వామ్మో.. చిన్నమ్మ

వామ్మో.. చిన్నమ్మ


జైలు జీవితం నాటకం

ఖరీదైన ఫ్లాట్‌లోనే కాపురం

శిక్ష పెరిగే అవకాశం ఉందన్న డీఐజీ రూప

రూ.2 కోట్ల హవాలా సొమ్ముపై ఆధారాలు


పేరుకే జైలు జీవితం.. ఖరీదైన అపార్టుమెంటులోనే కాపురం.. ఐదు గదుల్లో సకల సౌకర్యాలు.. లెక్కకు మించిన అందమైన చుడీదార్లు.. రంగు రంగుల చీరలు.. వామ్మో చిన్నమ్మ..’ అనిపిస్తోందని బెంగళూరు జైల్లో చిన్నమ్మ జీవితంపై డీఐజీ రూప చెప్పిన మాటలు.



సాక్షి ప్రతినిధి, చెన్నై:

ముప్పై రెండేళ్లపాటూ జయలలితతో ఖరీదైన జీవితాన్ని అనుభవించిన శశికళ జైలు జీవితాన్ని తట్టుకోలేకపోయారు. జైలు నిబంధనలను తుంగలో తొక్కి లగ్జరీగా బతికేందుకు రూ.2 కోట్ల ముడుపులు ఇచ్చినట్లుగా డీఐజీ రూప శశికళ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. కర్ణాటక ప్రభుత్వాన్ని గడగడలాడించే ఆరోపణలు చేసిన ఫలితంగా జైళ్ల శాఖ నుంచి ట్రాఫిక్‌ విభాగ డీఐజీగా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఒక సాయంకాల తమిళ పత్రిక (తమిళ్‌ మురసు సాయంకాల దినపత్రిక)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ శనివారం ప్రచురితమైంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.



జైలులో చోటుచేసుకున్న అవకతవకలపై ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి  ఒక నివేదికను సమర్పించాను. ఆ నివేదికలో పేర్కొన్నవన్నీ నూరుశాతం నిజాలే. జైల్లోని పరిస్థితులపై నాకు ఫిర్యాదు రాగానే నాలుగుసార్లు తనిఖీలు నిర్వహించాను. తనిఖీలకు వెళ్లినపుడల్లా ఖైదీలను కొందరు అధికారులు బెదిరింపులకు గురిచేసేవారు. దీంతో కొన్ని విషయాలు నా దృష్టికి రాకుండా పోయాయి. శశికళకు ఐదు గదులు కేటాయించింది నిజం. ఆ గదుల్లో ఎల్‌ఈడీ టీవీ, మంచం, కుక్కర్, కాఫీ మేకర్, సూప్‌ తయారీ సామన్లు ఇలా గృహోపకరణ వస్తువులన్నీ ఉన్నాయి. రెండో రూములో లెక్కలేనన్ని చుడీదార్లు, చీరలు, నైటీలు ఉన్నాయి.



ఖైదీలు ధరించాల్సిన యూనిఫాంను ఆమె ఒక్కరోజు కూడా వేసుకోలేదని ఆమె గదిలో ఉన్న యూనిఫాం దుస్తుల మడతలే చెబుతున్నాయి. శశికళకు అవసరమైన మందులు బయట నుంచే వస్తున్నాయి. శశికళకు జైల్లో ఆపిల్‌ ఐ ఫోన్, రెండు సిమ్‌కార్డులున్నట్లు సమాచారం అందింది. అయితే ఆమెను తనిఖీ చేసినపుడు అవి దొరకలేదు. సెల్‌ఫోన్లు పనిచేయకుండా జైలులో అమర్చిన జామర్లు గురించి సిబ్బందిని ప్రశ్నించగా మరమ్మతులకు గురైనట్లు బదులిచ్చారు. శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు ఏదో ఒక పనిచేయాలి. అయితే శశికళ తదితరులు ఇంతవరకు ఏ పనీ చేయడం లేదు. రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇచ్చే ప్రయత్నంలో దినకరన్‌తోపాటూ పట్టుబడిన బెంగళూరు ప్రకాష్‌ జైల్లో అనేకసార్లు శశికళను కలుసుకున్న వైనాన్ని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.



అపార్టుమెంటులోనే చిన్నమ్మ

మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. శశికళ అసలు జైల్లోనే ఉండరు. జైలుకు సమీపంలోని ఒక అపార్టుమెంటులో నివసిస్తున్నట్లు నాకు సమాచారం అందింది. స్వయంగా పట్టుకోవాలని అనేకసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. జైలు నుంచి బయటకు వెళుతూ నాకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి ఉంటే తీసుకునే చర్యలు చాలా భయంకరంగా ఉండేవి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. నేను చేసిన ఆరోపణలు రుజువైన పక్షంలో ఆమెకు మరికొన్ని ఏళ్లు శిక్షపడే అవకాశం ఉంది. అని రూప చెప్పారు.



మరలా ఖైదీ జీవితం

శశికళకు రహస్యంగా సాగుతున్న లగ్జరీ సౌకర్యాల గుట్టు రట్టు కావడంతో బెంగళూరు పరప్పన అగ్రహార జైలును కట్టుదిట్టం చేశారు. శశికళ తనకు కేటాయించిన సెల్‌లోనే కాలం గడుపుతున్నారు. ఆమె సెల్‌ చుట్టూ అమర్చిన సీసీ కెమెరాలు పనిచేయడం ప్రారంభించాయి. జైలులో ఏం జరుగుతోంది అనే వివరాలు సీసీ కెమరాల ద్వారా బెంగళూరు శేషాద్రి రోడ్డులోని జైళ్లశాఖ అదనపు డీజీపీ, డీఐజీ గదుల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. దీంతో గత సోమవారం నుంచి జైలులో ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోలేదు. బయటనుంచి వచ్చే భోజనం బంద్‌ కావడంతో ఇతర ఖైదీలకు ఇచ్చే ఆహారాన్నే శశికళ ఆరగిస్తున్నారు.



రేపే తొలి విచారణ పత్రం సమర్పణ

డీఐజీ రూప ఏకంగా తనపై అధికారి డీజీపీపైనే ఆరోపణలు చేయడంతో కర్ణాటక ప్రభుత్వం రిటైర్డు అధికారి వినయ్‌కుమార్‌ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. చెన్నైకి చెందిన ఒక ప్రముఖుడు శశికళకు ఏసీ, స్టవ్, ఫ్రిడ్జ్‌ సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. రూ.2 కోట్ల హవాలా సొమ్ము అధికారులకు ముట్టినట్లుగా విచారణాధికారులకు ఆధారాలు దొరికినట్లు సమాచారం. దీంతో తమ తొలిదశ విచారణ నివేదికను ఈనెల 24వ తేదీన కర్ణాటక ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయితే బెంగళూరు జైలు అధికారులు పలువురు సస్పెండ్‌ అవుతారని అంచనా.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top