'మంత్రి ప్రోద్భలంతోనే నకిలీ విత్తనాల విక్రయం'

'మంత్రి ప్రోద్భలంతోనే నకిలీ విత్తనాల విక్రయం' - Sakshi

గుంటూరు : తుపాను, వరద, కరువు, పుష్కరాలు ఇలా ప్రతి అంశాన్ని అవకాశంగా మలుచుకుని ముఖ్యమంత్రి నుంచి టీడీపీ కార్యకర్తల వరకు ప్రజా ధనాన్ని దోచుకుతింటున్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

 

రెయిన్ గన్స్, సీసీఐ పత్తి కుంభకోణం, నకిలీ విత్తనాల వ్యవహారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్ ఏర్పాటు చేసి సమగ్రంగా దర్యాప్తు చేయించాలన్నారు. కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి నకిలీ విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుని పీడీ యాక్టు పెడుతున్నామని హడావుడి చేశారన్నారు. వారం రోజులు గడిచింది.. ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి భాగస్వామ్యం, ప్రోద్బలంతోనే నకిలీ విత్తనాల వ్యాపారం జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలన్నారు. 

 

రాష్ట్రంలోని రెండు కోట్ల మంది రైతుల సమస్య అని, వారిని ఆదుకుని సమస్య పరిష్కరించాలనేది ప్రతిపక్ష నేత వైఎస్ జగమోహన్‌రెడ్డి డిమాండ్ అని పేర్కొన్నారు. అలసత్వం వహిస్తే రైతుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అలాగే కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పొన్నూరు, పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు రావి వెంకటరమణ, కావటి మనోహర్‌నాయుడు, కత్తెర హెని క్రిస్టినా, కిలారి రోశయ్య పాల్గొన్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top