లాభాల వాటా 20%

లాభాల వాటా 20% - Sakshi


గోదావరిఖని : సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు లాభాల్లో 20 శాతం వాటా చెల్లించనున్నారు. సంస్థ 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.418 కోట్ల లాభాలు ఆర్జించగా ఇందులోంచి 20 శాతం వాటా చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రకటించారు. సింగరేణిలో మొత్తం 62 వేల మంది కార్మికులు, ఉద్యోగులు ఉండగా 83.6 కోట్లు వీరికి అందనున్నాయి. జిల్లాలో 21 వేల మందికి మేలు జరగనుంది. లాభాలా వాటా ప్రకటించాలని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌తోపాటు వివిధ యూనియన్లు కూడా సీఎంకు కొంతకాలంగా వినతిపత్రాలు అందిస్తున్నాయి.  

 

పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, నల్లాల ఓదెలు, చెన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావు తదితరులు సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రిని కలిసి లాభాలవాటా త్వరగా ప్రకటించాలని వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే లాభాల వాట ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సింగరేణి యాజమాన్యానికి ఉత్తర్వులు అందగానే మస్టర్ల ప్రాతిపదికన లాభాల వాటా పంపిణీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. 2012-13లో 400 కోట్ల లాభాల్లో 18 శాతం వాటా చెల్లించగా ఈ ఏడాది రెండు శాతం అధికంగా చెల్లించనుండడంపై టీబీజీకేఎస్ అధ్యక్షుడు ఎ.కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తదితరులు హర్షం ప్రకటించారు.

 

2,554 మందికి ఒకేసారి ఉద్యోగాలు

సింగరేణిలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన, మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల స్థానంలో వారి డిపెండెంట్లకు ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కూడా సింగరేణి యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి తుది జాబితాలో ఉన్న 2,554 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నారు.

 

దసరాకు ముందే దీపావళి బోనస్

సింగరేణి కార్మికులకు దీపావళి పండుగ సమయంలో చెల్లించే రూ.40 వేల బోనస్‌ను దసరా పండుగకు ముందే చెల్లించేలా యాజమాన్యం చర్యలు తీసుకుంటోందని గుర్తింపు సంఘం నేతలు కనకరాజు, మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. 27న దీపావళి బోనస్‌ను కార్మికులు, ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారని పేర్కొన్నారు. దసరా పండుగకు చెల్లించే రూ.16 వేల అడ్వాన్స్‌ను 25న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తంగా సెప్టెంబర్ నెల సింగరేణి కార్మికులకు ఆర్థిక లాభాన్ని చేకూర్చనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top