కన్నతల్లుల కడుపుకోత

కన్నతల్లుల కడుపుకోత - Sakshi


ఆ చిన్నారులు తెల్లవారగానే లేచారు.. వడివడిగా తయారయ్యారు. పాఠశాలకు వెళుతూ అమ్మానాన్నలకు బైబై చెప్పారు. ఎంతో ఉషారుగా పాఠశాల బస్సెక్కారు. అంతలోనే ఆ పాలబుగ్గలను రైలు రూపంలో వచ్చిన మృత్యువు చిదిమేసింది. వెల్దుర్తి మండలం మాసాయిపేట కాపలాలేని రైల్వేగేట్ వద్ద గురువారం ఉదయం నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పాఠశాల బస్సును ఢీకొట్టిన ఘటనలో 14 మంది విద్యార్థులతోపాటు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన కన్నతల్లులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

 

పసిమొగ్గలను చిదిమేసిన మృత్యుశకటం

ఛిద్రమైన దేహాలు.. చెల్లాచెదురైన ఆశలు

కన్నీటి సంద్రమైన మెతుకుసీమ

ఘటనాస్థలికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు

మెదక్ : ఆ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం విద్యార్థుల నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. చదువులమ్మ ఒడిలో ఆడిపాడాల్సిన ఆ విద్యార్థులు.. మృత్యుఒడిలో విగతజీవులుగా మారారు. వెల్దుర్తి మండలం మాసాయిపేటలోని కాపలాలేని రైల్వే గేట్ వద్ద గురువారం ఉదయం రైలు వస్తున్నా చూసుకోకుండా బస్సును అలాగే పట్టాలెక్కించడంతో.. నాందేడ్  ప్యాసింజర్ రైలు ఢీకొని ఆ బస్సులోని విద్యార్థులతోపాటు, బస్సు డ్రైవర్, క్లీనర్ మృత్యువాతపడ్డారు. అప్పటిదాకా కేరింతలతో వున్న చిన్నారుల దేహాలు ఒక్కసారిగా ఛిద్రమవడాన్ని చూసి భరించలేని ఆ కన్నతల్లులు బోరున విలపించారు. ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి మృతదేహాలకు గురువారం మెదక్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.



విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. ఆ చిన్నారులను తలుచుకుంటూ.. వారి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ.. గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. వారి రోదనలను ఆపడం ఎవరితరం కాలేకపోయింది. ప్రమాదం విషయం తెలుసుకున్న మెదక్ ప్రజలు ఆస్పత్రికి పెద్దఎత్తున చేరుకుని చిన్నారుల మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కూలీనాలి చేసుకుంటూ.. కష్టనష్టాలు భరిస్తూ...పిల్లలను బడికి పంపితే మా కలలను కల్లలు చేస్తూ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారా.. బిడ్డా? అంటూ కన్నవారు గుండెలు బాదుకున్నారు. మేమేం పాపం చేశామని దేవుడు మాకే ఎందుకు ఈ శిక్ష విధించాడంటూ రోదించారు.  



 

ఇంటి దీపాలను ఆర్పేసిన నిర్లక్ష్యం..

అధికారులు, ప్రైవేట్ యాజమాన్యాలు, డ్రైవర్, క్లీనర్‌ల నిర్లక్ష్యం కన్నవారి కనుపాపలను కాటేసింది.ఈ ప్రమాదంలో పలు కుటుంబాల ఇంటిదీపాలే ఆరిపోయాయి. గౌసియా-అబ్దుల్ రషీద్, చరణ్-దివ్య, సుమన్-శ్రీవిద్య, శృతి-విశాల్-భువన అనే అన్నాచెల్లెలంతా దుర్మరణం చెందడంతో వారి కన్నవారి కలలు కల్లలయ్యాయి. తల్లిదండ్రులు ఎన్నో మొక్కులు మొక్కగా పండిన కలల పంట మల్లేష్ యాదవ్ సైతం ఈ ప్రమాదంలో మృత్యువాత పడటంతో వారి బాధ వర్ణానాతీతమైంది. వీరితోపాటు ఈ ప్రమాదంలో  రమేష్, ధనుష్‌కోటి, వంశీ, విష్ణులతోపాటు డ్రైవర్ బిక్షపతిగౌడ్, క్లీనర్ రమేష్‌గౌడ్‌ల మృతదేహాలకు మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘోర ప్రమాదం వైద్యులను సైతం కన్నీరు పెట్టించింది.



ఏమని ఓదార్చాలమ్మా..!

కన్న బిడ్డల్ని పోగొట్టుకున్న మిమ్మల్ని ఏమని ఓదార్చాలమ్మా..? మేం ఏం సాయం చేసినా.. పోయిన మీ బిడ్డలను తేగలమా? అని కంటతడిపెడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డి, జి. జగదీశ్వర్‌రెడ్డి తదితరులు బాధితులను ఓదార్చారు. కాగా, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చిలుముల మదన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ప్రజా గాయకుడు గద్దర్, జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, టీఆర్‌ఎస్ నేతలు దేవేందర్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, నర్సారెడ్డి తదితరులు కూడా బాధితులను ఓదార్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top