ఏకగ్రీవ సర్పంచ్‌కు ఎన్ని కష్టాలో..

ఏకగ్రీవ సర్పంచ్‌కు ఎన్ని కష్టాలో..

  • అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగలేదని వివక్ష

  • కనిగిరి ఏఎంసీ చైర్మన్‌ చెప్పినట్లు నడుచుకోలేదని కక్ష  

  • నిత్యం అవమానానికి గురిచేస్తున్న అధికారులు

  • ఒంగోలులో చెప్పులు కుడుతూ నిరసన తెలిపిన సర్పంచ్‌

  • ఒంగోలు టౌన్‌: ఆయన పేరు తాతపూడి భూషణం. మూడున్నరేళ్ల క్రితం గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నాటినుంచి తాము చెప్పినట్లు నడుచుకోవాలంటూ బెదిరిస్తున్నారు. అధికారపార్టీ అండ చూసుకుని గ్రామ కార్యదర్శి నుంచి డివిజినల్‌ పంచాయతీ అధికారి వరకు ఆ సర్పంచ్‌ను అవమానానికి గురిచేస్తూనే ఉన్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి అధికారులకు చెప్పుకున్న ప్రతిసారీ ఆ సర్పంచ్‌ మరింత అవమానానికి గురవుతూనే ఉన్నాడు. ఒకవైపు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగలేదని కక్ష, ఇంకోవైపు నిత్యం అధికారుల వివక్షతో తన వేదనను జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలనుకున్నారు ఆ సర్పంచ్‌. కేవీపీఎస్‌ జిల్లా నాయకులను కలిసిన అనంతరం సోమవారం కలెక్టరేట్‌ వద్ద చెప్పులు కుడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.



    ఇదేనా గౌరవం..?

    పామూరు మండలం కోడిగుండ్లపాడు సర్పంచ్‌గా తాతపూడి భూషణం 2013 జూలై 18వ తేదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆ సర్పంచ్‌పై ఒత్తిళ్లు పెరిగిపోయాయి. తాము చెప్పిన పనులు చేయాలని వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. కనిగిరి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దారపనేని చంద్రశేఖర్‌.. తాను చెప్పినట్లు సర్పంచ్‌ నడుచుకోలేదన్న అక్కసుతో కక్ష కట్టారు. గ్రామ కార్యదర్శి షేక్‌ చాంద్‌బాషా మొదలుకుని ఈఓఆర్‌డీ సదాశివరావు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి రాజారావు, డివిజినల్‌ పంచాయతీ అధికారి భాస్కరరెడ్డిలు సర్పంచ్‌ను నిత్యం అవమానపరుస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.



    ఈ నేపథ్యంలో భూషణం గ్రామంలో నివసిస్తున్నప్పటికీ ఉండటం లేదని అధికారులను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తప్పుదోవ పట్టించి ఉప సర్పంచ్‌ దారపనేని జనార్దన్‌కు బాధ్యతలు అప్పగించేందుకు 2015 ఫిబ్రవరి 28వ తేదీ ఉత్తర్వులు తెప్పించారు. తనకు జరిగిన అన్యాయం గురించి అప్పటి కలెక్టర్‌ను కలిసి సర్పంచ్‌ ఫిర్యాదు చేయగా, అతనికే బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనీ జరగనీయకపోగా, కనీసం గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా మానసిక వేధనకు గురిచేస్తున్నారని విలేకరుల వద్ద భూషణం వాపోయారు.



    అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలి...

    ఏకగ్రీవ సర్పంచ్‌పై అధికార పార్టీతో పాటు అధికారుల ఆగడాలను అడ్డుకోవాలని కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి బీ రఘురామ్‌ డిమాండ్‌ చేశారు. భూషణం తనకు జరుగుతున్న వివక్షపై మండల, డివిజినల్‌ స్థాయి అధికారుల వద్ద మొరపెట్టుకున్నా వారు అధికారపార్టీ నాయకులకు దాసోహమై ఎదురుదాడికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. భూషణం వంటి బాధిత సర్పంచులు జిల్లాలో అనేకమంది ఉన్నారని, కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించి వారి హక్కులను కాపాడాలని కోరారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top