30,156 తేలిన బోగస్ తెల్ల రేషన్‌కార్డుల సంఖ్య తక్కువే

30,156 తేలిన బోగస్ తెల్ల రేషన్‌కార్డుల సంఖ్య తక్కువే - Sakshi


నల్లగొండ : రేషన్‌కార్డుల్లో  బోగస్ కార్డులను ఏరివేసే ప్రక్రియకు జూలై 31వ తేదీ వరకు గడువు విధించినా, పూర్తిస్థాయిలో గుర్తించలేకపోయారు. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో  వీఆర్‌ఓ, వీఆర్‌ఏలతో ఇంటింటి సర్వే చేపట్టి, మిగతా బోగస్‌కార్డులు ఏరివేసేం దుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో 8.38 లక్షల కుటుంబాలకు గాను,  బోగస్‌కార్డులు తొలగించిన తర్వాత కూడా 9.71 లక్షల తెల్లకార్డులు, 60 వేల గులాబీకార్డులు ఉన్నాయి. కుటుంబాల కంటే కార్డులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జూలై 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30,156 బోగస్ రేషన్‌కార్డులు తొలగించారు. తొలగించిన రేషన్‌కార్డులకు సంబంధించి 2.32 లక్షల యూనిట్లు రద్దయ్యాయి.



జిల్లాలో 10.02 లక్షల రేషన్ కార్డులకు గాను 30,156 కార్డులు బోగస్‌గా తేలడంతో,  ప్రస్తుతం 9,71,844 కార్డులు ఉన్నాయి. అదేవిధంగా 32,49,226 యూనిట్లకు గాను 2,32,000 యూనిట్లు (బోగస్ కార్డులలో ఉన్నవి) తొలగించగా 30,17,226 ప్రస్తుతం యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లకే ఆగస్టులో పీడీఎస్ సరుకులు అందజేస్తారు. అయినా జిల్లాలో కుటుంబాలకంటే రేషన్‌కార్డులు ఇంకా 1,93,844 ఎక్కువున్నాయి.

 

తగ్గనున్న రేషన్ కోటా

బోగస్ తెల్ల రేషన్‌కార్డులు ఏరివేయడంతో జిల్లాకు కేటాయించే పీడీఎస్ కోటా తగ్గనుంది. దీంతో ప్రభుత్వానికి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాకు 14,500 మెట్రిక్ టన్నుల బియ్యం, 1542 లీటర్ల కిరోసిన్, 500 టన్నుల చక్కర అందజేస్తున్నారు. కాగా ప్రస్తుతం బోగస్ రేషన్ కార్డుల తొలగింపు వల్ల బియ్యంలో 928 మెట్రిక్ టన్నులు, కిరోసిన్‌లో 60.31 లీటర్లు, 15.07 టన్నుల చక్కర కోటా తగ్గనుంది.

 

తెల్లకార్డులు ఉన్న 25 మంది ఉద్యోగుల గుర్తింపు


బీపీఎల్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం తెల్లరేషన్ కార్డులు పొందారు. ఇలా కార్డులు పొందిన 25 ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించారు. తెల్లకార్డుకు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తుండడం వల్ల ఉద్యోగులు సైతం ఈ కార్డులు పొందారు. వీరి నుంచి తెల్ల రేషన్‌కార్డులు స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడానికి కసరత్తు నిర్వహిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top