నో కుయ్..కుయ్


జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, మారుమూల గ్రామాల నుంచి కానీ గర్భిణులు, ఇతర ఆనారోగ్య బాధితులు ఆస్పత్రులకు రావాలంటే సరైన సౌకర్యాలు ఉండేవి కావు. వారు కష్టపడి ఆస్పత్రికి బయలుదేరినా సకాలంలో చేరుకోకపోవడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. రోడ్డు ప్రమాద బాధితులు కానీ, ఆత్మహత్యాయత్నం బాధితులు కానీ ఇలా ఎవరైనా సరై సకాలంలో ఆస్పత్రికి చేరక ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా మహానేత పాలనకు ముందు. దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి తన పాదయాత్రలో భాగంగా రాష్ట్రం మొత్తం తిరిగినప్పుడు ఇటువంటి సంఘటనలు ఆయన దృష్టికి చాలా వచ్చాయి.



 దీంతో ఆయన మదిలో అప్పుడే ఓ పథకం రూపుదిద్దుకుంది. అదే ‘108’. ఆపదలో ఉన్న వారిని క్షణాల్లో ఆదుకునేలా ఆయన ఈ ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 108 సేవలు వైఎస్ ప్రారంభించిన సమయంలోనే జిల్లాలో కూడా 108 సేవలను అందుబాటులోకి వచ్చాయి. అప్పటినుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణులను సకాలంలో 108లో ఆస్పత్రులకు తరలించేవారు. దీంతో వారు పండండి బిడ్డతో కలిసి క్షేమంగా ఇంటికి వెళ్లేవారు.



 అలాగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న వారు సైతం 108కు ఫోన్ చేస్తే నిమిషాల వ్యవధిలో వారు సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించేవారు. గుండెనొప్పి, పురుగుమందులు తాగి ఆత్మహత్యలకు పాల్పడిన వారిని కూడా సకాలంలో ఆస్పత్రికి చేర్చి వారికి ప్రాణదానం చేసింది. 108 సేవల కారణంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రజలంతా మహానేత ప్రవేశపెట్టిన ‘108’ పథకానికి జేజేలు పలికారు.



 జిల్లాలో 40కిపైగా అంబులెన్స్‌లు

 108 పథకం కింద జిల్లాలో వైఎస్ 40కిపైగా అంబులెన్స్‌లను ప్రవేశ పెట్టారు. ఎంతోమందికి ప్రాణదానం చేశారు. 2009 వరకు జిల్లాలో సంవత్సరానికి 70వేలకు పైగా కేసులను 108 స్వీకరించింది. ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లోనే ‘కుయ్..కుయ్’.. అంటూ ఆపదలో ఉన్న వారి ఇంటి వద్దకు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లి కాపాడేవారు. 100 మందికిపైగా ఉద్యోగులు ఈ సర్వీస్‌లో పని చేస్తు సేవలు అందించారు.



 వైఎస్ మరణం తర్వాత మారిన పరిస్థితి...

 మహానేత రాజన్న మరణం తర్వాత ఈ 108 పథకం మూగబోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 40కి పైగా ఉన్న అంబులెన్స్‌ల సంఖ్య 30కి తగ్గింది. మరమ్మతులకు గురైన వాహనాలను పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో అవి మూలనపడ్డాయి. అదేవిధంగా అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో ఎన్నో సార్లు 108 సేవలు నిలిచిపోయిన విషయం విదితమే. ఆయన మరణానంతరం పరిపాలన సాగించిన వారు 108 నిర్వహణపై దృష్టి పెట్టకపోవడంతో ఈ పథకం రోజురోజుకు దిగజారిపోయింది.



 చివరకు ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఒకవైపు నెలకొనగా, మరోవైపు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధితులు ఫోన్ చేస్తే ఈ అంబులెన్స్‌లు గంట గడిచినా రావడం లేదు. కొన్ని వాహనాలకు డీజిల్ కొరత కూడా ఉండటంతో అలంకార ప్రాయంగానే మిగిలిపోతున్నాయి. వైఎస్ బతికి ఉంటే 108 పరిస్థితి ఇలా ఉండేది కాదని ఇటు ఉద్యోగులు... అటు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.



 శిథిల భవనంలో 108 ఉద్యోగుల ఇబ్బందులు

 ఎంతోమందికి ప్రాణదానం చేసిన 108 కార్యాలయం పరిస్థితి దారుణంగా తయారైంది. జిల్లా ఆస్పత్రిలోని వెనుకవైపు గల ఓ పాత శిథిలావస్థలో ఉన్న భవనంలో ఈ కార్యాలయాన్ని తరలించడంతో అందులో సరైన సౌకర్యాలులేక ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏ క్షణంలో ఆ భవనం కూలిపోతుందోనని బిక్కుబిక్కు మంటున్నారు. 108 జిల్లా అధికారులు సైతం దీనిని పట్టించుకోకపోవడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top