కొన్ని అంగుళాల దూరంలో చావు తప్పింది

కొన్ని అంగుళాల దూరంలో చావు తప్పింది


ముంబై: ఓ మహిళకు కొన్ని అంగుళాల దూరంలో మృత్యువు తప్పింది. రైలు మోటర్ మ్యాన్‌ చాకచక్యంగా వ్యవహరించి ఆమె ప్రాణాలు కాపాడాడు. డిసెంబర్‌ 6న ముంబై చర్ని రోడ్‌ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.



ముంబై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి చర్చ్‌గేట్‌-బౌండ్‌ ఫాస్ట్‌ ట్రైన్‌ బయల్దేరింది. గ్రాంట్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ దాటిన తర్వాత రైలు 70 కిలో మీటర్ల వేగంతో వెళుతోంది. తర్వాత చర్ని రోడ్‌ స్టేషన్‌కు సమీపించగా, ఓ మహిళ పరధ్యానంతో రైలు పట్టాలపై నడుచుకుని ఎదురుగా రావడాన్ని మోటర్ మ్యాన్‌  సంతోష్ కుమార్‌ గౌతమ్‌ గమనించాడు. గౌతమ్‌ హారన్‌ మోగించినా ఆమె వినిపించుకోకుండా ఎదురుగా వస్తూనే ఉంది. దీంతో ఆమెను రక్షించడం కోసం గౌతమ్‌  వెంటనే అప్రమత్తమై రైలును ఆపేందుకు ప్రయత్నించాడు.



అయితే ఆమెకు, రైలుకు మధ్య దూరం తక్కువగా ఉండటంతో రైలు ఆగుతుందో లేదోనని ఆందోళన చెందాడు. రైలు దగ్గరగా రావడంతో ఆలస్యంగా గమనించిన ఆ మహిళ ప్లాట్‌ ఫామ్‌ ఎక్కేందుకు ప్రయత్నించింది. ప్లాట్‌ ఫామ్‌ ఎత్తు ఎక్కువగా ఉండటంతో సాధ్యంకాలేదు. రైలు కిందపడి ఆమె మరణించడం ఖాయమని అక్కడున్నవారు భావించారు. ఇంతలో అద్భుతం జరిగింది. ఆమెకు కొన్ని అంగుళాల దూరంలో రైలు ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



క్యాబిన్‌లోంచి ఆమె పరిస్థితిని గమనించిన గౌతమ్‌ వెంటనే కిందకు దిగి కొందరు ప్రయాణికుల సాయం తీసుకుని ఆమెను సురక్షితంగా ప్లాట్‌ ఫామ్‌పైకి చేర్చాడు. గౌతమ్‌ సమయస్ఫూర్తితో మహిళ ప్రాణాలను కాపాడినందుకు అందరూ అభినందించారు. ప్లాట్‌ ఫామ్‌ మధ్యలో రైలు ఆగిన విషయాన్ని గౌతమ్‌.. గార్డుకు సమాచారం అందించాడు. కొన్ని నిమిషాల తర్వాత రైలు బయల్దేరింది. గౌతమ్‌ను సన్మానించి నజరానా అందజేస్తామని పశ్చిమ రైల్వే అధికారులు చెప్పారు. కాగా రైల్వే పోలీసులు సదరు మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేగాక గౌతమ్‌ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయనున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top