వరుణుడి ఉగ్రరూపం


  •    జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరదలు

  •   జనజీవనం అస్తవ్యస్తం

  •   స్తంభించిన వాహన సంచారం

  •   పాఠశాలలు, కాలేజీలకు సెలవు

  • శివమొగ్గ : జిల్లాలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. కుండపోతతో జిల్లా అతలాకుతలమైంది. ఎగతెరపిలేని వానలతో చెరువులు, వంకలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతుండటంతో అపారనష్టం జరుగుతోంది.  జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. వానలతో ముందు జాగ్రత్తగా జిల్లాలోని అన్ని తాలూకాల్లోని పాఠశాలలు, కాలేజీలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తూ  కలెక్టర్ విపుల్‌బన్సల్ ఆదేశాలు జారీ చేశారు.



    వరద ప్రవాహ ప్రాంతాలతో పాటు  అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. తుంగానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. తీర్థహళ్లి తాలూకా మండగద్దె గ్రామంలోని పక్షిదామ కేంద్రం నదిలో మునిగిపోయింది.  మండగద్దె గ్రామం పక్కన వెళ్లే జాతీయ రహదారి శివమొగ్గ-మంగళూరు 13 రహదారిపై మూడు అడుగుల మేర తుంగానది నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. హొసనగర తాలూకాలో వర్షం భారీగా కురుస్తుండగంతో అపార పంటనష్టం ఏర్పడింది.



    తాలూకాలోని కల్లూరు బీదరళ్లి వంతెన మునిగిపోయింది. దీంతో ఆ ప్రాంత వాసులకు బాహ్యప్రపంచంతో సంబందాలు తెగిపోయాయి. అంతేగాక హెద్దారిపు, అమృత గ్రామపంచాయతీ పరిధిలోని తీవ్రస్థాయిలో పంట నష్టం జరిగింది. ఈ ప్రాంతాలను  జిల్లా పంచాయతీ అధ్యక్షుడు కలగోడు రత్నాకర్, జెడ్పీ  సీఈఓ శ్రీకాంత్‌సెందిల్ శుక్రవారం పరిశీలించారు.  సాగర తాలూకా తాళగుప్ప మండలం బీసనగద్దె గ్రామం పూర్తిగా జలమయమై  ద్వీపంలా మారింది.  



    ఆ గ్రామ ప్రజలు సంచరించడానికి తాలూకా యంత్రాంగం తెప్పలను ఏర్పాటు చేసింది. వరదానది వరదల కారణంగా తాళగుప్ప, మండలం, కణస, తడగళలె, మండగళలెచ తట్టికుప్ప గ్రామాల వ్యవసాయ భూములు పూర్తిగా జలమయం అయ్యాయి. ఉద్రిగ్రామంలో ఓ చెరువు తెగిపోయింది.  శివమొగ్గ, భద్రావతి నగరాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి.   గాజనూరు జలాశయం నుంచి అధిక స్థాయిలో నీటిని విడుదల చేస్తుండటంతో శివమొగ్గ నగరం ఆనుకుని ప్రవహిస్తున్న తుంగానది  ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది.   

     

    లింగమనక్కి జలాశయంలోకి భారీ నీరు..

     

    ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో ప్రముఖ జలాశయాల్లో ఇన్‌ప్లో పెరిగింది. లింగమన క్కి జలాశయంలోకి ఇన్‌ఫ్లో 85,526 క్యూసెక్కులుగా ఉంది. గరిష్ట నీటిమట్టం 1819 అడుగులు కాగా, ప్రస్తుతం 1797.35 అడుగుల మేరా నీరుంది. ఒకే రోజులో జలాశయంలోకి సుమారు మూడన్నర అడుగుల మేర నీరు చేరింది.  



    భద్రా జలాశయంలోకి 35,670 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1561  క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.జలాశయ గరిష్ట నీటిమట్టం 186 అడుగులు కాగా, ప్రస్తుతం 177.30 అడుగుల మేర నీరుంది. తుంగా జలాశయంలోకి 72,856 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అంతేస్థాయి నీటిని దిగువన ఉన్న  హొస్పేట తుంగభద్రా డ్యాంకు వదిలేస్తున్నారు. మాణి జలాశయం గరిష్ట నీటిమట్టం 594.36 అడుగులు కాగా ప్రస్తుతం 584.04 అడుగుల మేర నీరుంది. ఇన్‌ఫ్లో 14,445 క్యూసెక్కులుగా ఉంది.

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top