ఏకమయ్యారు

ఏకమయ్యారు


డ్యాంలను అడ్డుకునేందుకు ఒకే వేదికపైకి

 రంగంలోకి విజయకాంత్

 కరుణ, ఈవీకేఎస్, తమిళిసై, వాసన్‌లతో భేటీ

 మద్దతు ప్రకటించిన నేతలు

 నేడు ఢిల్లీకి పయనం


 

 రాష్ర్టంలోని ప్రతి పక్షాలన్నీ ఒకే వేదిక మీదకు వచ్చాయి. ఇది ఎన్నికల కూటమి కానప్పటికీ, అన్నదాతల సంక్షేమార్థం, జాలర్ల భద్రత లక్ష్యంగా, శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఒకే పక్షంగా నిలిచాయి. ఈ జట్టుకు ప్రధాన ప్రతి పక్ష నేత, డీఎండీకే అధినేత విజయకాంత్ నేతృత్వం వహిస్తున్నారు.  అన్ని పార్టీల  ప్రతినిధులతో ‘మేఘదాతు’లో డ్యాంల నిర్మాణాన్ని అడ్డుకుందామన్న నినాదంతో సోమవారం ఢిల్లీకి బయలు దేరనున్నారు.

 

 సాక్షి, చె న్నై : తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరి వివాదం కొత్తేమి కాదు. తాజాగా తమిళనాడులోకి చుక్క నీరు కూడా రానివ్వకుండా  చేయడం లక్ష్యంగా మేఘదాతులో రెండు డ్యాంల నిర్మాణానికి కర్ణాటక పాలకులు కసరత్తుల్లో మునిగారు. తమిళనాడు ప్రభుత్వం యథాప్రకారం చోద్యం చూస్తూ, చివరిక్షణంలో రంగంలోకి దిగి పనిలో పడింది. ఓ వైపు రాష్ర్టంలో అన్నదాతలు పోరు బాట పట్టినా, అఖిల పక్షంగా ఢిల్లీ వెళ్దామని ప్రతి పక్షాలు పిలుపునిచ్చినా రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు.  ఈ పరిస్థితుల్లో సీఎం పన్నీరు సెల్వం చడీ చప్పుడు కాకుండా శనివారం ఢిల్లీ చెక్కేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఓ వినతి పత్రం అందజేసి మేఘాదాతులో డ్యాంల నిర్మాణం అడ్డుకోండని విన్నవించి నమ అనిపించేశారు. ఇది రాష్ట్రంలోని ప్రతి పక్షాల్లో ఆగ్రహాన్ని రేపింది.

 

 రంగంలోకి విజయకాంత్: అన్ని పార్టీలను వెంట బెట్టుకు వెళ్లి ప్రధానిని కలవకుండా, కేవలం స్వలాభా పేక్షతోసీఎం పన్నీరు సెల్వం ఢిల్లీ వెళ్లడాన్ని ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ తీవ్రంగా పరిగణించారు. ప్రధాన ప్రతి పక్ష నేత హోదాతో తన మార్కు రాజతంత్రాన్ని ప్రయోగించేందుకు రంగంలోకి దిగారు. ప్రతిపక్షాల్ని  ఏకం చేసి తన నేతృత్వంలో ఢిల్లీకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం అన్ని పార్టీల కార్యాలయాలు, నేతల ఇళ్ల వద ఆదివారం ు బిజీ బిజీగా గడిపి ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు.

 

 నేతలతో భేటీ : కేవలం మేఘదాతులో డ్యాం నిర్మాణం అడ్డుకట్ట అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా, మరో నాలుగు అంశాలను తెరమీదకు విజయకాంత్  తీసుకొచ్చారు. డ్యాంల నిర్మాణం అడ్డుకట్టను ప్రధాన అంశంగా చేసుకుని  జాలర్లకు కడలిలో భద్రత, తమిళ కూలీలను పొట్టన పెట్టుకున్న శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసగా, భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా, ముల్లై పెరియార్ డ్యాం హక్కుల పరిరక్షణ లక్ష్యంగా  ప్రధాని మోదీని కలుద్దాం..! అన్న పిలుపుతో నేతలతో విజయకాంత్ భేటీ అయ్యారు. తొలుత గోపాలపురంలోని డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఇంటికి వెళ్లారు. పార్టీ యువజన నేత సుదీష్, ఎమ్మెల్యేలతో కలసి ఆ ఇంట్లో అడుగు పెట్టిన విజయకాంత్ నేరుగా కరుణానిధిని కలుసుకుని దుశ్శాలువ కప్పి సత్కరించారు.

 

  స్టాలిన్‌తో కలసి కరుణానిధితో అరగంట పాటుగా భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా సత్యమూర్తి భవన్ చేరుకుని మద్దతు సేకరించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భులతో భేటీ అయ్యారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశం అయ్యారు. అక్కడి నుంచి ఆళ్వార్ పేటలోని తమాకా పార్టీ కార్యాలయానికి చేరుకుని ఆ పార్టీ అధ్యక్షుడు జీకే వాసన్‌తో భేటీ అయ్యారు. అలాగే, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్‌లతోనూ సమావేశమైన విజయకాంత్ వామపక్ష నేతలతో ఫోన్లో మాట్లాడి మద్దతు కూడ గట్టుకున్నారు.

 

  అన్ని పార్టీలు ఒకే వేదిక మీదుగా ప్రధాని మోదీని కలుసుకునేందుకు సిద్ధం అయ్యాయి. మొత్తం పది పార్టీలకు చెందిన 25 మంది ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లనున్నారు.ఒకే వేదికగా నేడు ఢిల్లీకి:   విజయకాంత్ మీడియాతో మాట్లాడుతూ అన్నదాతలు, జాలర్లు, కూలీలకు అండగా నిలబడే విధంగా అందర్నీ వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లాల్సిన సీఎం పన్నీరు సెల్వం కేవలం స్వలాభాపేక్షతో కంటి తుడుపు చర్యలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు. వాళ్లు స్వలాభం కోసం ప్రాకులాడడం వల్లే ప్రధాన ప్రతిపక్షంగా  అన్ని పార్టీలను ఏకం చేసి ఢిల్లీకి సోమవారం పయనం అవుతున్నామన్నారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పేర్కొంటూ, విజయకాంత్ విజ్ఞప్తి మేరకు తమ పార్టీ తరపున  ఎంపిలు కనిమొళి, తిరుచ్చి శివ ఢిల్లీకి వెళ్లనున్నారని తెలిపారు.

 

 ఈవీకేఎస్ పేర్కొంటూ, విజయకాంత్‌తో కలిసి తమ ప్రతినిధిని ఢిల్లీకి పంపించనున్నామన్నారు. తమిళిసై సౌందరరాజన్ పేర్కొంటూ, ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ తాజాగా స్పందించిన తీరు అభినందనీయమన్నారు. ఆయనతో కలసి తమ ప్రతినిధి ఢిల్లీకి వెళ్తారని, ప్రధానికి డిమాండ్లను విన్నవిస్తామన్నారు. విజయకాంత్‌తో కలసి స్వయంగా తానే ఢిల్లీ వెళ్లనున్నట్టు వీసీకే నేత తిరుమావళవన్ పేర్కొన్నారు. అన్ని పార్టీలను ఏకం చేయడంలో తమ నేత విజయకాంత్ సఫలీకృతుడు కావడాన్ని ఆ పార్టీ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  మున్ముందు రోజుల్లో  ఈ భేటీలు  ‘కూటమి’కి అనుకూలతను సృష్టిస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top