ఎగిరి.. శ్మశానంలో పడ్డారు

ఎగిరి.. శ్మశానంలో పడ్డారు


మాసాయిపేట నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రోజులాగే తెల్లారింది. ఎప్పటిలాగే ఆ చిన్నారులు ఆడుతూ పాడుతూ స్కూల్‌కు బస్సులో బయలుదేరారు. మరో పది నిమిషాల్లో స్కూలుకు చేరుకునేలోపు.. అటుగా వస్తున్న నాందెడ్ ప్యాసింజర్ రైలు.. స్కూల్ బస్సును ఢీ కొట్టింది. ఇంకేముంది..? కళ్లుమూసి తెరిచేలోపు బస్సు తుక్కుతుక్కైంది. అందులోని చిన్నారులు హహాకారాలు చేస్తూ పక్కనే ఉన్న సమాధులపై ఎగిరిపడ్డారు. బస్సు డ్రైవర్ సహా 13 మంది అక్కడికక్కడే మరణించగా.. ఆస్పత్రికి తరలించేలోపు కొందరు, చికిత్స పొందుతూ మరికొందరు వెరసి 20 మంది ఈ లోకాన్ని వదిలారు. డ్రైవర్, క్లీనర్ మినహా చనిపోయిన విద్యార్థులంతా 13 ఏళ్లలోపు వారే. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట సమీపంలో జరిగిన ఘోరకలికి నిదర్శనమిది. తల్లిదండ్రుల రోదనలు, బంధువుల వేదనలు.. స్థానికుల ఆందోళనలు.. రాజకీయ నేతల పరామర్శలు.. పోలీసుల హడావుడితో ఆ ప్రాంతమంతా హృదయ విదార కంగా మారింది.

 

 రక్తపు ముద్దలుగా మారిన అన్నం మెతుకులు..

 

 దుర్ఘటన అనంతరం మాసాయిపేట ప్రాంతమంతా మరుభూమిని తలపించింది. రైలు ఢీ కొట్టిన స్కూల్ బస్సు నుజ్జునుజ్జయ్యింది. బస్సులో ఉన్న ప్రతి విద్యార్థికీ ఇనుప చువ్వలు గుచ్చుకోవడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగును తలపించింది. ఘటనా స్థలంలో విద్యార్థుల స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, టిఫిన్ బాక్స్‌లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. టిఫిన్ బాక్సుల్లోని అన్నం మెతుకులు చిన్నారుల రక్తంతో తడిసి నెత్తుటి ముద్దలుగా కన్పించాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.

 

 ఆలస్యమే మృత్యువై కబళించిన వేళ..

 

 ఆలస్యం అమృతం విషం అనే మాట చిన్నారుల పాలిట అక్షరాలా నిజమైంది. ప్రతిరోజూ తెల్లవారుజామున 4.30 గంటలకు మాసాయిపేట స్టేషన్‌కు రావాల్సిన నాందేడ్ ప్యాసింజర్ రైలు గురువారం ఏకంగా నాలుగు గంటలకుపైగా ఆలస్యంగా రావడం... అదే విధంగా ప్రతిరోజు 8.15 గంటలకే ఆ ప్రాంతానికి రావాల్సిన స్కూల్ బస్సు కొత్త డ్రైవర్ కారణంగా 40 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడంతో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రైలు, బస్సు డ్రైవర్లలో ఏ ఒక్కరు తొందరగా అక్కడికి వచ్చినా ఇంతటి ఘోరకలి జరిగి ఉండేది కాదని అక్కడున్న స్థానికులు వాపోయారు. కనీసం రోజూ డ్యూటీకి వచ్చే డ్రైవర్ ఉన్నా విద్యార్థుల ప్రాణాలకు ఢోకా ఉండేది కాదన్నారు. ఏమైతేనేం.. అటు రైలు, ఇటు కొత్త డ్రైవర్ ఆలస్యంగా అక్కడికి చేరుకోవడం.. అక్కడ రైల్వే గేటు లేకపోవడం.. రైలు వస్తున్న విషయాన్ని బస్సు డ్రైవర్ గుర్తించకపోవడం.. వెరసి ముక్కుపచ్చలారని పసిమొగ్గల బంగారు భవిష్యత్తును శ్మశానం పాల్జేసింది.

 

 విద్యార్థులంతా సీఎం నియోజకవర్గానికి చెందిన వారే..

 

 ఈ దుర్ఘటనలో చనిపోయిన విద్యార్థులంతా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వారే. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్ మండల పరిధిలోని ఇస్లాంపూర్, కిష్టాపురం, వెంకటాయపల్లి, గుండ్రెండిపల్లి గ్రామాల చిన్నారులే. కాగా, ఘటనా స్థలానికి రాజకీయ నాయకులు వ చ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ‘ముఖ్యమంత్రి డౌన్ డౌన్’ అని నినదిస్తూ మాసాయిపేట రైల్వే పట్టాలపై ధర్నాకు దిగారు. ‘ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలంతా ఇక్కడికి వచ్చి పరామర్శించి పోతుంటే.. మేం ఓట్లేస్తే గెలిచి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇక్కడకు రాడా?’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి హరీష్‌రావుకు సైతం స్థానికుల నిరసనల సెగలు తగిలాయి. బాధితులను పరామర్శించి వెళుతున్న హరీష్‌రావు వైపు కొందరు రాళ్లు విసిరారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top