వీల్ చైర్‌లో కెప్టెన్

వీల్ చైర్‌లో కెప్టెన్


సాక్షి, చెన్నై: లోక్ సభ ఎన్నికల  అనంతరం డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్యం బారిన పడ్డట్టున్నారు. ఓ వైపు పార్టీ డిపాజిట్లు గల్లంతు కావడం, మరో వైపు జంప్ జిలానీకి ఎమ్మెల్యేలు రెడీ అవుతున్న సంకేతాలు వెరసి ఆయనలో కలవరాన్ని సృష్టించాయి. ఎన్నికల ముందుగా సింగపూర్‌కు పరుగులు తీసిన విజయకాంత్, ఎన్నికల అనంతరం కూడా ఉరకలు తీశారు. సింగపూర్ పర్యటనకు ముందుగా ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఒక రోజు చికిత్స పొందడం ఆ పార్టీ వర్గాలను కలవరంలో పడేసింది. అయితే, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారన్న భరోసాను ఇచ్చారు. ఆస్పత్రి నుంచి వచ్చిన విజయకాంత్ ఈనెల 13న తన సతీమణి ప్రేమలతతో కలసి సింగపూర్ వెళ్లారు.

 

 అయితే, ఆయన పర్యటన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచారు. రెండు వారాల పాటుగా సింగపూర్‌లో ఉన్న విజయకాంత్ చెన్నైకు తిరుగు పయనం అవుతున్నట్టు శనివారం సమాచారం అందింది. అదే రోజు రాత్రి చెన్నైకు చేరుకోవాల్సి ఉన్నా, ఆ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఆదివారం ఉదయాన్నే ఆయన చెన్నైకు వస్తున్నారన్న సమాచారంతో మీడియా మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకుంది


.ముందు ప్రేమలత : విజయకాంత్ ఏదేని కొత్త విషయాలు చెబుతారన్న ఆసక్తితో మీడియా మీనంబాక్కంకు పరుగులు తీసింది. సింగపూర్ నుంచి ఉదయం 10.10 గంటలకు సిల్క్ ఎయిర్ వేస్ చెన్నైలో ల్యాండ్ అయింది. ఆ విమానం నుంచి ప్రేమలత మాత్రం దిగి బయటకు వచ్చారు.

 

 అయితే, విజయకాంత్ రాలేదన్న సంకేతం ఇవ్వడానికే ఆమె తొలుత బయటకు వచ్చినట్టుంది. విమానం నుంచి ప్రయాణికులందరూ కిందకు దిగిన కాసేపటికి విజయకాంత్‌ను వీల్ చైర్‌లో సిబ్బంది తీసుకొచ్చారు. శరీరంపై దుప్పటి కప్పి ఉన్నట్టుగా వీల్ చైర్‌లో బయటకు వచ్చిన విజయకాంత్‌ను మీడియా కంట పడకుండా జాగ్రత్తగా కారులో ఎక్కించారు. అక్కడి నుంచి ఆ కారు విజయకాంత్ ఇంటి వైపుగా దూసుకెళ్లింది. అయితే, విజయకాంత్‌కు ఏమయ్యిందోనన్న వివరాలను ఆ పార్టీవర్గాలే చెప్పలేని పరిస్థితి.

 

 అనారోగ్యం బారిన పడ్డ విజయకాంత్‌కు సింగపూర్‌లో ఏదైనా శస్త్ర చికిత్స జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారయి. అయితే, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు ఎలాంటి వ్యాధులు లేవంటూ విజయకాంత్ ఇది వరకు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన వీల్ చైర్‌లో రావడంతో ఏమయ్యిందోనన్న విషయాన్ని ఆరా తీయడానికి తమిళ మీడియా శాయశక్తులా ప్రయత్నిస్తోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top