తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు


హైదరాబాద్:

తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. గురువారం 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా ఉన్న జె పూర్ణ చందర్ రావును అక్కడి నుంచి బదిలీ చేసి ఏసీబీ అదనపు డైరెక్టర్ జనరల్ గా నియమించింది. ప్రస్తుతం ఆ పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న డీజీపీ అనురాగ్ శర్మ అక్కడి నుంచి రిలీవ్ చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ లో అదనపు డీజీగా పనిచేస్తున్న గోవింద్ సింగ్ ను బదిలీ చేసి సీఐడీ అదనపు డీజీగా నియమించారు.



హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ గా ఉన్న జితేందర్ పదోన్నతిపై తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా నియమితులయ్యారు. సీఐడీ ఐజీపీగా పనిచేస్తున్న సౌమ్యామిశ్రాను అక్కడి నుంచి బదిలీ చేసి పోలీస్ వెల్ఫేర్ ఐజీపీగా నియమించారు. స్టీఫెన్ రవీంద్ర పదోన్నతిపై హైదరాబాద్ రీజన్ పశ్చిమ మండలం ఇన్స్ పెక్టర్ జనరల్ గా నియమించారు. అలాగే ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్ డీజీఐ అకున్ సబర్వాల్ ను అక్కడి నుంచి బదిలీ చేయగా ఆ స్థానంలో స్టీఫెన్ రవీంద్ర పూర్తి అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తారు. అకున్ సబర్వాల్ ను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ గా నియమించారు.



రాచకొండ ఐజీ శశిధర్ రెడ్డిని పదోన్నతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ గా నియమించారు. వరంగల్ రేంజ్ డీఐజీ సి. రవివర్మను కరీంనగర్ రేంజ్ డీఐజీగా బదిలీ చేశారు. వై.నాగిరెడ్డి ప్రస్తుతం ఆ పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీఐజీ సీఐడీ ఎన్. శివశంకర్ రెడ్డిని నిజామాబాద్ డీఐజీగా నియమించారు. ఖమ్మం ఎస్పీ షహనాజ్ ఖాసింను అక్కడి నుంచి బదిలీ చేసి ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్ర నిర్వహించిన స్థానంలో సైబరాబాద్ కమిషనర్ గా నియమించారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ వి. రవిందర్ ను పదోన్నతిపై హైదరాబాద్ సిటీ ట్రాఫిక్  జాయింట్ కమిషనర్ గా నియమించారు.



ప్రస్తుతం ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సత్యనారాయణ పదోన్నతిపై అదే ఏసీబీలో అదనపు డైరెక్టర్ పోస్టులో నియమించారు. గ్రేహౌండ్స్ కమాండర్ గా పనిచేస్తున్న తరుణ జోషిని అక్కడి నుంచి మార్చి రాచకొండ జాయింట్ కమిషనర్ గా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న బివ.నవీన్ కుమార్ తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా నియమించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top