ఆహ్వానించి నిర్బంధిస్తారా?

ఆహ్వానించి నిర్బంధిస్తారా? - Sakshi

  • నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ నేతలు  

  • రోజాను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి

  • డీజీపీకి వినతిపత్రం

  • సాక్షి, అమరావతి: జాతీయ మహిళా పార్లమెంట్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను ఆహ్వానించి, నిర్బంధించి అవమానిస్తారా? అని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో రోజాను పోలీసులు నిర్బంధించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు శనివారం విజయవాడలో బందరు రోడ్డు నుంచి డీజీపీ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, గౌరు చరిత, మాజీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరుదు కల్యాణి తదితరులు డీజీపీ నండూరి సాంబశివరరావును కలిసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.



    అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద రోడ్డుపై కొద్దిసేపు ఆందోళనకు దిగారు. కాగా సోషల్‌ మీడియాలో రోజా చేసిన వ్యాఖ్యల దృష్ట్యా ఆమెను  ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నామని డీజీపీ సాంబశివరావు చెప్పారు. మహిళా పార్లమెంట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని రోజా హామీ ఇస్తే.. సదస్సుకు అనుమతించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.  డీజీపీ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా సీపీఎం నేత మధు,సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top