పది నిమిషాలకు ఒకరు రొమ్ము కేన్సర్‌తో మృతి

పది నిమిషాలకు ఒకరు రొమ్ము కేన్సర్‌తో మృతి


* తెలుగు రాష్ట్రాల్లో నాలుగేళ్లలో రెండు లక్షల మందికి స్క్రీనింగ్

* 210 మందికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ


సాక్షి, హైదరాబాద్: ‘దేశవ్యాప్తంగా ఏటా కొత్తగా 1.50 లక్షల రొమ్ము కేన్సర్ కేసులు నమోదవుతుండగా.. బాధితుల్లో ప్రతి పది నిమిషాలకు ఒకరు మృత్యువాత పడుతున్నారు. అవగాహన లేమివల్ల 60శాతం మంది మహిళలు అడ్వాన్స్‌డ్ స్టేజీలో వైద్యులను ఆశ్రయిస్తున్నారు’ అని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పి.రఘురామ్ తెలిపారు. అంతర్జాతీయ రొమ్ము కేన్సర్ అవగాహన మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.



ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 2012 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో 3,900 గ్రామాల్లోని రెండు లక్షల మంది నిరుపేద మహిళలకు క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ నిర్వహించగా, వీరిలో 210 మందికి రొమ్ము కేన్సర్ ఉన్నట్లు బయటపడిందన్నారు. వ్యాధిని ముందే గుర్తించడంవల్ల వీరిని కాపాడగలిగినట్లు తెలిపారు. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలో మమోగ్రఫీ పరీక్ష ఉత్తమమన్నారు. రొమ్ము కేన్సర్ మాసాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 2న కేబీఆర్ పార్కులో ఉదయం 6.30 గంటలకు పింక్‌రిబ్బన్ వాక్‌తో పాటు చార్మినార్, బుద్ధ విగ్రహం, రవీంద్రభారతి, ఎయిర్‌పోర్ట్, కిమ్స్ ఆస్పత్రులు, చారిత్రక కట్టడాలపై గులాబీ రంగు కాంతులను ప్రసరింపజేసి రొమ్ము కేన్సర్‌పై విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.



అదేవిధంగా అక్టోబర్ 23న విజయవాడలో పింక్ రిబ్బన్ వాక్ నిర్వహిస్తామన్నారు. తాము చేపట్టిన ఈ పాపులేషన్ బేస్‌డ్ స్క్రీనింగ్ ప్రోగ్రాం దేశానికే ఓ బెంచ్‌మార్క్‌గా మారిందన్నా రు. తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, రొమ్ము కేన్సర్‌ను జయించిన బాధితురాలు ఉషాలక్ష్మి, ఎస్‌బీఐ సీజీఎం హరిదయాళ్ ప్రసాద్ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top