మరింత భయపెడుతున్న కొత్త మాల్‌వేర్!!

మరింత భయపెడుతున్న కొత్త మాల్‌వేర్!!


నిన్న మొన్నటి వరకు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన 'వాన్న క్రై' రాన్సమ్‌వేర్ కథ ముగిసిందో లేదో.. అంతలోనే మరో సరికొత్త మాల్‌వేర్ వచ్చింది. దానిపేరు ఇటర్నల్ రాక్స్. ఇది వాన్న క్రై కంటే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఎదుర్కోవడం ఇంకా కష్టం అవుతుందంటున్నారు. ఇది ఇటర్నల్ బ్లూ అనే ఎన్‌ఎస్ఏ టూల్‌ను ఉపయోగించుకుని ఒక కంప్యూటర్‌ నుంచి మరోదానికి విండోస్ ద్వారా వ్యాపిస్తుంది. దాంతోపాటు ఇటర్నల్ చాంపియన్, ఇటర్నల్ రొమాన్స్, డబుల్ పల్సర్ అనే మరికొన్ని ఎన్ఎస్ఏ టూల్స్‌ను కూడా ఇది ఉపయోగించుకుంటుందని ఫార్చూన్ పత్రిక తెలిపింది.



ప్రస్తుతానికి ఇటర్నల్ రాక్స్‌లో ఎలాంటి ప్రమాదకరమైన అంశాలు లేవని, అది ఫైళ్లను లాక్ చేయడం లేదా కరప్ట్ చేయడం లాంటివి జరగడం లేదని అంటున్నారు. అయితే, ఇటర్నల్ బ్లూ మాత్రం ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన కంప్యూటర్‌ను ఉపయోగించుకుని రిమోట్ కమాండ్ల ద్వారా ఇతర కంప్యూటర్లను కూడా ఏ సమయంలోనైనా నాశనం చేస్తుంది. భారతదేశంతో సహా దాదాపు 150 దేశాల మీద దాడి చేసిన వాన్న క్రై రాన్సమ్‌వేర్ దాదాపు 2.40 లక్షల కంప్యూటర్లలోకి వ్యాపించింది. ఇది ప్రధానంగా విండోస్ 7 అప్‌డేటెడ్ వెర్షన్లున్న కంప్యూటర్లకే ఇది అంటుకుంది. ఒకసారి ఈ రాన్సమ్‌వేర్ కంప్యూటర్‌లోకి ప్రవేశించిందంటే మొత్తం ఫైళ్లన్నీ ఎన్‌క్రిప్ట్ అయిపోతాయి. వాటిని అన్‌లాక్ చేయడానికి వాళ్లు చెప్పిన మొత్తం చెల్లించుకోవాల్సి వచ్చేది. దానికంటే ఇటర్నల్ రాక్స్ అనేది మరింత బలమైనదని చెబుతున్నారు. వాన్న క్రైని అడ్డుకోడానికి ఒక కిల్ స్విచ్ ఉంది గానీ, దీనికి అది కూడా లేదు. ఇప్పటివరకు ఇది ఎంతవరకు వ్యాపించిందో ఇంకా తెలియదు గానీ, ఎన్ఎస్ఏ ఆధారిత మాల్‌వేర్‌లో ఇది కొత్త తరహా అని అంటున్నారు. గడిచిన పది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పలు రకాల సైబర్ దాడులు జరుగుతున్నాయి.

Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top