మేజర్ని.. విడాకులు మంజూరు చేయండి

మేజర్ని.. విడాకులు మంజూరు చేయండి - Sakshi


ఇష్టారాజ్యంగా  వ్యవహరిస్తే సమాజం ఒప్పుకోదు

 విడాకులు కావాలన్న పవిత్రకు న్యాయమూర్తుల హితవు


 

 చెన్నై, సాక్షి ప్రతినిధి:  ‘భార్యాభర్తల బంధం ఎంతో బాధ్యతతో కూడుకున్నది. మేజర్ అయినంత మాత్రాన ఇష్టారాజ్యంగా వ్యవహరించి సమస్యలు సృష్టించే హక్కులేదు, న్యాయస్థానం చూస్తూ ఊరుకోదు’. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు తమిళ్‌వాసన్, సెల్వం. న్యాయమూర్తుల నోటి వెంట ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు రావడానికి గల కారణాల్లోకి వెళితే... తమిళనాడు వేలూరు జిల్లా పల్లికొండ కుచ్చిపాళయానికి చెందిన పళని భార్య పవిత్ర అకస్మాత్తుగా అదృశ్యమైంది. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఆంబూరుకు చెందిన షమీల్‌అహ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఈ క్రమంలో షమీల్‌అహ్మద్ లాకప్‌డెత్‌కు గురయ్యాడు.

 

 ఆంబూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తూ ఒక వర్గం పోరాటానికి దిగింది. పల్లికొండ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మార్టిన్ ప్రేమ్‌రాజ్ సమా ఏడుగురు పోలీసులు సస్పెండ్‌కు గురయ్యారు. విచారణలో షమీల్‌అహ్మద్‌తో పవిత్రకు సన్నిహత సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే పవిత్ర ఆచూకీ మాత్రం తెలియరాలేదు. తన భార్య పవిత్ర ఆచూకీ తెలపాల్సిందిగా కోరుతూ పోలీసు ఫిర్యాదుతోపాటు మద్రాసు హైకోర్టులో భర్త పళని పిటిషన్ దాఖలు చేశాడు. పవిత్ర ఆచూకీ కోసం ఏర్పాటైన రెండు పోలీసు బృందాలు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చెన్నైలో దాక్కుని ఉన్నట్లు కనుగొని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

 

 సోమవారం ఉదయం మద్రాసు హైకోర్టులో ప్రవేశపెట్టగా ‘నా భర్త పళనితో కాపురం చేయడం ఇష్టం లేదు, నా వయస్సు 25 ఏళ్లు, మేజర్ కాబట్టి విడాకులు మంజూరు చేయండి’ అంటూ పవిత్ర న్యాయమూర్తులను కోరింది. ఇందుకు న్యాయమూర్తులు బదులిస్తూ, ‘మేజర్‌వు కాబట్టి నీ ఇష్టప్రకారం నిర్ణయం తీసుకునే హక్కుంది, అయితే సభ్య సమాజం భార్యాభర్తలు కలిసి ఉండాలని చెబుతోంది. మీకు పిల్లలు ఉన్నారు, వారి బాగోగుల దృష్ట్యా కలిసి కాపురం చేయాలి. భర్తను వదిలి వెళ్లిపోయిన కారణంగా చేపట్టిన విచారణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆం బూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి.

 

మీ వల్ల సమాజంలో కలవరం ఏర్పడింది. ఈ కలవరాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చర్యలను అనుమతించరాదు. విడాకులు కావాలంటే అందుకు వేరే కోర్టు ఉంది. మేము మంజూరు చేయలేము. కావాలనగానే పొందేందుకు విడాకులు అంగడిలో దొరికే వస్తువు కాదు. పవిత్ర తల్లిదండ్రులను కోర్టుకు పిలిపించి కుమార్తెకు బుద్దిచెప్పండి అంటూ ఆదేశించారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top