మళ్లీ దారుణం

మళ్లీ దారుణం - Sakshi

  • పాఠశాలలో మరో చిన్నారిపై అత్యాచారం

  •  ఆర్కిడ్ ది ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘోరం

  •  ఆందోళన, ధర్నాలతో అట్టుడికిన బెంగళూరు

  •  పోలీసు అధికారులతో వాగ్వాదం

  •  సోమవారం వరకు స్కూల్ మూత, గట్టి బందోబస్తు

  • బెంగళూరు : నగరంలోని ఒక పాఠశాలలో మళ్లీ ఓ చిన్నారిపై అత్యాచారం జరిగింది. దీంతో ఆందోళన, ధర్నాలతో నగరం అట్టుడికింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలు బుధవారం వెలుగు చూశాయి. జాలహళ్లి మెయిన్ రోడ్డులో ఆర్కిడ్ ది ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇందులో ఉత్తర భారతదేశానికి చెందిన దంపతుల మూడున్నరేళ్ల కుమార్తె ఇదే స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఆ బాలికను స్కూల్ దగ్గర నుంచి ఆమె తల్లి ఇంటికి తీసుకువెళ్లింది.



    మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బాలిక జ్వరంతో అస్వస్థతకు గురైంది. ఏమి జరిగిందని తల్లి ప్రశ్నించగా.. స్కూల్‌లో ఉన్న అంకుల్ తనను తీసుకువెళ్లి ముద్దులు పెట్టి కొరికాడని ఆ బాలిక సమాధానమిచ్చింది. వెంటనే బాలికను సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలిక మర్మాంగాలపైగాయాలయ్యాయని, అత్యాచారం జరిగిందని వైద్యులు ధ్రువీకరించారు. ఆ బాలికను వెంటనే కొలంబియా ఏషియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్య నిపుణులు కూడా ఆ బాలికపై అత్యాచారం జరిగిందని ధ్రువీకరించారు. మంగళవారం రాత్రి ఆ బాలిక కుటుంబ సభ్యులు జాలహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

     

    వెంటనే స్పందించిన సీపీ ఎంఎన్ రెడ్డి




    ఈ విషయంపై బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి వెంటనే స్పందించారు. దర్యాప్తు చేయాలని నగర అడిషనల్ పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) అలోక్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. అలోక్ కుమార్, డీసీపీ టీఆర్ సురేష్ తదితరులు ఆర్కిడ్ ది ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. స్కూల్ యాజమాన్యం సహకారంతో అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందిని రాత్రి స్కూల్ దగ్గరకు పిలిపించి విచారణ చేశారు. అనుమానాస్పదంగా ప్రవర్తించిన వారి నుంచి పూర్తి సమాచారం రాబట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.

     

    కుటుంబ సభ్యుల ఆందోళన



    విషయం బయటకు పొక్కడంతో ఆర్కిడ్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చిన్నారిపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.  విషయం తెలుసుకున్న బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్, డీసీపీ టీఆర్ సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడే మకాం వేశారు.  



    విద్యార్థుల కుటుంబ సభ్యులు డీసీపీ సురేష్‌తో వాగ్వాదానికి దిగారు. మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల కుటుంబ సభ్యులతో పోలీసు అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ చర్చలు విఫలమయ్యాయి. తమ బిడ్డలను స్కూల్‌కు పంపించాలంటే భయంగా ఉందని కుటుంబ సభ్యులు.. తాము పూర్తి రక్షణ కల్పించామని స్కూల్ యాజమాన్యం అంటున్నారు.



    ముందు జాగ్రత చర్యగా యాజమాన్యం స్కూల్‌ను ఆదివారం వరకు మూసివేస్తున్నట్లు విద్యార్థుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా, బుధవారం రాత్రి రాష్ర్ట మహిళా సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్ ఆ పాఠశాలను సందర్శించారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తునకు సీఎం ఆదేశించారు.

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top