సెల్ఫీ సరదా ప్రాణం తీసింది !

సెల్ఫీ సరదా ప్రాణం తీసింది ! - Sakshi


కాలువలో సెల్ఫీ సుకుంటుండగా నీటి ఉధృతికి

ముగ్గురు హౌస్ సర్జన్ల మృతి

సురక్షితంగా బయటపడ్డ మరో ఇద్దరు




మండ్య: సెల్ఫీ సరదా ముగ్గురి ప్రాణం తీసింది. విహార యాత్రకు వచ్చిన హౌస్ సర్జన్లలో ముగ్గురు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన కర్ణాటకలోని మండ్యకు 20 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది. నీటి ప్రవాహం ఉన్న కాలువలోకి దిగి సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా నీటి ఉధృతి పెరగడంతో ముగ్గురు భావి డాక్టర్లు మృతి చెందారు. వివరాలు... బెగళూరుకు చెందిన శృతి, జీవన్, మైసూరుకు చెందిన గౌతమ్ పటేల్, సింధు, తుమకూరుకు చెందిన గిరీష్‌లు మండ్యలోని వైద్య కళాశాలలో వైద్య విద్య పూర్తి చేశారు. ఇటీవలే  కెరెగోడలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రంలో ‘హౌస్‌సర్జన్’లుగా శిక్షణలో ఉన్నారు.


శిక్షణ పూర్తి కావస్తున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం  ఈ ఐదుగురూ  మండ్య తాలూకాలోని హులివాన గ్రామ సమీపంలోని విశ్వేశ్వరయ్య కాలువ వద్దకు ఔటింగ్‌కి వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా ఉన్నపళంగా ప్రవాహ వేగం పెరిగింది. నీటి ఉధృతికి ఐదుగురు కాలువలోకి జారి కొట్టుకుపోయారు. బెంగళూరుకు చెందిన శృతి, జీవన్‌తో పాటు తుమకూరుకు చెందిన గిరీష్‌లు మృతి చెందగా, మైసూరుకు చెందిన గౌతమ్ పటేల్, సింధులు సురక్షితంగా బయటపడి విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


శృతి, జీవన్ మృతదేహాలు శుక్రవారం రాత్రి సమయానికి కాలువలో నుంచి బయటికి తీయగలిగారు. గిరీష్ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం పోలీసులు 15 మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దించి స్థానికుల సహాయంతో గాలింపు చేపట్టగా మధ్యాహ్నానికి గిరీష్ మృతదేహం లభ్యమైంది. శృతి, జీవన్‌ల మృతదేహాలకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top