ప్రేమకు బుగ్గి

ప్రేమకు బుగ్గి - Sakshi


ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆర్టీసీ డ్రైవర్‌ ప్రేమపెళ్లి

ముఖం చాటేసిన భర్త

నిప్పంటించుకున్న యువతి

చికిత్స పొందుతూ మృతి

మైసూరులో ఘోరం




మైసూరు: ప్రేమ నాటకానికి ఓ యువతి బలైంది. ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యాధికురాలు ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌తో ప్రేమలో పడడమే శాపమైంది. ముందున్న పూలబాటను కాదని ముళ్లబాటను ఎంచుకున్నట్లయింది. ప్రేమించి వివాహమాడిన భర్త, అత్తమామలు తనను, తండ్రిని తీవ్రంగా అవమానించి దాడి చేయడంతో సమాజానికి ముఖం చూపించడమెలా అని కుమిలిపోయింది. మోసగాడి ప్రేమకు బలయ్యానని కలత చెందింది. అదే వ్యథతో నడిరోడ్డుపై ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.



వివరాల్లోకెళ్తే... మైసూరులోని ఒక విద్యాసంస్థలో క్లర్కుగా పనిచేస్తున్న రామేగౌడ కుమార్తె రక్షిత (21) చామరాజనగరలోని ఒక ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడో ఏడాది కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థిని. మైసూరు గంగోత్రి నగరలో నివాసం. నిత్యం కాలేజీకి వెళ్లివచ్చే క్రమంలో తరచూ ప్రయాణించే బస్సు కండక్టర్‌ ‘కం’ డ్రైవర్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమ వరకూ వచ్చింది. ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో వారి ప్రేమను ఇరు కుటుంబాలవారు వ్యతిరేకించారు. అయినప్పటికీ నాలుగు నెలల కిత్రం రక్షిత– శ్రీనివాస ప్రసాద్‌లు పెళ్లితో ఒక్కటయ్యారు. కొద్దిరోజులకే భర్త నిజస్వరూపం బట్టబయలైంది. అతడు ఆమెను పట్టించుకునేవాడు కాదు. అత్తమామలు రక్షితను ఇంటిలోకి రానివ్వలేదు. భర్త కూడా సొంత కుటుంబానికే వత్తాసు పలికాడు.



బస్టాండు వద్దే మంటల్లో..

దీంతో ఆమె కొద్దిరోజులుగా చామరాజనగర్‌లోనే అత్తింటి సమీపంలో ఒంటరిగా ఉంటోంది. ఎన్ని రోజులైనా అత్తింటివారు ఆదరించకపోవడంతో గత బుధవారం తండ్రితో కలిసి నిరసనకు దిగింది. ఈ క్రమంలో గురువారం ఆమెను, తండ్రిని దూషించడంతో పాటు దాడికి దిగారు. దీంతో రామేగౌడ కుమార్తె రక్షితను తీసుకొని ఇంటికి వెళ్తూ శ్రీనివాస్‌ ప్రసాద్‌పై కేఎస్‌ ఆర్టీసీ మేనేజర్‌కు ఫిర్యాదు చేయడానికి చామరాజనగర బస్టాండుకు వెళ్లాడు. అక్కడే వేచి ఉన్న రక్షిత ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది.



 స్థానికులు మంటలను ఆర్పివేసి హుటాహుటిన మైసూరులోని కేఆర్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి కిత్స పొందుతున్న రక్షిత సోమవారం కన్నుమూసింది. భర్త వేధింపుల వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రక్షిత తల్లి మాట్లాడుతూ శ్రీనివాస్‌ప్రసాద్‌ కొందరిని పురమాయించి తమ బిడ్డకు నిప్పంటించాడని ఆరోపించింది. పోలీసులు శ్రీనివాస్‌ ప్రసాద్‌తో పాటు అతని కుటుంబసభ్యులను అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top