‘వాంఖడే’ సిద్ధం..!

‘వాంఖడే’ సిద్ధం..! - Sakshi


సాక్షి, ముంబై: బీజేపీ ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్న సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వాంఖడే స్టేడియం సిద్ధవుతోంది. ఈ ఉత్సవానికి అన్ని రాజకీయ పార్టీ ప్రముఖులతోపాటు, ప్రసిద్ధి గాంచిన సినీ, క్రీడా, పారిశ్రామిక వేత్తలు, వైద్యులు, లాయర్లు ఇలా ఇతర రంగాల కీలక వ్యక్తులందరికీ ఆ పార్టీ నాయకులు లాంఛనంగా ఆహ్వానం పంపించారు.



ఆ ప్రకారం భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని శివసేనకు ఆహ్వానం అందిననప్పటికీ ఉద్ధవ్‌తోపాటు ఇతర నాయకులు, ఎమ్మెల్యేలెవరూ పాల్గొనబోరని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీలో తగిన విలువ, గౌరవం లభించనప్పుడు వేడుకలకు ఎందుకు హాజరుకావాలని సీనియర్ నాయకులు వినాయక్ రావుత్, నీలం గోర్హే అన్నారు.



కాగా గురువారం రాత్రి మాతోశ్రీ బంగ్లాలో శివసేన-బీజేపీ నాయకుల మధ్య జరగాల్సిన సమావేశం రద్దయిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా, మహారాష్ట్ర న వనిర్మాణ్ సేనా (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణం చేయనున్న దేవేంద్ర ఫడణ్‌వీస్‌కు ఫోన్‌లో రాజ్ గురువారం ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని తను ఇంట్లో ఉండి టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తానని తెలిపారు. దీంతో వేడుకలకు ఎంత మంది ఇతర పార్టీల నాయకులు హాజరవుతారనేది శుక్రవారం  తేలనుంది.



వాంఖడే స్టేడియం బయట ఏర్పాట్లు...  

రాష్ట్రం నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలతోపాటు వివిధ రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దూరప్రాంతాల నుంచి ముఖ్యంగా నాగపూర్ నుంచి ప్రైవేటు, టూరిస్టు, సొంత వాహనాల్లో వచ్చే వారికి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. వాహనాలు పార్కింగ్ చేసేందుకు సమీపంలో ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ సిద్ధం చేశారు. రోడ్లపై కూడా తగిన స్థలం సేకరించారు.



మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చర్చిగేట్ రైల్వే స్టేషన్, ఇండియన్ మర్చంట్ చాంబర్స్ రోడ్, బాంబే హాకీ అసోసియేషన్ రోడ్ తదితర స్టేడియానికి సమీపంలో ఉన్న రహదారులన్నింటినీ నో పార్కింగ్ జోన్‌గా ప్రకటించారు. మరికొన్ని రోడ్లను వన్ వే గామార్చారు. స్టేడియంవద్ద ట్రాఫిక్ జాం కాకుండా వాహనాలను దారి మళ్లిం చేందుకు ప్రత్యామ్నాయ రోడ్లను ఎంపిక చేసి సిద్ధంగా ఉంచారు. స్టేడియానికి వెళ్లే రహదారులపై నివాసముంటున్న స్థానికులు అపరిచితులెవరికీ అనుమతించకూడదని ఆదేశించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top