పోలీసుల వైఖరి మారాలి

పోలీసుల వైఖరి మారాలి - Sakshi


 చెన్నై, సాక్షి ప్రతినిధి: ఒక పేద బాలికపై జరిగిన అత్యాచారం కేసు పరిశోధనలో తమిళనాడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ దుయ్యబట్టారు. నిందితులను శిక్షించడంలో, బాధితురాలికి న్యాయం చేయడంలోనూ పోలీసులు కనీస విద్యార్హత లేని వ్యక్తుల్లా వహిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.

 కృష్ణగిరి జిల్లా తేన్‌కనికోట్టైకి చెందిన 16 ఏళ్ల బాలికపై గత డిసెంబర్ 25వ తేదీన కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.



ఈ కేసు వ్యవహారంలో పోలీసుల వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబడుతూ డీజీపీ ఆశోక్‌కుమార్‌ను శుక్రవారం చెన్నైలోని ఆయన కార్యాలయంలో బృందాకరత్ కలుసుకున్నారు. బాలికపై ఆఘాయిత్యం కేసును సంబంధిత ఎస్పీ తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని, పైగా కేసును దారిమళ్లించే విధంగా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె డీజీపీని నిలదీశారు. సంఘటన జరిగి నెలరోజు లు దాటినా బాధిత బాలికకు న్యాయం జరిగేలా ఏదశలోనూ పోలీసులు వ్యవహరించలేదని ఆమె విమర్శించారు.



మూగ, చెవుడు రుగ్మతలు ఉన్న బాలిక తనపై జరిగిన ఆఘాయిత్యాన్ని నోరి విప్పి చెప్పుకోలేదని ఆమె అన్నారు. అత్యాచారం జరిగినట్లుగా గుర్తించగల ఆధారాల సేకరణలో పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేశారని ఆమె ఆరోపించారు. ఆలస్యంగా వైద్య పరీక్ష లు నిర్వహించి అసలు అత్యాచారమే జరగలేదన్నట్లుగా తేల్చేసేందుకు సన్నద్ధమయ్యారని ఆమె విమర్శించారు.



దీనికి బాధ్యులైన వ్యక్తులను సస్పెండ్ చేశామని మధ్యలో కలగజేసుకున్న డీజీపీ సమాధానం ఇచ్చారు. సస్పెండ్ చేస్తే సరిపోదు, బాధిత బాలికకు పూర్తి న్యాయం జరగాలి, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలని డీజీపీని ఆమె కోరారు. ఇదిలా ఉండగా, కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా కోరుతూ బాధిక బాలిక తండ్రి మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేశాడు. ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో బాలికకు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఖర్చుల నిమిత్తం బాలిక తండ్రికి రూ.20 వేలు చెల్లించాలని కృష్ణగిరి జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top