశోక్, రాజన్న ఇద్దరు చిన్నపటి నుంచి స్నేహితులు. డిగ్రీ వరకు కలిసే చదువుకున్నారు. 1990లో రాజన్న కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అశోక్ రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. 25 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అశోక్ ఆర్డీవో అయ్యాడు. రాజన్న మాత్రం ఇప్పటికీ కానిస్టేబుల్‌గానే ఉన్నాడు. పాతికేళ్లుగా పదోన్నతి ఎరుగక వచ్చీపోయే ఎస్సైలకు, సీఐలకు సెల్యూట్ చేస్తూనే ఉన్నాడు. ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు మారుతున్నారు.. రాష్ట్రమూ మారింది.



ఎందరో ఉన్నతాధికారులు వచ్చిపోతున్నారు.. కానీ జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుళ్ల తలరాత మాత్రం మారడం లేదు. పాతికేళ్లుగా ఎలాంటి ఎదుగూబొదుగూ లేకుండా అదే పోస్టులో కొనసాగిస్తూ, గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


 

జిల్లాలో కానిస్టేబుళ్లు సుమారు 3,000 మందికి పైనే..

 25 ఏళ్లుగా కానిస్టేబుళ్లుగానే విధులు

గొడ్డు చాకిరీ చేస్తున్నా గుర్తింపు కరువు

పట్టించుకోని ప్రభుత్వం, ఉన్నతాధికారులు

నిరాశతోనే విధుల నిర్వహణ


ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో సుమారు 3 వేలకు పైగా మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 20 ఏళ్లకు పైగా సర్వీస్ చేస్తున్న కానిస్టేబుళ్లు 1200 మంది ఉన్నారు. వీరిలో 1990లో విధుల్లో చేరిన వారు 360 మంది ఉండగా, 23 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు 200 మంది, 22 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు 400 మంది, 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు 240 మంది ఉన్నారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వీరు కనీసం హెడ్‌కానిస్టేబుల్‌గానైనా ఉద్యోగోన్నతికి నోచుకోవడం లేదు.



తీవ్రవాద ప్రాబల్యం అధికంగా ఉన్న కాలం నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఒకే క్యాడర్‌లో పనిచేస్తూ తీవ్ర మనోవేదన చెందుతున్నారు. హెడ్‌కానిస్టేబుల్, ఎస్సైల డ్యూటీలు కూడా చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల పనులకు తమనే ఉపయోగించుకుంటున్నారని, ఎంత గొడ్డు చాకిరీ చేసినా పదోన్నతి మాత్రం కల్పించడం లేదని వాపోతున్నారు. జిల్లాలో పాతికేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్నా ఇంకా పదోన్నతి రాని పరిస్థితి ఉంది.



ఎస్సై, సీఐలకు మాత్రం ఆరేడేళ్లలోనే పదోన్నతులు కల్పిస్తున్న ప్రభుత్వం నిరంతరం విధుల్లో ఉండే కానిస్టేబుళ్లను మాత్రం పక్కనబెడుతోంది. కొంత మంది కానిస్టేబుళ్లు కనీసం సొంత ఇళ్లు కూడా కట్టుకోకుండానే తన పదవీకాలం ముగించుకుంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

పట్టించుకోని అధికారులు, ప్రభుత్వాలు..


తమ మానసిక వేదనను ఇటు పోలీసు ఉన్నతాధికారులు, అటు ప్రభుత్వాలు, పోలీసు సంఘాలు పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డీజీపీలుగా బాధ్యతలు చేపట్టిన ప్రతి అధికారి పోలీసు సంక్షేమం, పదోన్నతులకు కృషి చేస్తామని, ప్రతి కానిస్టేబుల్‌కు కనీసం మూడు పదోన్నతులు పొందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోలేదు. పాతికేళ్లుగా కానిస్టేబుల్ పోస్టులో ఉన్న తమకు తమ సర్వీస్ కాలంలో మూడు పదోన్నతులు ఎలా సాధ్యమవుతాయని అంటున్నారు.



ప్రస్తుతం పోలీసు విభాగంలో ఓ కానిస్టేబుల్‌కు పదోన్నతి రావాలంటే ఆ స్టేషన్‌లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌కు ఏఎస్సై, ఏఎస్సైగా ఉన్న వారికి ఎస్సైగా ఉద్యోగోన్నతి వస్తేనే కానిస్టేబుల్‌కు పదోన్నతి లభిస్తుంది. అయితే.. హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై పోస్టులు తక్కువగా మంజూరు ఉన్నాయని, పోస్టులు ఖాళీగా లేకనే పదోన్నతులు కల్పించడం లేదని తెలుస్తోంది. ఉన్నతాధికారులకు సంబంధించిన పదోన్నతుల విషయంలో పోస్టులు ఖాళీగా లేకున్నా అదనపు పోస్టులు సృష్టించి ఇస్తున్న ప్రభుత్వం కానిస్టేబుళ్ల విషయానికొస్తే ఖాళీ లేవని చెప్పడం ఎంత వరకు సమంజసమని వారు వాపోతున్నారు.



అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నట్లే తమ పోలీసు శాఖలో కూడా డిపార్ట్‌మెంట్ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసు శాఖలోకి వచ్చే యువకుల్లో చాలామంది డిగ్రీ, పీజీలు చేసిన వారే ఉంటున్నారు. అలాంటి వారికి తక్కవ సమయంలో ఉద్యోగోన్నతులు కల్పించడం ద్వారా పోలీసు శాఖకు ఎంతో ఉపయోగం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

 

మూడు నెలల శిక్షణ..

కానిస్టేబుల్ క్యాడర్‌లో 30 ఏళ్లు సర్వీస్ చేసి హెడ్‌కానిస్టేబుల్‌గా ఉద్యోగ ఉన్నతి పొందిన వారికి మూడు నెలలపాటు శిక్షణ ఇస్తారు. ఎస్సై క్యాడర్ నుంచి సీఐగా, సీఐ నుంచి డీఎస్పీగా, డీఎస్పీ నుంచి ఏఎస్పీ స్థాయికి వెళ్లిన వారికి ఎలాంటి శిక్షణ ఏర్పాటు చేయని ప్రభుత్వం, కానిస్టేబుల్ నుంచి హెడ్‌కానిస్టేబుల్‌గా ఉద్యోగోన్నతి పొందిన వారికి శిక్షణ ఏర్పాటు చేయడంపై పలువురు వ్యతిరేకత కనబరుస్తున్నారు.



పాతికేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన తమకు హెడ్‌కానిస్టేబుల్ విధులు, విధానాలు తెలుస్తాయని చెబుతున్నారు. అధికారులకు ఒకలా.. కానిస్టేబుల్ విషయంలో మరోలా వ్యవహరించడం సరైంది కాదంటున్నారు. ప్రతి ఉద్యోగికి పదోన్నతిని గర్వంగా భావిస్తాడని, తాము మాత్రం అలాంటి అనుభూతికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top