బాంద్రాలోనే బులెట్ రైలు టెర్మినస్!


సాక్షి, ముంబై: ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ప్రవేళపెట్టనున్న ప్రతిపాదిత బులెట్ రైలు టెర్మినస్ నిర్మాణం బాంద్రా-కుర్లా కాంప్లెక్ (బీకేసీ)లోనే జరగనుందని దాదాపు ఖరారైంది. దీనికి సమీపంలో ఉన్న రైల్వే స్థలాల్లో బులెట్ రైలు టెర్మినస్ నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. బులెట్ రైలు టెర్మినస్ కోసం బీకేసీలో ఉన్న స్థలాన్ని ముంబై మహానగరం ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) ఇచ్చేందుకు ఇటీవల నిరాకరించిన విషయం తెలిసిందే. ఇక్కడ స్థలాల ధరలు మండిపోతున్నాయి. దీంతో రూ.వేల కోట్లు విలువచేసే స్థలాన్ని టెర్మినస్ కోసం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.



అంతేగాకుండా ఇక్కడి స్థలం రైల్వేకిస్తే తమ ఆదాయానికి గండిపడుతుందని, అందుకు రైల్వే సొంత స్థలాల్లో టెర్మినస్ నిర్మించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా లేఖ పంపించింది. దీంతో టెర్మినస్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. కాని బాంద్రా రైల్వే స్టేషన్‌కు, టెర్మినస్‌కు ఆనుకుని రైల్వే సొంత స్థలాలున్నాయి. అక్కడ బులెట్ రైలు టెర్మినస్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ఉన్న 546 కి.మీ దూరాన్ని 1.52 గంటల సమయంలోనే చేరుకోవచ్చు. అందుకు రూ.50 వేల కోట్లు ఖర్చవుతుండవచ్చని అంచనవేశారు.



బీకేసీకి సమీపంలో బాంద్రా రైల్వే స్టేషన్, టెర్మినస్ పరిసరాల్లో రైల్వేకు సొంత స్థలాలున్నాయి. అయినప్పటికీ రైల్వే పరిపాలన విభాగం ఎమ్మెమ్మార్డీయే స్థలంపైనే కన్నేసిందని ఆ సంస్థ అదనపు కమిషనర్ సంజయ్ సేఠీ అన్నారు. ఇక్కడి స్థలాలు చుక్కలను తాకుతున్నాయి. వేల కోట్లు విలువచేసే స్థలాన్ని రైల్వేకు ఉచితంగా అందజేస్తే ఎమ్మెమ్మార్డీయేకు భారీ నష్టం వాటిల్లుతుందని సేఠీ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేకు బీకేసీలోని స్థలాన్ని ఇచ్చేందుకు నిరాకరించినట్లు ఆయన వెల్లడించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top