మరో మొగ్గను చిదిమేశారు

మరో మొగ్గను చిదిమేశారు - Sakshi


- చెలరేగిన కామాంధులు

- తండ్రిపై దాడి చేసి కూతురి అపహరణ

- ఆటోలో ఎత్తుకెళ్లిన ఐదుగురు దుండగులు

- సామూహిక అత్యాచారం, ఆపై హత్య

- రంగారెడ్డి జిల్లాలో రాక్షసకాండ

 

బంట్వారం:
మానవ రూపంలోని రాక్షసులు చెలరేగిపోయారు. సభ్యసమాజం తలదించుకునేలా పైశాచికంగా వ్యవహరించారు. తండ్రి కళ్లముందే కూతురిని ఆటోలో అపహరించుకుపోయారు. సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. అందరినీ కలచివేసిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బంట్వారం మండల పరిధిలోని మోత్కుపల్లి గేటు సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.



పోలీసుల కథనం ప్రకారం మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందిన సిమ్రాన్(14) మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో ఇరవై రోజుల క్రితం హైదరాబాద్‌లోని లింగంపల్లిలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లింది. తండ్రి మెగావత్ కమాల్ గురువారం తన కూతురిని తీసుకురావడానికి మోపెడ్‌పై వికారాబాద్ వచ్చి అక్కడి నుంచి రైలులో లింగంపల్లికి చేరుకున్నాడు. సిమ్రాన్‌ను తీసుకుని రాత్రి ఎనిమిది గంటలకు వాడీ ప్యాసింజర్ రైలులో వికారాబాద్ వచ్చాడు. అక్కడి నుంచి మోపెడ్‌పై తండ్రీకూతుళ్లు స్వగ్రామానికి బయల్దేరారు.



మార్గమధ్యంలోని మోత్కుపల్లి గేటు సమీపంలో చేతిపంపు వద్ద ఆగి నీళ్లు తాగుతుండగా.. అక్కడే ఆగి ఉన్న ఆటోలోంచి ఓ దుండగుడు వీరి వద్దకు వ చ్చి కమాల్‌పై దాడి చేశాడు. వెనువెంటనే మరో నలుగురు చెట్ల పొదల్లోంచి వచ్చి బాలికను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని మోత్కుపల్లివైపు వెళ్లిపోయారు. దుండగుడి దాడితో స్పృహ కోల్పోయిన కమాల్‌ను ఓ డీసీఎం డ్రైవర్ గమనించి నీళ్లు తాగించాడు. కొద్దిసేపటికి తేరుకున్న ఆయన కూతురు కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. కమాల్ సమాచారంతో తండావాసులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మోమిన్‌పేట ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు.



పోలీసు బృందాలు గురువారం రాత్రంతా గాలించినా బాలిక జాడ తెలియరాలేదు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో మోత్కుపల్లి గేటు సమీపంలో రోడ్డుపక్కనే బాలిక మృతదేహం కనిపించింది. దుండగులు అత్యాచారం చేసి, అనంతరం గొంతు నులిమి చంపేసిన ఆనవాళ్లు కనిపించాయి. జిల్లా ఎస్పీ శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లతో పరిశీలించారు. పోలీసు జాగిలం సమీప బార్వాద్ గ్రామంలోని ఆరుగురి ఇళ్లలోకి వెళ్లి ఆగిపోయింది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

 

రంగంలోకి ఐదు బృందాలు: ఎస్పీ

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసింది స్థానిక దుండగులేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసును ఛేదించేందుకు పోలీసు యంత్రాంగం ఐదు బృందాలను రంగంలోకి దించింది. దారుణానికి ఒడిగట్టిన ముఠాను పట్టుకునేందుకు పరిసర గ్రామాల్లోని కొందరు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసులు ‘సాక్షి’కి తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.

 

 

ఎన్‌కౌంటర్ చేయాలి:  శకుంతల, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు

బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలి. ‘నిర్భయ’ లాంటి చట్టాలు ఉన్నా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం. బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళల రక్షణ కోసం 24 గంటలపాటు మానిటరింగ్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top