‘ఆధార్’పై అనిశ్చితి

‘ఆధార్’పై అనిశ్చితి - Sakshi

  •  రేషన్‌కార్డు దరఖాస్తుదారుల్లో ఆందోళన

  •   ఏప్రిల్ 30 నుంచి స్తంభించిన ఆధార్ నమోదు ప్రక్రియ

  •   పునరుద్ధరిస్తామంటున్న రాష్ట్ర ఈ-గవర్నన్స్

  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందగోరు వారు విధిగా విశిష్ట గుర్తింపు సంఖ్య ‘ఆధార్’ను కలిగి ఉండాలన్న నిబంధనపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆధార్ నమోదు ప్రక్రియ అటకెక్కింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజక వర్గం నుంచి ఆధార్ మాజీ చైర్మన్ నందన్ నిలేకణి పోటీ చేయడంతో ఈ ప్రాజెక్టు కొనసాగింపుపై సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎదురయ్యాయి.



    నిలేకణిపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి అనంత కుమార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆధార్‌ను రద్దు చేస్తుందని ప్రకటించారు. ఆధార్ ప్రాజెక్టు వల్ల వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు చందంలా తయారైందని ఆరోపించారు. అయితే నిలేకణి దీనిని ఖండిస్తూ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆధార్‌ను కొనసాగించాల్సిందేనని తేల్చి చెప్పారు.



    ప్రభుత్వ సబ్సిడీ పథకాలు దుర్వినియోగం కాకూడదనుకుంటే ఆధార్ ఉండి తీరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏజెన్సీ కాంట్రాక్టు గడువు ముగియడంతో గత ఏప్రిల్ 30 నుంచి ఆధార్ నమోదు ప్రక్రియ స్తంభించిపోయింది. కొన్ని పోస్టాఫీసులు, బ్యాంకుల్లో నమోదు ప్రక్రియ జరుగుతోందని చెబుతున్నప్పటికీ, ఏ ప్రాంతంలో అనే సమాచారం తెలియడం లేదు.

     

    రేషన్ కార్డుల కోసం ఆందోళన

     

    ఆధార్ ప్రక్రియ నిలిచిపోవడంతో కొత్తగా రేషన్ కార్డులు పొందగోరు వారు ఆందోళన చెందుతున్నారు. కార్డులకు దరఖాస్తు చేసేటప్పుడు ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు , ఆధార్ సంఖ్యలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇంకా...బ్యాంకు ఖాతా, గ్యాస్ బుకింగ్ తదితరాల కోసం ఆధార్ సంఖ్యను తెలియజేయాల్సి ఉంటుంది. ఆధార్ నమోదును పునరుద్ధరించకపోతే ఏం చేయాలని వీరు ప్రశ్నిస్తున్నారు.

     

    శాశ్వత ఆధార్ కేంద్రాలు

     

    ఆరు నూరైనా ఆధార్ నమోదు ప్రక్రియను పునరుద్ధరిస్తారని రాష్ట్ర ఈ-గవర్నెన్స్ శాఖ విశ్వాసంతో ఉంది. ఇటీవల కేంద్రం కూడా నగదు బదిలీ పథకానికి ఆధార్‌ను అనుసంధానం చేయాలని నిర్ణయించినందున, దీని పునరుద్ధరణకు ఏ క్షణంలోనైనా ఆదేశాలు రావచ్చని ఎదురు చూస్తోంది. అలాంటి ఉత్తర్వులు అందిన వెంటనే రాష్ట్రంలోని వెయ్యి బెంగళూరు వన్, కర్ణాటక వన్, నాడ కచేరీ, గ్రామ పంచాయతీలను శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించింది.



    ప్రతి కేంద్రం ఫింగర్ ప్రింట్, ఐరిష్ స్కానర్, లాప్‌టాప్‌లను సమకూర్చుకోవడానికి రూ.1.5 లక్షల వరకు ఖర్చవుతుంది. రాష్ట్రంలో సుమారు 6.11 కోట్ల మంది జనాభా ఉండగా, ఇప్పటికే 5.02 కోట్ల మంది ఆధార్‌కు పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 4.48 కోట్ల మందికి విశిష్ట గుర్తింపు సంఖ్య లభించింది.

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top