మరణాలకూ మీ గుండె కరగదా?


jagan

            



             సీఎం చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ ప్రశ్న




కిడ్నీ వ్యాధితో 424 మంది చనిపోయినా పట్టించుకోలేదు

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయొద్దు.. బతికించుకుందాం..ఇంకా 1460 కోట్లు బకాయిలున్నాయి..

కిడ్నీ వ్యాధి మృతులకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలి

నెలకు రూ.10వేలు మందులకు ఇవ్వాలి

డయాలసిస్‌ యూనిట్లకు కోట్లు అవసరమేలేదు..

నేను వస్తున్నాననే హడావుడిగా జీవోలు జారీ..

పనిచేయని కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులేమిటి?

వెలిగొండ పనులు పూర్తి చేస్తే ప్రకాశంలో వెలుగులే..

ప్రకాశం పర్యటనలో ప్రతిపక్షనేత పిలుపు



సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
వైద్యం అందక పేదలు మరణిస్తున్నా మీ గుండె కరగదా అని సీఎం చంద్రబాబును ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. అపర సంజీవని వంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తున్నారని, ప్రైవేట్‌ ఆసుపత్రులకు బకాయిలు కూడా చెల్లించకపోవడంతో వైద్యం చేసే స్థితి లేదని ఆయన విమర్శించారు. పేదలకు ఉచిత వైద్యం అందకపోవడంతోనే ప్రకాశం జిల్లాలో గత రెండేళ్లలో 424 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు మృతి చెందారని జగన్‌ వివరించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పీసీపల్లిలో జగన్‌ ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధిగ్రస్తులను కలసి పరామర్శించారు. వారి కష్టాలను, బాధలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత వైద్యం అందటం లేదని ప్రైవేట్‌ వైద్యం కొనే స్థోమత లేక ఇప్పటికే వేల సంఖ్యలో మృతి చెందారని బాధితులు జగన్‌కు వివరించారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో జగన్‌  ప్రసంగించారు. ఆయనేమన్నారంటే..




గుండె తరుక్కుపోతోంది..

‘‘కిడ్నీ వ్యాధిగ్రస్తుల కష్టాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. చంద్రబాబుకు జిల్లాలోని ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఉసురు తగులుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలు కళ్లారా చూశాకైనా బాబు మనస్సు కరిగించుకోవాలి. కిడ్నీ వ్యాధి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. వ్యాధిగ్రస్తులకు మందుల కోసం నెలకు రూ.10 వేలు ఇవ్వాలి. వారి కుటుంబాలు గడవడం కోసం భృతి చెల్లించాలి. బాబు పాలనలో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందటం లేదు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో వారు వైద్యాన్ని నిలిపివేశారు. రూ.910 కోట్లు కావాలని వైద్య ఆరోగ్యశాఖ కోరితే రూ.568 కోట్లు ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అందులో పాత బకాయిలకే రూ.368 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి రూ.1460 కోట్లు అవసరం ఉంది. నిధులివ్వకుండా ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గత రెండేళ్లలో ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధి బారిన పడి 424 మంది చనిపోయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.



నాన్న హయాంలో పేదలకు ఉచిత వైద్యం..

కిడ్నీలు పాడైనా.. అనారోగ్యం వచ్చినా నేనున్నా... అని, లక్షలు ఖర్చయినా భయపడవద్దంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ పేదలకు భరోసా ఇచ్చారు. ఆయన పాలనలో పేదలు అప్పులపాలు కాకుండా ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకొని నవ్వుతూ తిరిగి వచ్చేవారు. ఇవాళ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కిడ్నీలు పాడైపోయి వైద్యం అందక పేదలు మృత్యువాత పడుతున్నారు. పేదవాడికి సంఘీభావంగా వారికి భరోసా కల్పించేందుకే ఈ సభ.



ఆరోగ్యశ్రీ కోసం పోరుబాట..

ఆరోగ్యశ్రీ అమలు కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట కొనసాగిస్తుంది. గతనెలలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేశాం. ప్రకాశం కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో నేను కూడా పాల్గొన్నా.. దీనికి భయపడి చంద్రబాబు ప్రభుత్వం రూ.270 కోట్లు మంజూరు చేసింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత సమర్థవం తంగా అమలు చేసి పేదలను అన్ని విధాలా ఆదుకునేందుకే మరిన్ని మెరుగైన మార్పులు చేసి 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాం. పేదలకు వైద్యం అందించటంతో పాటు అనారోగ్యానికి గురై కిడ్నీలు, గుండె, కాలు తదితర ఆపరేషన్లు చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వారి కుటుంబాలను ఆదుకునేందుకు భృతి కూడా ఇస్తామని చెప్పాం.



ఆరోగ్యశ్రీని నాశనం చేస్తున్నారిలా...

నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు నెలల తరబడి డబ్బులివ్వలేదు. ఆరోగ్యశ్రీకి సంబంధించి 2007లో వైఎస్‌ ఇచ్చిన రేట్లే ఇçప్పుడూ కొనసాగుతున్నాయి. 10 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు ఆపరేషన్ల ఖర్చులు పెరగడంతో రేట్లు పెంచమని ప్రైవేట్‌ ఆసుపత్రులు పదే పదే అడుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. క్యాన్సర్‌ పేషెంట్లకు కీమో థెరపీ చేయాలి. ఒక్కసారికి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. కీమో థెరపీ ఎనిమిది సార్లు చేస్తే రూ.8 లక్షలు ఖర్చవుతుంది. కానీ ఆరోగ్యశ్రీలో ఎంత ఇస్తారో అంత మొత్తానికి సరిపడా మాత్రమే కీమోథెరపీ చేస్తున్నారు. దీంతో పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు.



ఆరోగ్యశ్రీలో మూగ, చెవుడు పిల్లలకు వైద్యం అందటం లేదు. దివంగత నేత వైఎస్‌ హయాంలో మూగ, చెవిటి పిల్లలకు 12 సంవత్సరాల వరకు ఆపరేషన్లు చేసేవారు. ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లోపు వారికే ఆరోగ్యశ్రీ వైద్యం అంటూ ఆంక్షలు పెట్టింది. దివంగత నేత వైఎస్‌ హయాంలో 108కు ఫోన్‌ కొట్టగానే కుయ్‌..కుయ్‌... మంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్సు వచ్చేది. ఇంటికి వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్ళి ఉచితంగా వైద్యం చేయించి ఇంటికి చేర్చేవారు. ఇవాళ అంబులెన్స్‌కు ఫోన్‌ చేస్తే ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. పేదల వైద్యానికి సహకరించే ఆరోగ్యమిత్ర లను తొలగించటంతో వారు కోర్టుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆశా వర్కర్లకు ఐదు నెలలుగా జీతాలు లేవు. ఇక 104కు ఫోన్‌ చేస్తే అవి రావు... వచ్చినా మందులుండవు... పరీక్షలు చేసే పరిస్థితి లేదు.



కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఖర్చులు తడిసిమోపెడు...

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మాత్రలు, రక్తపరీక్షలకు రూ.4 వేలు ఖర్చవుతుంది. ఆ స్థాయి దాటి డయాలసిస్‌ స్టేజ్‌కు వెళితే వారానికి 2, 3 సార్లు డయాలసిస్‌ చేయించాల్సి వస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి ఒక్కోసారి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన వారానికి రెండుసార్లు డయాలసిస్‌ చేస్తే రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చవుతుంది. నెలకు రూ.16 వేల నుంచి రూ.24 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఏడాదికి ఇది లక్షల్లోకి చేరుకుంటుంది. ఇది పేదవాడికి మోయలేనంత భారం.కిడ్నీ వ్యాధిని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 2012లో ’నేషనల్‌ ప్రోగ్రాం ఫర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఫ్లోరోసిస్‌’ అనే విభాగాన్ని ఏర్పాటు చేసి సర్వే చేసింది.



జిల్లాలో 56 మండలాలు ఉండగా 48 మండలాల్లో ఫ్లోరైడ్‌ శాతం అధికంగా ఉండి తాగేందుకు నీళ్ళు పనికిరాకుండాపోయాయని నివేదిక ఇచ్చింది. 787 గ్రామాల్లో ఫ్లోరైడ్‌ అధిక మోతాదులో ఉందని నివేదించారు. ఫ్లోరైడ్‌ నీటితో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా... చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. వెయ్యి అడుగుల వరకు బోరు తవ్వితే తప్ప జిల్లాలో నీళ్లు పడే పరిస్థితి లేదు. దీని వలన ఫ్లోరైడ్‌ వాటర్‌ బయటపడుతుంది. ఈ నీళ్లు తాగి ఒళ్లు, కీళ్ల నొప్పుల బారిన పడి ఉపశమనం పొందేందుకు పెయిన్‌కిల్లర్స్‌ను వాడుతుండటంతోనే కిడ్నీలు పాడైపోతున్నాయి.



వైఎస్‌ హయాంలో నల్గొండకు కృష్ణాజలాలు

ఉమ్మడి రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న నల్గొండ జిల్లాకు సురక్షిత నీరు అందించిన ఘనత దివంగత నేత వైఎస్‌కే దక్కింది. రూ.1700 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ నుంచి కాలువ ద్వారా నల్గొండ జిల్లాకు నీళ్ళు అందించారు. సాగర్‌ నీటి వల్లే నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ వ్యాధి తగ్గింది. ప్రకాశం జిల్లాలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినా... ఫ్లోరైడ్‌ పూర్తిస్థాయిలో తగ్గే అవకాశం లేదు. ఆర్వో ప్లాంట్లలో రికవరీ 30 నుండి 40 శాతం నీళ్ళే ఉంటాయి. 60 శాతం నీటిలో ఫ్లోరైడ్‌ పూర్తిస్థాయిలో ఉంటుంది. దీన్ని బయటకు వదిలితే తిరిగి భూమిలోకి చేరి మళ్ళీ ఫ్లోరైడ్‌గా మారుతుంది. అందువల్ల రక్షిత నీరే మార్గం. కాలువల ద్వారా నీటిని తరలించాల్సిందే.



ఫ్లోరైడ్‌ పోవాలంటే.. వెలిగొండ నీరే శరణ్యం

ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధి తగ్గాలంటే వెలిగొండ ప్రాజెక్టు నీరే శరణ్యం. వెలిగొండకు మరిన్ని నిధులిచ్చి పనులు వేగవంతం చేసిన ఘనత వైఎస్‌దే. ఆయన హయాంలో వెలిగొండకు రూ.4,700 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు ఆ ప్రాజెక్టును గాలికి వదిలేశారు. వెలిగొండకు నీళ్ళు వచ్చే టన్నెల్‌–1, 2 పనులు దాదాపు నిలిచిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. టన్నెల్‌–1 పనులు 5 కి.మీ. పెండింగ్‌లో ఉన్నాయి. టన్నెల్‌–2కు  8 కి.మీ. పనులు పెండింగ్‌లో ఉన్నాయి.



పనిచేయని కాంట్రాక్టరుకు అదనపు చెల్లింపులా..?

వెలిగొండ పనుల్లో టీడీపీ మంత్రికి వాటాలున్నాయి.. ముఖ్యమంత్రికి ఆ  మంత్రి వాటా ఇస్తున్నారు కాబట్టి వెలిగొండ కాంట్రాక్టరు ఏ పనీ చేయకపోయినా అదనంగా చెల్లిస్తున్నారు. ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్‌కు అధికంగా నిధులివ్వకూడదన్న నిబంధన ఉంది. పనులు చేయని వెలిగొండ కాంట్రాక్టరును ఊడబెరకాల్సింది పోయి 65 కోట్లు అదనంగా చెల్లించారు. కాంట్రాక్టర్‌ పని చేయకపోయినా, అతనికి చేతకాకపోయినా అతనికి చంద్రబాబు తోడుగా ఉన్నారు.



ఫ్లోరైడ్‌ బాధితులను ఆదుకునేందుకు ఎంపీ వై.వి.కృషి

ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్‌ కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేం దుకు ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి శాయశక్తులా కృషి చేశారు. బాధితుల గోడు చూసి తట్టుకోలేక 2015 నుండి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంపీ వై.వి. 10 లేఖలు రాశారు. ప్రధానిని కూడా కలిశారు. ఈ ప్రాంత వాసులకు పైప్‌లైన్ల ద్వారా సాగర్‌ నీటిని అందించేందుకు రూ.996 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించారు. కేంద్రం ఈ ప్రతిపాదనలను రాష్ట్రానికి చేర్చగా అది  పక్కన పెట్టింది’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఇంకా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు.  



ఒత్తిడి వస్తేనే చంద్రబాబు పలుకుతాడు

ఒత్తిడి వస్తేనే ముఖ్యమంత్రి చంద్రబాబు పలుకు తాడు. మూడు సంవత్సరాల పాలనలో ప్రకాశం జిల్లా కిడ్నీవ్యాధిగ్రస్తులను పట్టించుకోని చంద్రబాబు జగన్‌ కిడ్నీ బాధితులను పరామర్శించేందుకు వస్తున్నాడని పత్రికల్లో రాగానే స్పందించాడు. అందుకే నా పర్యటనకు ఒక్క రోజు ముందు కందుకూరు, కనిగిరి, మార్కాపురం కేంద్రాలలో డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జీవో ఇచ్చాడు. డయాలసిస్‌ సెంటర్ల కోసం కోట్లు అవసరం లేదు. ఒక యూనిట్‌ ఏర్పాటు చేయడానికి రూ.10 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. కనిగిరిలో డయాలసిస్‌ యూనిట్‌ కోసం ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఏప్రిల్‌ 2016లో తన ఎంపీ నిధుల నుంచి రూ.12 లక్షలు కేటాయించారు. గ్రాంటు ఉన్నా ప్రభుత్వం యూనిట్‌ పెట్టేందుకు ముందుకు రాలేదు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top