కృత్రిమంగా కురిపిద్దాం..

కృత్రిమంగా కురిపిద్దాం.. - Sakshi


- కృత్రిమ వర్షాల గురించి యోచిస్తున్న ప్రభుత్వం

- రుతుపవనాల రాక ఆలస్యమయితే ప్రయోగించేందుకు ప్రణాళిక

- మరాఠ్వాడా వద్ద ఉన్న

- అమరావతి కేంద్రంగా ప్రయోగం

- 1993, 2003లో చేపట్టిన

- గత ప్రభుత్వాలు

సాక్షి, ముంబై:
ఎండలు మండిపోతుండటంతోపాటు వర్షకాలంలో వస్తున్న మార్పుల కారణంగా నష్టపోతున్న రైతులను దృష్టిలో ఉంచుకుని కృత్రిమ వర్షాల వైపు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం వాతావరణ శాఖ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రోలజీ విభాగం, రాష్ట్ర ప్రభుత్వం, పునరావాస విభాగం అధికారులతో కూడిన ఓ సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి త్వరలో కృత్రిమ వర్షాలకు సంబంధించిన పనులు ప్రారంభించనుంది. కరవు ప్రాంతాలైన మరాఠ్వాడా, విదర్భ మధ్య భాగం అమరావతిని కేంద్రంగా ఇందుకు ఎన్నుకున్నారు.



ఇప్పటికే ఈ అంశంపై నాలుగైదు సమావేశాలను కూడా నిర్వహించినట్టు మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే స్పష్టం చేశారు. 1993, 2003లో కృత్రిమ వర్షాల కోసం గత ప్రభుత్వాలు ప్రయోగాలు చేశాయి. అయితే అప్పుడు ప్రయోగాలను ఆలస్యంగా చేశారని, ఈ సారి జూన్ 15లోపు కృత్రిమ వర్షాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్టు సమితి అధికారి సుహాస్ దివసే తెలిపారు. రుతుపవనాలు రాక ఆలస్యం అవుతుందని తెలిస్తే వెంటనే కృత్రిమ వర్షాలను కురిపించనున్నట్టు పేర్కొన్నారు.



ప్రత్యామ్నాయాల వైపు ముంబై చూపు

ప్రస్తుతం ముంబైలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అప్పర్ వైతర్ణ జలాశయం ఇప్పటికే అడుగంటిపోయింది. ఇతర జలాశయాల్లో కూడా రెండు నెలలకు సరిపడా నీరు మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో నీటి మట్టం కూడా చాలా వేగంగా తగ్గిపోతోంది. దీంతో అధికారుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రత్యామ్నాయ మార్గాలపై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) దృష్టి సారించినట్టు సమాచారం. నగరంలో ప్రతిరోజు దాదాపు 3,750 ఎమ్మెల్డీల నీరు సరఫరా అవుతోంది.



ఈ లెక్కన ఏడాది పొడవునా సరఫరా సక్రమంగా జరగాలంటే కనీసం 14 లక్షల ఎమ్మెల్డీల నీటి నిల్వలు అవసరమవుతాయి. నీటి దొంగతనం, లీకేజీ, ఇతర కారణాల వల్ల సుమారు 700 ఎమ్మెల్డీల నీరు రోజూ వృథాగా పోతోంది. దీంతో వర్షాలు సమయానికి రాకపోతే కృత్రిమ వర్షాల ప్రయోగం మరోసారి చేయాలని బీఎంసీ అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే కృత్రిమ వర్షాల ప్రక్రియ భారీ వ్యయం, రిస్క్‌తో కూడుకున్నది కావడంతో పరిపాలన విభాగం ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. ఇప్పటికే ఈ విషయంపై సంబంధిత నిపుణులతో చర్చలు కూడా ప్రారంభించింది. 2009లో వర్షాలు ముఖం చాటేయడంతో భాత్సా, అప్పర్ వైతర్ణ జలాశయాల పరిధిలో కృత్రిమ వర్షం ప్రయోగం చేశారు. కాని అది ఊహించిన విధంగా సఫలీకృతం కాలేకపోయింది.



ఇందుకోసం వినియోగించిన విమానాలు సరిగా పనిచేయకపోవడం, రాడార్ కారణంగా 160 సార్లు మేఘాలపై రసాయనాలు పిచికారి చేసినప్పటికీ ఫెయిల్ అవడం వంటివి జరిగాయి. ఆ తరువాత ఓ మోస్తరు వర్షాలు కురవడంతో నీటి కొరత సమస్య కొంత మేర తీరింది. గత మూడు నాలుగేళ్ల నుంచి సగటు వర్షపాతం నమోదు అవుతుండటంతో కృత్రిమ వర్షాల ప్రయోగం చేయాల్సిన అవసరం బీఎంసీకి రాలేదు. ఈ సారి పరిస్థితి ఎలా ఉండబోతుందనేది జూన్ మొదటి వారంలోపు స్పష్టం కానుంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top