108 ఉద్యోగుల సమ్మె విరమణ

108 ఉద్యోగుల సమ్మె విరమణ


ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ

 సాక్షి, హైదరాబాద్: సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో ‘108’ ఉద్యోగులు తమ సమ్మె విరమించారు. దీంతో 11 రోజులుగా జరుగుతున్న సమ్మెకు తెరపడింది. ఉద్యోగులు విధుల్లో చేరారు. తెలంగాణ ‘108’ ఉద్యోగుల సంక్షేమ సంఘం, జీవీకే-ఈఎంఆర్‌ఐ ప్రతినిధులతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి రెండు రోజులు చర్చలు జరిపారు. మంత్రి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, ఉద్యోగుల 15 డిమాండ్ల పరిష్కారానికి పార్లమెంటరీ కార్యదర్శులు వినయ్‌భాస్కర్, గాదరి కిషోర్‌లతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సమ్మె కాలాన్ని వేతనంతో కూడిన సెలవుగా పరిగణిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మహేందర్‌రెడ్డి, అశోక్ మాట్లాడుతూ రెగ్యులర్‌గా పెంచే 10 శాతంతో కాకుండా రూ. వెయ్యి అదనంగా వేతనం పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. జీవీకే బదులు ప్రభుత్వమే ‘108’ వ్యవస్థను నిర్వహించాలన్న డిమాండ్‌పైనా, తొలగించిన 70 మందిపైనా కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రెండు నెలల్లో కమిటీ నివేదిక సమర్పిస్తుందన్నారు. కమిటీలో సంఘం ప్రతినిధులు కూడా ఉంటారన్నారు.

 

 ప్రభుత్వ డాక్టర్ల వేతనాలు పెంచుతాం

 ప్రభుత్వ డాక్టర్ల వేతనాలు పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని, అలాగే ప్రభుత్వ వైద్య విధానాన్ని సమూలంగా మార్చుతామన్నారు. ఆస్పత్రులు, కార్యాలయాల్లో సీసీ కెమెరాలు పెట్టే ఆలోచన ఉందన్నారు. ఇప్పటివరకు పరికరాలు, ఔషధాల కొనుగోలులో అనేక అవకతవకలు జరిగాయన్నారు. పరికరాల కొనుగోలుకు సంబంధించి బహిరంగ చర్చ పెడతామని చెప్పారు. పెంటావలెంట్ టీకాను వచ్చే నెల 2న ప్రారంభిస్తామని వెల్లడించారు.

 

 మెడ్‌సెట్ ద్వారానే యాజమాన్య వైద్య సీట్లు

 రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో తమ కోటా సీట్లన్నింటినీ యాజమాన్యాలు అమ్ముకున్నాయని, ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని మంత్రి లక్ష్మారెడ్డిని ప్రశ్నించగా... ‘ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఉంటుందన్న విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అడ్వాన్సు డబ్బులు తీసుకొని సీట్లను బుక్ చేశారు. ప్రత్యేక ప్రవేశ పరీక్షలో మెరిట్ మార్కులు రాకుంటే ఎవరి డబ్బులు వారికి వాపసు ఇస్తార’ని మంత్రి స్పష్టంచేశారు. ముందు డబ్బులు తీసుకున్నందున పేపర్ లీక్ అయ్యే అవకాశాలుంటాయని ప్రశ్నించగా... అటువంటి పరిస్థితి తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top