1969 తెలంగాణ ఉద్యమ అమరుల కుటుంబాలను ఆదుకుంటాం

1969 తెలంగాణ ఉద్యమ అమరుల కుటుంబాలను ఆదుకుంటాం - Sakshi


రామగిరి :1969 ఉద్యమంలో అసువులుబాసిన కుటుంబాలను మలి విడత తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలతో సమానంగా ఆదుకుంటామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 69 ఉద్యమంలో తను కూడా పాల్గొన్నానని తెలిపారు. అప్పటినుంచి మలివిడత ఉద్యమం, కేసీఆర్ నిరాహార దీక్ష, తెలంగాణ ఆవిర్భావం వరకు ముఖ్య సంఘటనలు వివరించారు. 69 ఉద్యమంలో ప్రముఖ భూమిక నిర్వహించిన చెన్నారెడ్డిని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ నుంచి ఎన్నికైన 11మంది ఎంపీలు ఒకేసారి కాంగ్రెస్‌లో కలిసేందుకు నిర్ణయించడం కారణంగా అప్పట్లో ఉద్యమాన్ని నిలిపివేయాల్సి వచ్చిందన్నారు.

 

 విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ 1969 ఉద్యమ పునాదులపైనే మలిదశ తెలంగాణ ఉద్యమం నిర్మించి కేసీఆర్ విజయం సాధించారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్‌సార్ లాంటి మేధావులు తెలంగాణ ఉద్యమ సెగ చల్లారకుండా ఆక్సీజన్ అందిస్తూ వచ్చారని, అది కూడా తెలంగాణ సాధనకు ఒక కారణమన్నారు. కేసీఆర్ సమక్షంలో 1969 ఉద్యమకారుల చర్చ జరిగినప్పుడు వారందరినీ గుర్తించి గౌరవించాల్సిన అవసరముందని అన్నారని, అప్పటి ఉద్యమకారులకు తప్పక సహాయం అందుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పూల రవీందర్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ 1969లో ప్రచార సాధనాలు లేకున్నా, ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందన్నారు. అప్పటి ఉద్యమకారులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలన్నారు.

 

 సంఘం జిల్లా కన్వీనర్ చక్రహరి రామరాజు మాట్లాడుతూ 69 ఉద్యమకారులకు గుర్తింపుకార్డులు, పెన్షన్, బస్సు, రైలులో ఉచిత ప్రయాణం, వైద్య సదుపాయాలు, రాజకీయ నామినేటెడ్ పదవులు, అప్పటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ అందించాలని కోరారు. కో-కన్వీనర్ మారం సంతోష్‌రెడ్డి సంఘం నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల, సంఘాలకు చెందిన 200 మందికిపైగా హోంమంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, నాయకులు కట్టా ముత్యంరెడ్డి, కె.చిన్నవెంకట్‌రెడ్డి, బండా నరేందర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య, కత్తుల శంకర్, కత్తుల వెంకటేశం, లతీఫ్, సయ్యద్ హుస్సేన్, మైనం శ్రీనివాస్, బక్క పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top