మనకు ఉద్యోగాలిచ్చే రోబోలు వచ్చాయి

మనకు ఉద్యోగాలిచ్చే రోబోలు వచ్చాయి


న్యూయార్క్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేథస్సు)తో పనిచేసే రోబోలు మానవుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నాయని గోల చేస్తున్నవారు నేడు ఎందరో ఉన్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా మానవులకు ఉద్యోగాలిస్తున్న రోబోలు నేడు మార్కెట్‌లోకి వచ్చాయంటే ఆశ్చర్యం వేస్తోంది. ‘మ్యా సిస్టమ్స్‌’ అనే స్టార్టప్‌ కంపెనీ ఉద్యోగాల కోసం వచ్చే వారిని ఇంటర్వ్యూ చేసేందుకే ప్రత్యేకమైన రోబోలను తయారు చేసింది. ఆ రోబోలకు బాట్‌ అని నామకరణం కూడా చేసింది.



ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో కొత్తగా ఎన్నో కంపెనీలు పుట్టుకొస్తుంటాయి. ఉన్న కంపెనీలు విస్తరిస్తుంటాయి. ఫలితంగా లక్షలాది మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు  చేస్తుంటారు. వీరి అందరి దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించి, వివిధ దశల్లో వాటిని ఒడబోసి తమ కంపెనీకి పనికొచ్చే అభ్యర్థులను ఎంపిక చేయడం చిన్న కసరత్తు కాదు. అందుకని ఈ కసరత్తును సులభతరం చేసేందుకే బాట్‌ రోబోలను కంపెనీ తీసుకొచ్చింది. దరఖాస్తు ఫారాల పరిశీలన నుంచి సంబంధిత కంపెనీ లేదా బ్రాంచ్‌ మేనేజర్‌ తుది ఇంటర్వ్యూ చేసే వరకు అన్ని పనులను ఈ రోబోలే నిర్వహిస్తాయి. ఉద్యోగం వచ్చిన అభ్యర్థికి ఈ రోబోలు శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు కంపెనీ కార్యాలయాన్ని కూడా పరిచయం చేస్తాయి.



ఉద్యోగం రాకపోయిన సందర్భంలో ఆ సదరు అభ్యర్థి ఏ రంగంలో రాణించగలరో, ఏ ఉద్యాగానికి పనికొస్తారో కూడా కీవర్డ్స్, జిప్‌ కోడ్‌ ద్వారా ఈ రోబోలు సూచిస్తాయి. అమెరికాలో అతిపెద్ద రిక్రూట్‌మెంట్లు కలిగిన ఐదు పెద్ద కంపెనీల్లో మూడు కంపెనీలు ఇప్పటికే తమ బాట్‌ రోబో సేవలను ఉపయోగించుకుంటున్నాయని ‘మ్యా సిస్టమ్స్‌’ వ్యవస్థాపకులు ఎయాల్‌ గ్రేఎవెస్కీ తెలిపారు. గతేడాది జూలై నెలలోనే తాము ఈ రోబోల విక్రయాన్ని ప్రారంభించామని, ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది ఉద్యోగులను ఎంపిక చేసే సామర్థ్యం కలిగిన బాట్‌లను ఉత్పత్తిచేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తామని ఆయన వివరించారు.

Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top