పోలీసుల తీరుకు నిరసనగా టవరెక్కిన బాధితుడు

పోలీసుల తీరుకు నిరసనగా టవరెక్కిన బాధితుడు


సురక్షితంగా కిందకు దింపిన అగ్నిమాపక సిబ్బంది



తిరువళ్లూరు: తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ బుధవారం సాయంత్రం బాధితుడు టవరెక్కి ఆందోళనకు దిగాడు. ఈ సంఘటన తిరువళ్లూరులో చోటుచేసుకుంది.  తిరువణ్ణామలై జిల్లా చెయ్యారు సమీపంలోని వాల్వాడై గ్రామానికి చెందిన మదన్‌ లారీ డ్రైవర్‌. ఇతను ఆదే ప్రాంతానికి చెందిన మహిళను ప్రేమపెళ్లి చేసుకున్నాడు. వీరికి విశాల్‌ అనే కొడుకు నందిని అనే కూతురు ఉంది. మదన్‌ కుటుంబం తిరువళ్లూరు జిల్లా గూడపాక్కంలో నివాసం ఉంటున్నారు.



ఈ నేపథ్యంలో వాల్వాడై గ్రామంలో మదన్‌కు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని మదన్‌ అన్న రాజరాజన్, ఆయన కొడుకులు ఆక్రమించుకుని ఇటీవల అమ్మకానికి ప్రయత్నించడంతో ఇద్దరి మద్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం ఆదే రోజు ఇంటికి వచ్చిన మదన్‌ అతని భార్యపై రాజరాజన్, ఆయన కుమారులు గూడపాక్కం వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో మదన్, భార్య రమా తీవ్రంగా గాయపడ్డారు.  ఈ నేపథ్యంలో తమపై దాడి చేసిన రాజరాజన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత 16న మదన్‌ వెళ్లవేడు పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు చేయలేదు.



దీంతో మనస్తాపం చెందిన మదన్‌ బుధవారం సాయంత్రం తిరువళ్లూరులోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఎక్కి నిరసనకు దిగాడు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తనకు భద్రత కల్పించాలని పలు సార్లు వెళ్లవేడు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిం దని  వాపోయాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ పుహళేంది, సీఐ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా కిందకు దిగడానికి ససేమిరా అనడంతో ఉద్రిక్తత నెలకొంది.



అనంతరం మదన్‌ భార్య రమాను పిలిపించి ఆమెను మాట్లాడిస్తూనే అగ్నిమాపక సిబ్బంది టవర్‌పైకి వెళ్లి చాకచక్యంగా వ్యవహరించి మదన్‌తో సంప్రదింపులు జరిపారు.  టవర్‌పై నుంచి అగ్నిమాపక సిబ్బంది భార్య రమ, పోలీసులతో మాట్లాడించారు. నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు హమీ ఇవ్వడంతో మదన్‌ కిందకు దిగడానికి అంగీకరించాడు. దాదాపు 2 గంటల పాటు శ్రమించిన పోలీసులు మదన్‌ను సురక్షితంగా కిందకు దింపారు.



ఈ ఘటనతో రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.  

రాస్తారోకో :  యువకుడు టవర్‌ ఎక్కిన విషయం తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. దీంతో ట్రాíఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే ట్రాఫిక్‌ను నియంత్రించే క్రమంలో స్థానికులకు, ట్రాఫిక్‌ పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొనగా, ట్రాఫిక్‌ సీఐ కొందరిపై చేయి చేసుకోవడంతో ఆగ్రహించిన ప్రజలు రాస్తారోకోకు దిగారు.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top