వడదెబ్బ


47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత..అంటే బయట అడుగుపెడితే భగ్గుమనే పరిస్థితి. భానుడి ప్రకోపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు..20 మంది ఒక్కరోజే వడదెబ్బతో మృతిచెందారు. నీలగిరి..సూర్యుడి ప్రతాపానికి గింగిరాలు కొడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల కారణంగా పగటి ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగిపోతోంది. ఉదయం 9 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాత్రి 11 గంటల వరకు వడగాల్పులు వీస్తున్నాయి. ఓవైపు వడగాల్పులు..మరోవైపు ఎండతీవ్రతకు రెండు నెలల్లో వడదెబ్బతో జిల్లావ్యాప్తంగా సుమారు 80 మందికిపైగా మృత్యువాత పడ్డారు.                - సాక్షి నెట్‌వర్‌‌క

 

 నల్లగొండ టౌన్

 భానుడి భగభగలకు ప్రజలు అల్లాడుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న ఎండల కారణంగా పగటి ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోతోంది. ఉదయం 9 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉక్కపోత తీవ్రత మరింత పెరగడంతో ప్రజలు అత్యవసరమనిపిస్తేనే బయలకు వెళ్తున్నారు. మధ్యాహ్నం వేళ్లల్లో బయటకు రావడానికే సాహసించడం లేదు. రాత్రి 11 గంటల వరకు వడగాల్పులు వీస్తుండడంతో ఉక్కపోత వలన చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల కారణంగా రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 80 మందికి పైగా వరకు మృత్యువాత పడ్డారు. ఏప్రిల్ 15 వరకు అకాల వర్షాల కారణంగా పగటి ఊష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడడంతో ప్రజలు కొంత ఊరట చెందారు.

 

  కానీ మళ్లీ భానుడి ప్రతాపానికి తిరిగి పగటి ఊష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలు, గొర్రెల మేకల పెంపకం దారులు ,వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాపడుతున్న వారు వడదెబ్బ బారిన పడి పిట్టల్లారాలి పోతున్నారు. గురువారుం జిల్లాలో రికార్డు స్థాయిలో ఊష్ణోగ్రత 47 డిగ్రీలకు చేరింది. ఉద్యోగులు, వ్యాపారులు ఏసీలు, కూలర్లతో సేద తీరుతుండగా సామాన్యులు ఇళ్లకే పరిమితమవుతున్నారు.తెలంగాణ జిల్లాలలో మరో మూడు నాలుగురోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

 

 మిర్యాలగూడ : భానుడి ప్రకోపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం ఒక్కరోజే జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో 20 మంది మృత్యువాతపడ్డారు.మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన బొంగరాల రాములు (55)బుధవారం పశువుల వెంట వెళ్లాడు. రాత్రి ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్లే వరకే చనిపోయాడు.  మోత్కూర్ మండల కేంద్రానికి చెందిన కోమటి కొండయ్య(70) కూలీగా జీవనం సాగిస్తున్నాడు. బుధవారం కూలికి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే మృత్యువాతపడ్డాడు. అదే విధంగా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామానికి చెందినబొప్పని సీమోను అలియాస్ శ్రీను (55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం వ్యవసాయ భూమి వద్ద పనులు చేస్తూ ఎండవేడిమికి అస్వస్థతకు గరయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.

 

 దూపహాడ్‌లో వృద్ధురాలు

 పెన్‌పహాడ్ : మండల పరిధిలోని దూపహాడ్ గ్రామానికి చెందిన మల్లెపల్లి అంతమ్మ(70) రెండు రోజుల నుంచి పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావంతో వేడిమి తట్టుకోలేక అస్వస్థతకు గురై మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు వలిగొండలో ఇద్దరు వృద్ధులు వలిగొండ :  మండలంలోని టేకలుసోమారం గ్రామానికి చెందిన నారగోని అంజమ్మ (65) బుధవారం రాత్రి అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందింది. అలాగే సుంకిశాలకు చెందిన ఎడ్ల ఎల్లయ్య (65) గురువారం మధ్యాహ్నం ఇంట్లోనే మృతిచెందాడు.

 

 సూర్యాపేటలో ఐదేళ్ల బాలుడు

 సూర్యాపేట మున్సిపాలిటీ : సూర్యాపేట పట్టణం వినాయకనగర్ కాలనీకి చెందిన గోరుగంటి వెంకన్న-జ్యోతి దంపతుల కుమారుడు గోరుగంటి హర్షిత్(5) బుధవారం ఎండవేడిమికి తాళలేక వడదెబ్బకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతతో గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఆత్మకూరు(ఎం): మండలంలోని కూరెళ్ల గ్రామానికి చెందిన నిమ్మల కౌంసమ్మ(50) మధ్యాహ్నం గ్రామంలో తిరిగింది. ఇంటికి వచ్చి అస్వస్థతకు గురైంది. దీంతో దాహం వేయడంతో మంచి నీరు తాగింది. కొద్దిసేపటికి అక్కడికక్కడే మృతిచెందింది.  

 

 అక్కెనపల్లిలో చిన్నారి..

  (నార్కట్‌పల్లి ) : మండలంలోని అక్కెనపల్లి గ్రామానికి చెందిన మిడిదోడి పరుశురాములు, నాగరాణి నాగమణి దంపతులకు ఇద్దరు సంతానం. పరుశురాములు వ్యవసాయం చేస్తుండగా,  నాగరాణి ఉపాధికూలికి వెళ్తోంది. చిన్న కుమారుడు మణికంఠ (17) నెలలు బాలుడిని అమ్మ వద్ద వదిలి దంపతులు పనికి వెళ్లారు. బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చే సరికి మణికంఠకు జ్వరం వచ్చింది. గ్రామంలో ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ను సంప్రదించగా మోరుగైన చికిత్స కోసం స్థానిక కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు.  

 

 మాతానగర్‌లో ఉపాధి కూలీ

 కోదాఅర్బన్: కోదాడ పట్టణం మాతానగర్‌కు చెందిన పద్మాల సావిత్రమ్మ(65) కూలీగా జీవనం సాగిస్తోంది. ఎండల కారణంగా బుధవారం అస్వస్థతకు గుైరె   గురువారం ఉదయం మరణించింది.

 కనగల్ : మండలంలోని పగిడిమర్రికి చెందిన వృద్ధుడు అద్దంకి బుచ్చయ్య(75)  వ్యవసాయ బావి వద్ద ఎండలో తిరిగి అస్వస్థతకు గురయ్యాడు. రాత్రి నిద్రకు ఉపక్రమించాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేనరికి నిద్రలోనే మృతిచెందాడు.

 

 చిట్యాలలో..

 చిట్యాల: పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో నివసించే బాతుక రాములు(62) స్థానికంగా గల సిమెంటు ఇటుకల తయారీ కేంద్రంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం కూడ సాయంత్రం వరకు ఇటుకల కేంద్రంలో పనిచేశాడు. ఆ తరువాత అకస్మాత్తుగా తనకు ఎలాగో అవుతుందంటూ కిందపడి మృతిచెందాడు.

  మోతె: మండల పరిధిలోని సర్వారం గ్రామానికి చెందిన రాములు (75),హుస్సేబాద్ గ్రామానికి చెందిన చర్లపల్లి భిక్షం(65) ఎండ వేడిమికి అస్వస్థతకు గురయ్యారు. ఇంటి వద్దే చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు.

 కోదాడఅర్బన్ : మండల పరిధిలోని బీక్యాతండా మాజీ సర్పంచ్ బాణోతు గోప్యా(68), కొమరబండకు చెందిన ఉపాధి హామీ కూలీ కొనిక పంగు ఆనందం(50), తమ్మర గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ వీర్ల చెన్నయ్య(55) వడదెబ్బతో మృతిచెందారు. పెన్‌పహాడ్ : మండల పరిధిలోని భక్తాళాపురం ఆవాసం భాగ్యతండాకు చెందిన ధరావత్ చంద్రు(65) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి పథకంలో రోజు వారి కూలీగా పని చేస్తున్నాడు.  రెండు రోజుల నుంచి పెరి గిన ఎండ వేడిమికి తట్టుకోలేక మృతిచెందాడు.   

 

 వడదెబ్బతో 6500 కోడిపిల్లలు..

 మోత్కూరు :  వడ దెబ్బతో కోడిపిల్లలు మృతిచెందిన సంఘటన మోత్కూరు మండలం పనకబండ గ్రా పంచాయతీ పరిధిలోని రాగిబావి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు పానుగుళ్ల విష్ణు తెలిపిన కథనం ప్రకారం వివరాల ప్రకారం.. విష్ణుకు చెందిన కోళ్లఫారంలో రెండు రోజుల వయస్సు గల కోడిపిల్లలను పెంచుతున్న 6500 కోడిపిల్లలు వడ దెబ్బతో మృతిచెందాయి. ఒక్కోకోడిపిల్ల సుమారు 50 గ్రాముల బరువు ఉంటుంది. దీంతో రూ.1.50 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top