కిరణ్ సర్కార్ తో 135 కోట్ల నష్టం

కిరణ్ సర్కార్ తో 135 కోట్ల నష్టం


ఇందులో వట్టి వసంత్, అధికారుల పాత్ర కూడా ఉంది

హైకోర్టుకు నివేదించిన తెలంగాణ ప్రభుత్వం

పాత గాంధీ ఆసుపత్రి స్థల వివాదంలో కౌంటర్




సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానాకు రూ.135 కోట్ల మేర నష్టం కలిగించిందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అప్పటి పర్యాటక మం త్రి వట్టి వసంత్‌కుమార్, కొందరు అధికారుల పాత్రే ఇందులో ఉందని తెలిపింది. బషీర్‌బాగ్‌లోని పాత గాంధీ ఆసుపత్రి స్థలం లీజును పునరుద్ధరించడంలో వీరంతా కీలక పాత్ర పోషించారని, తద్వారా ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం వచ్చిందని చెప్పింది. 5.6 ఎకరాల పాత గాంధీ ఆసుపత్రి స్థలాన్ని భారీ వాణిజ్య సముదాయం నిమిత్తం జీఎస్ గుప్తా తదితరులకు లీజుకివ్వడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన చంద్రకిషోర్ జైశ్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.


దీనిపై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తెలంగాణ పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి వెంకటేశం బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. పాత గాంధీ ఆసుపత్రిలో వాణిజ్య సముదాయం నిర్మాణం నిమిత్తం 2006లో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించిందని, ప్రభుత్వం జీఎస్ గుప్తా, పాంటలూన్ తదితర కంపెనీలను ఎంపిక చేసిందన్నారు. అయితే ప్రాజెక్టులో పురోగతి లేకపోవడంతో ప్రభుత్వం 2012లో లీజును రద్దు చేసిందని తెలిపారు.


‘ఆ తరువాత ఢిల్లీకి చెందిన డీఎఫ్‌ఎల్ రంగంలోకి దిగి, జీఎస్ గుప్తా తదితరులు ఈ ప్రాజెక్టులో తమను భాగస్వామిగా చేర్చుకున్నారని, ఈ ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అయితే జీఎస్ గుప్తా తదితరులు ప్రభుత్వానికి ఉన్న లీజు బకాయిల గురించి డీఎల్‌ఎఫ్ ఏమీ మాట్లాడలేదు. ఇదే సమయంలో లీజు రద్దుపై గుప్తా హైకోర్టును ఆశ్రయించారు. లీజు బకాయిల కింద ప్రభుత్వానికి రూ.10 కోట్లు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాక లీజు రద్దు చేసిన భూమిని తిరిగి డెవలపర్‌కు అప్పగించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇందుకు విరుద్ధంగా అప్పటి కిరణ్ ప్రభుత్వం దీనిపై మంత్రుల కమిటీని నియమించింది.


కమిటీ దీనిపై ఏజీ, న్యాయశాఖల సలహాలు కోరింది. అయితే కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో సలహాలు కోరడం సరికాదని న్యాయశాఖ స్పష్టం చేసింది. ఏజీ ఎటువంటి సలహా ఇవ్వలేదు. దీంతో మంత్రుల కమిటీ ఈ వ్యవహారాన్ని అప్పటి పర్యాటక మంత్రి వట్టి వసంతకుమార్ నిర్ణయానికే వదిలేసింది. దీంతో ఆయన స్థలాన్ని తిరిగి డెవలపర్‌కే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పటికే అమల్లో ఉంది’ అని వెంకటేశం తన కౌంటర్‌లో వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top