కలవని స్నేహితులు విడిపోతారా !?

కలవని స్నేహితులు విడిపోతారా !? - Sakshi


వాళ్లు పేరుకు స్నేహితులు. చాలా విషయాల్లో ఆచరణ ఒకటే అయినప్పటికీ చేతులు కలవవు. అయినా సరే, ఏణ్నార్థంగా కలిసి పదవులు అనుభవిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. మరికొద్ది రోజుల్లో కీలకమైన స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరికి వారు సొంత బలం పెంపొందించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ క్రమంలో తోటివారిపై తొడగొట్టేందుకూ సిద్ధపడుతున్నారు. అవును... ఇదంతా మహారాష్ట్ర రాజకీయాల గురించే!



మ్యాజిక్ ఫిగర్ కు 22 స్థానాల దూరంలో ఆగిపోయిన కమలం పార్టీకి 63 మంది ఎమ్మెల్యేలున్న ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన మద్దతిచ్చి అధికార పీఠం వద్దకు నడిపించింది. ప్రతిగా బాణం గుర్తు పార్టీకి 10 మంత్రి పదవులు దక్కాయి. (ఐదు క్యాబినెట్, ఐదు సహాయ మంత్రులు) అయితే ప్రమాణం చేసిన తొలిరోజు నుంచే బీజేపీపై.. అడపాదడపా ముఖ్యమంత్రి ఫడ్నవిస్ మీద సెటైరికల్ కామెంట్లు చేస్తూ వస్తున్న సేన.. ఇక ప్రభుత్వంలో కొనసాగాలో వద్దో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గట్టిగా విశ్వసిస్తోంది.



సోమవారం నాటి 'పుస్తకావిష్కరణ రచ్చ', అనంతర పరిణామాలు శివసేన వీలైనంత తొందరగా బయటపడేందుకు ఉపకరించాయి. పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మొహమ్మద్ కసూరి రాసిన ‘నైదర్ ఎ హాక్.. నార్ ఏ డవ్- యాన్ ఇన్‌సైడర్స్ అకౌంట్ ఆఫ్ పాకిస్థాన్స్ ఫారిన్ పాలసీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముందు.. కార్యక్రమ నిర్వాహకుడు, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్‌ఎఫ్) చైర్మన్, ఒకప్పటి బీజేపీ నేత అయిన సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు నల్లసిరా చల్లడం, దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం కావడం తెలిసిందే.



మహా సీఎం ఫడ్నవిస్ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి శివసేనపై ఆయన బహిరంగ విమర్శలకు దిగారు. శివసేన చేసిన పనితో మహారాష్ట్ర పరువు పోయిందని, వీసాతో పాటు కార్యక్రమ నిర్వహణకు అనుమతులు పొందిన ఒక విదేశీ అతిథి ఎదుట ఇలా పాశవిక చర్యకు పూనుకోవడం ఎంతమాత్రం సహేతుకం కాదని ఘాటుగా స్పందించారు. సైద్ధాంతిక విభేధాలుండటం సహజమేనని, ఇంత బరితెగింపుతో కాకుండా మరో రూపంలో శివసేన తన నిరసన తెలిపి ఉండాల్సిందన్నారు. అయితే శివసేన మాత్రం ఎప్పటిలాగే తన చర్యను సమర్థించుకోవడంతో పాటు అసలు ఈ కార్యక్రమానికి అనుమతి ఎలా ఇచ్చారంటూ ప్రభుత్వంపై మండిపడింది.



'ఇదే పుస్తకావిష్కరణ కార్యక్రమం ముంబైలో కాకుండా మరో రాష్ట్రంలో జరిగి ఉంటే బీజేపీ అడ్డుకోకపోయేదా? మరి అదే పని మేము చేస్తే అంతలా తిట్టిపోయాలా?' అని శివసేన ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించారు. గత ఆదివారం ప్రధాని మోదీ ముంబైలో దాదాపు ఏడు గంటలకు పైగా గడిపారు. ఆయన పాల్గొన్న ఏ కార్యక్రమానికీ శివసేన మంత్రులు హాజరుకాలేదు. తాము హాజరుకావాలంటే.. తమ నాయకుడు ఉద్దవ్ ఠాక్రేను కూడా మోదీ కార్యక్రమాలకు ఆహ్వానించాలని వారు షరతు పెట్టారు. ప్రొటోకాల్ రీత్యా ఎలాంటి రాజ్యాంగ పదవిలోలేని ఉద్దవ్ ను ప్రధాని కార్యక్రమానికి ఆహ్వానించడం కుదరదని ఫడ్నవిస్ సర్కారు తేల్చిచెప్పింది. ఇది శివ సైనికుల ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది. పిలవరని తెలిసీ శివసేన మంత్రులు అలా అడగటం వెనుక ఉద్దేశం బీజేపీకీ తెలుసు!



ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. అతి కొద్ది సమయంలోనే అంటే వారంలోపే శివసేన మంత్రులు ప్రభుత్వం నుంచి బయటికి వచ్చేస్తారని తెలుస్తోంది. పుస్తకావిష్కరణ రచ్చ జరిగిన తర్వాత శివసేన పార్టీ ముఖ్యనేత ఒకరు మాట్లాడుతూ.. పార్టీ చీఫ్ ఉద్దవ్ ఆదేశమే తరువాయి పదవులకు రాజీనామాలు చేసేందుకు 10 మంది మంత్రులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముంబై శివారు ప్రాంతాలను కలిపి ఏర్పాటు చేసిన కల్యాణ్- దోంబివాలి కార్పొరేషన్ తోపాటు, కొల్హాపూర్ కార్పొరేషన్ కూ నవంబర్ 1 న ఎన్నికలు జరగనున్నాయి. బృహన్ ముంబై తర్వాత పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావించేది కల్యాణ్- దొంబివాలినే. మొత్తం 122 డివిజన్లలో ఒంటరిగా పోటీచేస్తున్నట్లు శివసేన పార్టీ మంగళవారం స్పష్టత ఇచ్చింది.



దేశవ్యాప్తంగా మోదీ, బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఆ పార్టీతోనే అంటకాగితే స్థానిక ఎన్నికల్లో పరాభవం తప్పదని శివసేన భావిస్తోంది. మరీ ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు.. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనకు బదిలీ కాకూడదని కోరుకుంటోంది. అందుకే ముందుజాగ్రత్తగా ప్రభుత్వంలో ఉంటూనే బీజేపీ వ్యతిరేక ప్రకటనలు, బీజేపీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు అడ్డుతగులుతోంది. వైదొలగటం కేవలం మంత్రి పదవులవరకే పరిమితమవుతుందా? లేక ఫడ్నవిస్ సర్కారును కూలదోసే వరకు వెళుతుందా? అనే విషయాన్ని అప్పుడే చెప్పడం కొంత కష్టం. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరట!

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top