‘108’లో సమ్మె ఘంటికలు

‘108’లో సమ్మె ఘంటికలు


జీవీకే, ఉద్యోగుల చర్చలు విఫలం

 7వ తేదీ రాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్న సిబ్బంది.. 316 అత్యవసర వాహన సర్వీసులకు ఆటంకం

 నేడు ఇందిరాపార్కు వద్ద 108 సిబ్బంది సభ, ర్యాలీ

 

 ‘108’లో అత్యవసర వైద్య సేవలపై‘సమ్మె’ట దెబ్బ పడనుంది. ఈ నెల ఏడో తేదీ రాత్రి నుంచి సమ్మెకు వెళ్లాలని ‘108’ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఒక నిర్ణయానికి వచ్చింది. గత నెల సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగులతో జీవీకే సంస్థ జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సమ్మెకు ముందస్తుగా సోమవారం ఉద్యోగులు హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించి ఇందిరాపార్కు వద్ద సభ నిర్వహించనున్నారు. ఆ సభలోనే సమ్మె తేదీని ప్రకటించే అవకాశముంది. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర 15 డిమాండ్లతో సిబ్బంది సమ్మెకు దిగుతున్నారు.

 

 దిగిరాని జీవీకే...

 

 ‘108’ను నిర్వహిస్తోన్న జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థ తమ డిమాండ్లను ఒప్పుకోలేదని, దీంతో చర్చలు విఫలమయ్యాయని తెలంగాణ 108 ఉద్యోగుల సంక్షేమ సంఘం చెబుతోంది. ‘తెలంగాణ ధనిక రాష్ట్రం. ప్రభుత్వం తమకు ఇచ్చే నిధులను పెంచి నా వేతనాలు సవరించే ప్రశ్నేలేదు. ఇక్కడ వేతనాలు పెంచితే తాము నిర్వహిస్తోన్న 17 రాష్ట్రాల్లోనూ పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏమైనా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోండి.’ అని జీవీకే సంస్థ తేల్చి చెప్పినట్లు ఉద్యోగుల సంఘం నాయకుడు పి.అశోక్ చెప్పారు. తమ 15 డిమాండ్లలో ఒక్కదానికి కూడా జీవీకే ఒప్పుకోలేదన్నారు.

 

 మూడోసారి సమ్మె...

 

 తెలంగాణలో ‘108’లో 316 వాహనాలు అత్యవసర వైద్య సేవలందిస్తున్నాయి. అన్నీ కలిపి ఒక్కో వాహనానికి రూ.1.20 లక్షల చొప్పున ప్రభుత్వం జీవీకేకు చెల్లిస్తోంది. నిర్వహణ బాధ్యతను జీవీకేకు చెందిన అత్యవసర సేవల నిర్వహణ, పరిశోధన సంస్థ (ఈఎంఆర్‌ఐ) చేపడుతోంది. 108 సేవల కోసం 1,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో డ్రైవర్లు, కాల్ సెంటర్,సాంకేతిక సిబ్బంది, ఇతర సహాయకులు ఉన్నారు. ఒప్పందంలో భాగంగా ఉద్యోగుల వేతనాలు ప్రతి ఏడాది 10 శాతం పెరుగుతూనే ఉన్నాయని ‘108’ ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు చెబుతున్నారు. 2011లో 15 రోజులు, 2013 ఆగస్టు నుంచి 36 రోజులు సిబ్బంది సమ్మె చేశారు. దీంతో అప్పట్లో 40 మంది ఉద్యోగులను తొలగించారని, తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గోవాలో 56 రోజులపాటు సమ్మె జరిగితే మొత్తం ‘108’ వ్యవస్థ మొత్తం స్తంభించిందని... దీంతో అక్కడి ప్రభుత్వ జోక్యంతో జీవీకే సంస్థ దిగొచ్చి, 20 శాతం వరకు వేతనాలు పెంచారని అశోక్ చెప్పారు. ‘108’కు ఇస్తున్న నిధుల్లో 25 శాతం కేంద్రం వాటా ఉందని, అందువల్ల కేంద్రం జోక్యం చేసుకోవాలని ఉద్యోగుల సంఘం విన్నవించింది.

 

 సానుభూతితో సమస్యలు పరిష్కరించాలి..

 

 జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థ ఉద్యోగులతో నిరంతరం చర్చలు జరపాలి. వారి సమస్యలను సానుభూతితో పరిశీలించి పరిష్కరించాలి. సమ్మె జరగకుండా అవసరమైన స్థాయిలో చర్చలు జరుపుతూ ఉండాలి. సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయ చర్యలకు సిద్ధం కావాలి. అవసరమైతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది.    

 - శ్రీనివాసరావు, ప్రత్యేకాధికారి, 108 సేవలు, తెలంగాణ ప్రభుత్వం


 




 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top