వాట్సాప్ దుమారం


 వాట్సాప్ ద్వారా ప్లస్‌టూ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం బుధవారం నాటి అసెంబ్లీ సమావేశంలో దుమారం రేపింది. ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని విపక్షాలు పట్టుపట్టడంతో అసెంబ్లీ అట్టుడికిపోయింది.

 

 చెన్నై, సాక్షి ప్రతినిధి:హొసూరు జిల్లాలోని ఒక ప్రయివేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ప్లస్‌టూ లెక్కల ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి వాట్సాప్ ద్వారా తన సహ ఉపాధ్యాయులకు పంపడం బట్టబయలైంది. దీనిపై నలుగురు ఉపాధ్యాయులు సస్పెండ్‌కు గురైయ్యారు. ఈ విషయాన్ని బుధవారం నాటి అసెంబ్లీలో డీఎంకే సభ్యులు సెంగుట్టవన్, సీపీఎం సభ్యులు ఢిల్లీ బాబు, సీపీఐ సభ్యులు ఆరుముగం, కాంగ్రెస్ సభ్యులు ప్రిన్స్ ఘాటుగా ప్రస్తావించారు. దీనిపై ఉన్నత విద్యాశాఖమంత్రి వీరమణి వివరణ ఇస్తూ, వాట్సాప్ లీకేజీ వల్ల పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఇకపై ఇలాంటివి చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టామని అన్నారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో తాజా బడ్జెట్‌లో అన్నిశాఖలు సరైన నిధులను కేటాయించామని, కొన్ని శాఖలకు కనీస స్థాయిలో అదనంగాకూడా కేటాయింపులు సాగాయని చెప్పుకున్నారు.

 

 ప్రభుత్వం చూపుతున్న లెక్కలను పద్దుల కమిటీ తప్పుపట్టిందని, రాష్ట్రానికి నష్టం వాటిల్లిందని పేర్కొనిందని డీఎంకే సభ్యుడు దురైమురుగన్ విమర్శించడాన్ని సీఎం ఎద్దేవా చేశారు. 2జీ స్పెక్ట్రంలో డీఎంకే నేతల వ్యవహారం వల్ల లక్షా 76వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని తెలీదని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా లేచి నిలబడి నినాదాలు చేసిన డీఎంకే సభ్యులు తాము కూడా జయలలిత ఎదుర్కొంటున్న బెంగళూరు కేసును ప్రస్తావించవచ్చని నిలదీశారు. కోర్టులో ఉన్న వ్యవహారాలు మాట్లాడరాదని బుద్ధులు చెప్పిన అధికార సభ్యులు వారే తప్పులు చేస్తున్నారని అన్నారు. 2జీపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరగా, రికార్డులను చదివి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ బదులిచ్చారు. అయితే ఇందుకు అంగీకరించని డీఎంకే సభ్యులు స్పీకర్ సభ నుంచి వాకౌట్ చేశారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top