హోటళ్లలో కప్పులు కడుగుతున్నాం

హోటళ్లలో కప్పులు కడుగుతున్నాం - Sakshi

అప్పుడు పూల తోటల్లో రూ.500 కూలి వచ్చేది 

ఇప్పుడు హోటల్‌లో రూ. 200 కూడా రావడం లేదు 

మహిళా కార్మికుల ఆవేదన 

 

సాక్షి, అమరావతి: ‘‘అయ్యా! అప్పుడు పూలు, కూరగాయల తోటల్లో పని చేసుకునేవాళ్లం. ఇప్పుడు కాఫీ హోటళ్లలో కప్పులు కడుగుతున్నాం. అప్పుడు మధ్యాహ్నం వరకు పనిచేస్తే రూ.500 కూలి వచ్చేది. ఇప్పుడు సాయంత్రం వరకు పని చేసినా రూ.200 కూడా రావడం లేదు’’ అని మందడం గ్రామానికి చెందిన డి.కోటమ్మ, ఆదెమ్మ, సత్యవతి కన్నీటి పర్యంతమయ్యారు. రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయం ప్రధాన గేటు వద్దకు వచ్చారు. గేటుకు సమీపంలోని హోటల్లో పనిచేస్తున్న కోటమ్మ, ఆదెమ్మ, సత్యవతిలు జగన్‌ను రాకను గమనించి పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. జగన్‌ వాహనం నుంచి దిగి వారిని పరామర్శించారు. వారంతా తమ గోడు వెళ్లగక్కారు. రాజధాని నిర్మాణం పేరిట పచ్చటి పంట పొలాలను ప్రభుత్వం లాగేసుకోవడంతో పనులు దొరక్క ఎలా బతకాలో తెలియడం లేదని విలపించారు.  

 

ప్రజా రాజధాని కావాలి.. - ఎమ్మెల్యే ఆర్కే

అమరావతిలో ప్రజలు, రైతులు ఉండే రాజధాని కావాలని, రియల్‌ ఎస్టేట్‌ రాజధాని వద్దని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. మంగళగిరి మండలం నిడమర్రులో గురువారం వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి రాజధాని ప్రాంత రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘‘రైతుల భూములను దోచుకోవడం పద్ధతి కాదు. భూసేకరణ పేరుతో మూడు పంటలు పండే భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. సమాజానికి అన్నం పెట్టే రైతుల నుంచి భూములను లాక్కోవడం ఎంతవరకు సమంజసం? ప్రశ్నించిన రైతులపై కేసులు నమోదు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్‌ జగన్‌ పోరాడుతారని ఆయన భరోసానిచ్చారు.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top