అర్జీలు 17.78 లక్షలు

అర్జీలు 17.78 లక్షలు - Sakshi


 ఆహార భద్రతకు 12.67 లక్షలు

పింఛన్ల కోసం 3.61 లక్షల దరఖాస్తులు

కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణకు 1.5 లక్షలు..

క్షేత్ర పరిశీలన ప్రారంభించిన యంత్రాంగం


 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంక్షేమ పథకాల అర్హతకు సంబంధించి సర్కారు విధించిన గడువు ముగిసింది. సోమవారం సాయంత్రం గడువు ముగిసే సమయానికి జిల్లా వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాల కోసం 17.78 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఆహార భద్రతకు సంబంధించి 12.67  లక్షల దరఖాస్తులందాయి. పింఛన్ల కోసం 3.61 లక్షలు దరఖాస్తులు రాగా, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం 1.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో అధికారగణం క్షేత్ర పరిశీలన  ప్రారంభించింది.



నిరంతర ప్రక్రియే..: వాస్తవానికి సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపిక సైతం నిరంతరంగా సాగేదే. ఈ క్రమంలో ఎంపికకు డెడ్‌లైన్ విధించడంపై వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోఖంగుతిన్న సర్కారు.. గడువు లేకుండా నిరంతరంగా దరఖాస్తులు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో గురువారం నాటికి 17.78 దరఖాస్తులు రాగా... ఈ సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుతం జిల్లాలో 1,838 రేషన్ దుకాణాల పరిధిలో 9,38,324 రేషన్ కార్డుదారులున్నారు. వీరంతా ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా.. కొత్తగా 3,29,168 దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా పింఛన్లకు సంబంధించి ప్రస్తుతం 2,65,654 మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారు. తాజాగా.. 3.61 లక్షల దరఖాస్తులు అందాయి.



ఇక క్షేత్రస్థాయి తనిఖీలు..

సోమవారం వరకు దరఖాస్తుల స్వీకరణలో బిజీగా గడిపిన అధికారులు ఇక క్షేత్రస్థాయి తనిఖీలకు ఉపక్రమించారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో తనిఖీ బృందాలు కార్యరంగంలోకి దిగగా.. తాజాగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ ప్రక్రియను మొదలు పెట్టేందుకు అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు.



సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టనున్నారు. ప్రతి మండలానికి ఆరుగురు అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనిఖీ అధికారులు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సరిపోల్చుతూ అర్హతను నిర్దేశించి అనంతరం ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పొరపాట్లు చోటుచేసుకుంటే అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేయడంతో తనిఖీ ప్రక్రియ కట్టుదిట్టంగా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top